Share News

Mahua Moitra : మహువాపై బహిష్కరణ వేటు

ABN , First Publish Date - 2023-12-09T04:23:31+05:30 IST

తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ (లోక్‌సభ) మహువా మొయిత్రాపై బహిష్కరణ వేటు పడింది. పార్లమెంటులో ప్రశ్నలు వేయడానికి ఆమె నగదు, కానుకలు తీసుకున్నారంటూ వచ్చిన ఆరోపణలపై

Mahua Moitra : మహువాపై బహిష్కరణ వేటు

ప్రశ్నకు నగదు తీసుకున్నారన్న ఆరోపణలపై

లోక్‌సభ ముందుకు ఎథిక్స్‌ కమిటీ నివేదిక

ప్రవేశపెట్టిన అరగంటలోనే.. ఆమెను సభ

నుంచి బహిష్కరించాలంటూ తీర్మానం

మూజువాణి ఓటు ద్వారా ఆమోదించిన సభ

మహువాకు మాట్లాడే చాన్స్‌ ఇవ్వని స్పీకర్‌

న్యూఢిల్లీ, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ (లోక్‌సభ) మహువా మొయిత్రాపై బహిష్కరణ వేటు పడింది. పార్లమెంటులో ప్రశ్నలు వేయడానికి ఆమె నగదు, కానుకలు తీసుకున్నారంటూ వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన ఎథిక్స్‌ కమిటీ.. శుక్రవారం 495 పేజీల నివేదికను సభకు సమర్పించింది. ఆ నివేదికను ప్రవేశపెట్టిన అరగంటలోపే మహువా లోక్‌సభ సభ్యత్వంపై వేటు వేస్తూ స్పీకర్‌ ఓం బిర్లా నిర్ణయం తీసుకున్నారు. ఎథిక్స్‌ కమిటీ నివేదికపై సభలో వాడీవేడిగా చర్చ జరిగింది. ఆ సమయంలో మహువా తన వాదన వినిపించేందుకు స్పీకర్‌ అనుమతి ఇవ్వలేదు. 2005లో ప్రశ్నకు నగదు ఆరోపణలు ఎదుర్కొన్న 10 మంది సభ్యులకు కూడా నాటి స్పీకర్‌ సోమ్‌నాథ్‌ చటర్జీ ఇలాగే సభలో మాట్లాడే అవకాశం ఇవ్వలేదని గుర్తుచేశారు.

ఆమెకు అనుమతి ఇవ్వాలని తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీలు చేసిన అభ్యర్థనను తిరస్కరించారు. 495 పేజీల నివేదికను పరిశీలించేందుకు మరింత సమయం కావాలని కాంగ్రెస్‌, టీఎంసీ తదితర పార్టీలు చేసిన విజ్ఞప్తిని ఆ యన తోసిపుచ్చారు. మహువాను సభ నుంచి బహిష్కరించాలంటూ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌జోషి.. 2005లో సైతం నాటి సభాపక్ష నేత ప్రణబ్‌ ముఖర్జీ ఇలాగే ఎథిక్స్‌ కమిటీ నివేదిక వచ్చినరోజే 10 మంది సభ్యుల బహిష్కరణ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన విషయాన్ని గుర్తుచేశారు. అనంతరం ఆ తీర్మానాన్ని సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. మహువా మొయిత్రా అనైతికంగా వ్యవహరించినట్టు ఎథిక్స్‌ కమిటీ నిర్ధారించిందని.. కమిటీ నివేదికను సభ కూడా ఆమోదించినందువల్ల ఆమె ఎంపీగా కొనసాగడం సరైంది కాదని ఓం బిర్లా పేర్కొన్నారు.

ఇది అన్యాయం..

తనను లోక్‌సభ నుంచి అన్యాయంగా బహిష్కరించారని మహువా మొయిత్రా ఆవేదన వ్యక్తం చేశారు. సభలో ప్రశ్నలు అడగడానికిగాను.. తనకు నగదుగానీ, బహమతులుగానీ ముట్టాయనడానికి సాక్ష్యాలేవీలేవని, ఇచ్చినట్టు ఆరోపిస్తున్న హీరానందానీని సైతం ఎథిక్స్‌ కమిటీ విచారించలేదని పేర్కొన్నారు. తనపై వేటును.. ‘కంగారూ కోర్ట్‌ (తప్పు చేయకున్నా ఒక వ్యక్తిని అన్యాయంగా ఇరికించడానికి, నేరస్థుడిగా నిర్ధారించడానికి నిర్వహించే అనధికార కోర్టు)ఉరిశిక్ష వేయడంగా అభివర్ణించారు. కేవలం లాగిన్‌ వివరాలను ఇతరులతో పంచుకున్నాననే ఆరోపణలపైన.. నైతికప్రవర్తనకు సంబంధించి నియమావళిలో ఎక్కడా లేని అంశాలను తాను ఉల్లంఘించానంటూ బహిష్కరణ వేటు వేశారని ఆగ్రహం వెలిబుచ్చారు. ఎథిక్స్‌ కమిటీ అన్ని నిబంధనలనూ ఉల్లంఘించిందని ఆరోపించారు.

ఇదీ నేపథ్యం..

మహువా మొయిత్రా పార్లమెంటు లాగిన్‌ వివరాలను ఉపయోగించడం ద్వారా పారిశ్రామిక వేత్త దర్శన్‌ హీరానందానీ.. గౌతమ్‌ అదానీకి, ఆయన గ్రూపునకు వ్యతిరేకంగా ప్రశ్నలు అడిగారంటూ సుప్రీంకోర్టు న్యాయవాది జై అనంత్‌ దేహద్‌రాయ్‌ బీజేపీ ఎంపీ నిశికాంత్‌ దుబేకు ఫిర్యాదు చేశారు. హీరానందానీ, మహువా తరుచూ మాట్లాడుకునేవారని.. ఆమెకు ఆయన ఐఫోన్లు, వజ్రాల నగలు, విలువైన బహుమానాలు, కట్టలు కట్టలు పౌండ్‌ స్టెర్లింగ్‌ నగదు ఇవ్వగా తాను చూశానని అందులో పేర్కొన్నారు. మహువా సిబ్బందికి కూడా ఆయనే జీతాలు ఇచ్చేవారని తెలిపారు. ఈ ఫిర్యాదును అక్టోబరు 15న దుబే లోక్‌సభ స్పీకర్‌కు అందజేశారు. స్పీకర్‌ ఓంబిర్లా ఈ ఫిర్యాదును ఎథిక్స్‌ కమిటీకి పంపారు. నవంబరు 2న కమిటీ విచారణ చేపట్టి నిశికాంత్‌ దుబే, జై అనంత్‌, మహువా మొయిత్రాను విచారించి, నివేదికను శుక్రవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. వెంటనే ఆమెపై బహిష్కరణ వేటు పడింది.

దీదీ ఆగ్రహం..

మహువా మొయిత్రాపై వేటు వేయడం పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని వంచించడమేనని టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. ‘‘ఇది పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి అవమానం. బీజేపీ ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతోంది’’ అని ధ్వజమెత్తారు. అసలు.. 495 పేజీల నివేదికను చదవడానికి కేవలం 30 నిమిషాల సమయం ఇవ్వడమేంటని నిప్పులు చెరిగారు. ఇక.. ఇండియా కూటమికి చెందిన పలువురు నేతలు కూడా మహువాపై వేటును తీవ్రంగా ఖండిస్తూ సభనుంచి వాకౌట్‌ చేశారు.

Updated Date - 2023-12-09T04:23:32+05:30 IST