రాజద్రోహ సెక్షన్‌ ఉండాల్సిందే

ABN , First Publish Date - 2023-06-02T02:53:43+05:30 IST

రాజద్రోహ సెక్షన్‌ను కొనసాగించాల్సిన అవసరం ఉందని లా కమిషన్‌ అభిప్రాయపడింది. అయితే దీని అమలుపై మరింత స్పష్టతనిస్తూ తగిన సవరణలు చేయాల్సి ఉందని తెలిపింది.

రాజద్రోహ సెక్షన్‌ ఉండాల్సిందే

కేంద్రానికి లా కమిషన్‌ నివేదిక

న్యూఢిల్లీ, జూన్‌ 1: రాజద్రోహ సెక్షన్‌ను కొనసాగించాల్సిన అవసరం ఉందని లా కమిషన్‌ అభిప్రాయపడింది. అయితే దీని అమలుపై మరింత స్పష్టతనిస్తూ తగిన సవరణలు చేయాల్సి ఉందని తెలిపింది. రాజద్రోహం కేసులు నమోదు చేయడానికి వీలు కలిగిస్తున్న ఇండియన్‌ పీనల్‌ కోడ్‌లోని సెక్షన్‌ 124ఏపై ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో ఈ విషయాన్ని పేర్కొంది. ఈ సెక్షన్‌ను దుర్వినియోగ పరిచి అక్రమంగా కేసులు నమోదు చేయకుండా నిరోధించడానికి తగిన మార్గదర్శకాలు జారీ చేయాలని కేంద్రానికి సిఫార్సు చేసింది. ఈ మేరకు 22వ లా కమిషన్‌ ఛైర్మన్‌, విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ రితురాజ్‌ అవస్థి.. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రాం మేఘ్వాల్‌కు లేఖ రాశారు.

నిబంధనలను దుర్వినియోగం చేస్తున్నారని చెప్పి 124ఏ సెక్షన్‌నే మొత్తంగా రద్దు చేయాలని భావించడం తగదని లా కమిషన్‌ తెలిపింది. దుర్వినియోగం చేసిన వారు ఒక్కరుంటే ఆ చట్టం అవసరమున్నవారు పది మంది ఉంటారని వివరించింది. బ్రిటి్‌షపాలన నాటి వారసత్వమన్న కారణం చూపి కూడా రద్దు చేయలేరని పేర్కొంది. నిజానికయితే మొత్తం న్యాయ వ్యవస్థే బ్రిటిష్‌ పాలన నుంచి వారసత్వంగా వచ్చిందని గుర్తు చేసింది. ఈ సెక్షన్‌ లేకుంటే దేశ భద్రతపై ప్రభావం చూపుతుందని తెలిపింది. సెక్షన్‌ 124ఏ కొనసాగింపుపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని కేంద్ర న్యాయశాఖ కోరిన నేపథ్యంలో ఈ సిఫార్సులు చేసింది.

Updated Date - 2023-06-02T02:53:43+05:30 IST