Share News

మధ్యప్రదేశ్‌లో టికెట్ల చిచ్చు!

ABN , First Publish Date - 2023-10-25T02:23:53+05:30 IST

మధ్యప్రదేశ్‌లో ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌.. తిరుగుబాట్లతో తలలు పట్టుకుంటున్నాయి. అసెంబ్లీ టికెట్లు దక్కని నాయకులు పెద్దఎత్తున బలప్రదర్శనకు దిగుతున్నారు.

మధ్యప్రదేశ్‌లో టికెట్ల చిచ్చు!

బీజేపీ, కాంగ్రె్‌సలకు తిరుగుబాట్ల బెడద..

ఇతర పార్టీల్లోకి ఫిరాయింపులు..

అగ్ర నేతల వద్ద ఆందోళనలు

భోపాల్‌, అక్టోబరు 24: మధ్యప్రదేశ్‌లో ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌.. తిరుగుబాట్లతో తలలు పట్టుకుంటున్నాయి. అసెంబ్లీ టికెట్లు దక్కని నాయకులు పెద్దఎత్తున బలప్రదర్శనకు దిగుతున్నారు. కొందరైతే ఏకంగా ఇతర పార్టీల్లోకి ఫిరాయించేస్తున్నారు. ప్రధానంగా బీజేపీ ఈ దఫా ముగ్గురు మంత్రులు సహా 32 మంది సిటింగ్‌లకు టికెట్లు నిరాకరించింది. మొత్తం 230 అసెంబ్లీ స్థానాలకు గాను 228 చోట్ల అభ్యర్థులను ప్రకటించింది. గుణ, విదిశలకు ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. చంబల్‌ ప్రాంతంలో మంచి పలుకుబడి ఉన్న మాజీ ఐపీఎస్‌ అధికారి రుస్తుం సింగ్‌(78)కు టికెట్‌ దక్కకపోవడంతో ఆయన బీఎస్పీలో చేరిపోయారు. భోపాల్‌ (నైరుతి) టికెట్‌ రాక మాజీ మంత్రి ఉమాశంకర్‌ గుప్తా (71) ఆస్పత్రిపాలయ్యారు. గత ఎన్నికల్లో ఆయన 6 వేల ఓట్ల తేడాతో అక్కడ ఓడిపోయారు. ఇప్పుడు ఆయన్ను పక్కనబెట్టి భగవాన్‌ దాస్‌ సబ్నానీకి టికెట్‌ ఇచ్చారు. దీంతో ముగ్గురు కార్పొరేటర్లు సహా 200 మంది బీజేపీ సభ్యులు పార్టీకి రాజీనామా చేశారు. అలాగే ఖాండ్వా టికెట్‌ తనకు రాకపోవడంతో మధ్యప్రదేశ్‌ బీజేపీ మాజీ అధ్యక్షుడు నందకుమార్‌ చౌహాన్‌ కుమారుడు హర్షవర్ధన్‌ చౌహాన్‌ అనుచరులతో కలిసి పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. నందకుమార్‌ మరణంతో జరిగిన ఖాండ్వా లోక్‌సభ ఉప ఎన్నికలోనూ హర్షవర్ధన్‌కు టికెట్‌ ఇవ్వలేదు. మాజీ మంత్రులు రంజనా బఘేల్‌, పరస్‌ జైన్‌, మాజీ ఎమ్మెల్యే రసల్‌సింగ్‌ కూడా తిరుగుబాటు చేశారు. కనీసం 20 స్థానాల్లో నిరసనలు జరుగుతున్నాయని బీజేపీ నాయకుడొకరు తెలిపారు. జబల్‌పూర్‌ ఉత్తర స్థానంలో అభిలాష్‌ పాండేకు టికెట్‌ ఇవ్వనందుకు కార్యకర్తలు గత శనివారం కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ ఇన్‌చార్జి భూపేంద్ర యాదవ్‌ గార్డుపై దాడిచేశారు.

కమల్‌నాథ్‌ నివాసం వద్ద ఆందోళన..

సుజల్‌పూర్‌, హోషంగాబాద్‌ నియోజకవర్గాల కాంగ్రెస్‌ కార్యకర్తలు సోమవారం పీసీసీ అధ్యక్షుడు, మాజీ సీఎం కమల్‌నాథ్‌ నివాసం ఎదుట ఆందోళనకు దిగారు. అంతకుముందురోజు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మురళీ మోర్వాల్‌ 50 మంది అనుచరులతో కలిసి అక్కడే నిరసన చేపట్టారు. ఓ కార్యకర్త ఆత్మహత్యకు కూడా ప్రయత్నించారు. మరో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అజబ్‌సింగ్‌ కుశ్వాహా తిరుగుబాటు చేసి.. బీఎస్పీ టికెట్‌పై సుమావలి నుంచి బరిలోకి దిగనున్నారు. మాజీ ఎంపీ గజేంద్రసింగ్‌ రాజుఖేదీ, నాసిర్‌ ఇస్లాం, కేదార్‌ కన్సానా కూడా అదే పార్టీ తరఫున పోటీచేయనున్నారు. రెబెల్స్‌ బుజ్జగింపులో రెండు పార్టీల నాయకత్వాలు విఫలమయ్యాయని రాజకీయ విశ్లేషకుడు దినేశ్‌ గుప్తా వ్యాఖ్యానించారు. అంతా హైకమాండ్‌ చూసుకుంటోందని.. సర్వేల ఆధారంగానే అభ్యర్థులను నిర్ణయిస్తోందని చెబుతూ తప్పించుకుంటున్నాయని తెలిపారు. అయితే సర్వేలను పక్కనపెట్టేశారని.. జాబితా తయారీని రాష్ట్ర నాయకులు ప్రభావితం చేశారని.. అందుకే తిరుగుబాట్లు చెలరేగుతున్నాయని పేర్కొన్నారు.

అలుపెరుగని ఓటమి!

ఇండోర్‌ : 35 ఏళ్లుగా 18 సార్లు పలు ఎన్నికల్లో పోటీ చేసి కనీసం డిపాజిట్‌ కూడా దక్కించుకోని ఓ వ్యక్తి.. ఏమాత్రం కలత చెందకుండా, ఎలాంటి సంకోచం లేకుండా మరోసారి పోటీకి సై అంటున్నారు. ఆయనే మధ్యప్రదేశ్‌కు చెందిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి 63 ఏళ్ల పరమానంద్‌ తొలానీ. ఇండోర్‌ మునిసిపల్‌ ఎన్నికలు సహా అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు కూడా పరమానంద్‌ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ పడ్డారు. ఇలా 35 ఏళ్లలో మొత్తం 18 సార్లు ఆయన ఎన్నికల బరిలో నిలిచారు. అయితే, ఆయన ఏ ఒక్క ఎన్నికలోనూ డిపాజిట్‌ను సైతం రాబట్టుకోలేక పోయారు. అయినప్పటికీ ఎక్కడా నిరుత్సాహం చెందకపోవడం విశేషం. అంతేకాదు, ఎన్నికల పోటీ చేసిన ప్రతిసారీ తన ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుందని ఆయన చెబుతున్నారు. తాజాగా జరుగుతున్న మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల బరిలో పరమానంద్‌ మరోసారి పోటీకి రెడీ అయిపోయారు. ఇండోర్‌-4 శాసనసభ స్థానానికి పరమానంద్‌ సోమవారం స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు.

Updated Date - 2023-10-25T02:23:53+05:30 IST