‘ట్రాన్స్‌’ కథా చిత్రమ్‌!

ABN , First Publish Date - 2023-01-25T01:03:14+05:30 IST

నువ్వంటే నాకిష్టం.. నువ్వు లేక నేను లేను! ఇవి అమ్మాయి, అబ్బాయి అనుకున్న మాటలు కావు.. ఇద్దరమ్మాయిలు పరస్పరం ప్రేమించుకొని చెప్పుకున్న ఊసులు! ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకొని.. వారిలో ఒకరు అబ్బాయిగా మారడం ఈ కథలో మరో ట్విస్ట్‌! అయితే ఆ తర్వాతే కథ అడ్డం తిరిగింది.

‘ట్రాన్స్‌’ కథా చిత్రమ్‌!

యూపీలో ఇద్దరమ్మాయిల ప్రేమ

పెళ్లి కోసం ఒకరి లింగమార్పిడి..తర్వాతే ట్విస్ట్‌

మరో యువకుడితో ఆమె ప్రేమ.. కోర్టుకు ‘అతడు’

ఝాన్సీ, జనవరి 24: నువ్వంటే నాకిష్టం.. నువ్వు లేక నేను లేను! ఇవి అమ్మాయి, అబ్బాయి అనుకున్న మాటలు కావు.. ఇద్దరమ్మాయిలు పరస్పరం ప్రేమించుకొని చెప్పుకున్న ఊసులు! ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకొని.. వారిలో ఒకరు అబ్బాయిగా మారడం ఈ కథలో మరో ట్విస్ట్‌! అయితే ఆ తర్వాతే కథ అడ్డం తిరిగింది. మరో అబ్బాయిని ఇష్టపడిన ఆమె, లింగ మార్పిడితో ‘అతడుగా మారిన ఆమె’ను దూరం పెట్టడమే కాదు.. ఆ ‘అతడు’ తనపై అత్యాచారం చేశాడని ఆరోపించింది. యూపీలోని ఝాన్సీలో జరిగిందీ ఘటన. పోలీసుల వివరాల ప్రకారం.. తల్లిదండ్రులతో కలిసి ఉంటున్న సోనల్‌ ఇంట్లోకి సనా పేయింగ్‌ గెస్ట్‌గా చేరింది. కొన్నాళ్లకే ఆ ఇద్దరమ్మాయిల మధ్య స్నేహం కుదిరి ప్రేమగా మారి నాలుగు నెలల్లోనే సహజీవనం చేసే వరకూ వెళ్లింది. సనా ప్రభుత్వ ఉద్యోగి. ఆమెకు బదిలీ కావడంతో 2017 ఆగస్టు 10న తనకు కేటాయించిన క్వార్టర్‌కు మారింది. సన విరహాన్ని తాళలేక నాలుగు రోజుల్లోనే సోనల్‌ ఆమె దగ్గరకు వెళ్లిపోయింది. కొన్నాళ్లకు తాను అబ్బాయిగా మారాలంటూ సనా ముందు సోనల్‌ ప్రతిపాదన పెట్టి.. ఆమెను ఒప్పించింది. ఇద్దరూ కలిసి ఢిల్లీలోని సిర్‌ గంగారాం ఆస్పత్రికి వెళ్లారు. సర్జరీ తర్వాత 2020 జూన్‌ 22న సనా తన పేరును అధికారికంగా ‘సొహైల్‌ ఖాన్‌’గా మార్చుకుంది. పైగా సర్జరీ కోసం అవసరమైన పత్రాలపై తాను సనాకు భార్య అని సోనల్‌ సంతకం చేయడం విశేషం. ఈ నేపథ్యంలోనే సోనల్‌ ఓ ఆస్పత్రిలో ఉద్యోగం సంపాదించింది. జాబ్‌లో చేరాక సోనల్‌ ప్రవర్తనలో మార్పు వచ్చిందని.. తనను అకారణంగా దూరం పెడుతోందని సొహైల్‌ గ్రహించాడు. సోనల్‌ తాను పనిచేసే ఆస్పత్రిలో ఉద్యోగం చేస్తున్న జ్ఞాన్‌ అనే యువకుడితో ప్రేమలో పడింది. సొహైల్‌ను విడిచి వెళ్లిపోయింది. పైగా సొహైల్‌ తనపై అత్యాచారం చేశాడంటూ పోలీసు కేసు పెట్టింది. పోలీసుల ఎదుట సొహైల్‌ తన బాధనంతా వెళ్లగక్కినా పలితం లేకపోవడంతో తనకు న్యాయం చేయాలంటూ కోర్టుకెక్కాడు.

Updated Date - 2023-01-25T01:03:15+05:30 IST