Sonia : ఇది మన బిల్లు

ABN , First Publish Date - 2023-09-20T04:00:47+05:30 IST

మహిళా రిజర్వేషన్‌ బిల్లు ఘనత బీజేపీ-మోదీ ఖాతాలోకి వెళ్లే అవకాశం ఉండడంతో కాంగ్రెస్‌ అప్రమత్తమైంది. ఈ బిల్లు యూపీఏ ప్రభుత్వ హయాంలోనే పార్లమెంటులో పెట్టిన సంగతిని ఆ పార్టీకి చెందిన

Sonia : ఇది మన బిల్లు

మహిళా బిల్లు మీద కాంగ్రెస్‌ అగ్ర నేత స్పందన

భారీ ఎన్నికల మోసం.. పెద్ద ద్రోహం: కాంగ్రెస్‌

రిజర్వేషన్ల ప్రస్తావన లేకున్నా మద్దతు: మాయావతి

మహిళా బిల్లు మీద సోనియా

కాంగ్రెస్‌, మిత్రపక్షాల విజయమన్న చిదంబరం

పదేళ్లు ఎందుకాగారు?: సిబల్‌

బీసీ, ఎస్సీ, ఎస్టీలకు న్యాయం చేయాలి: అఖిలేశ్‌

న్యూఢిల్లీ, సెప్టెంబరు 19: మహిళా రిజర్వేషన్‌ బిల్లు ఘనత బీజేపీ-మోదీ ఖాతాలోకి వెళ్లే అవకాశం ఉండడంతో కాంగ్రెస్‌ అప్రమత్తమైంది. ఈ బిల్లు యూపీఏ ప్రభుత్వ హయాంలోనే పార్లమెంటులో పెట్టిన సంగతిని ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు గుర్తుచేశారు. కాంగ్రెస్‌ అగ్ర నేత సోనియాగాంధీ.. ‘‘ఇది మా బిల్లు’’ అంటూ ఇంగ్లిష్‌, హిందీలో ప్రస్తావించారు. మంగళవారం పార్లమెంటులోకి ప్రవేశిస్తుండగా మీడియా అడిగిన ప్రశ్నకు ఈ విధంగా బదులిచ్చారు. సీనియర్‌ నేత చిదంబరం.. బీజేపీ ప్రభుత్వం బిల్లును ప్రవేశపెట్టడం అంటే.. కాంగ్రెస్‌, యూపీఏ ప్రభుత్వంలోని దాని మిత్రపక్షాలు సాధించిన విజయంగా అభివర్ణించారు. మరికొందరు నాయకులు సైతం.. 13 ఏళ్ల కిందటనే కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో మహిళా బిల్లును పార్లమెంటులో పెట్టిన విషయాన్ని పేర్కొన్నారు. కాగా, ఎన్నికల సీజన్‌లో మహిళా బిల్లును తేవడం అతిపెద్ద మోసంగా కాంగ్రెస్‌ అభివర్ణించింది. జనాభా లెక్కలు, నియోజకవర్గాల పునర్విభజన తర్వాత రిజర్వేషన్‌ అమలవుతుందనడాన్ని కోట్లాది మహిళలకు చేస్తున్న ద్రోహంగా పేర్కొంది. 2021లోనే చేయాల్సిన జన గణన ఇప్పటికీ మొదలుకాలేదని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ ప్రస్తావించారు. ఇదో ఎన్నికల మేనేజ్‌మెంట్‌ వ్యూహమని విమర్శించారు.

2010లో బిల్లును రాజ్య సభలో పెట్టినపుడు బీజేపీ సహకరించలేదని అప్పటి న్యాయ మంత్రి వీరప్ప మొయిలీ తప్పుబట్టారు. కాగా, మహిళా రిజర్వేషన్‌ బిల్లులో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీ కోటా మీద స్పష్టత ఇవ్వాలని యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌ డిమాండ్‌ చేశారు. రిజర్వేషన్ల ప్రస్తావన లేకున్నా బిల్లుకు మద్దతు ఇస్తామని బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి ప్రకటించారు. ఎన్నికలు రాబోత్నుందునే బిల్లును తెరపైకి తెచ్చారని.. దాదాపు అన్ని పార్టీలు ఆమోదం తెలిపినా బిల్లు విషయంలో మోదీ పదేళ్లుగా ఏం చేశారని ఎంపీ కపిల్‌ సిబల్‌ ప్రశ్నించారు. మహిళా బిల్లును కేబినెట్‌ ఆమోదించడాన్ని గొప్ప ముందడుగుగా పీడీఎఫ్‌ చీఫ్‌ మెహబూబా ముఫ్తీ పేర్కొంటే.. మహిళా రిజర్వేషన్‌కు తాము వ్యతిరేకం కాదని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఉపాధ్యక్షుడు ఒమర్‌ అబ్దుల్లా తెలిపారు..

Updated Date - 2023-09-20T04:00:47+05:30 IST