Share News

దేశంలో నాలుగే కులాలు

ABN , First Publish Date - 2023-12-01T04:16:30+05:30 IST

గత పదేళ్లుగా చేపట్టిన కార్యక్రమాలతో ప్రజల్లో తన ప్రభుత్వంపై అపార విశ్వాసం ఏర్పడిందని ప్రధాని మోదీ తెలిపారు.

దేశంలో నాలుగే కులాలు

పేదలు, యువత, మహిళలు, రైతులు ఎదిగితేనే దేశాభివృద్ధి: మోదీ

ప్రజలే నాకు దేవుళ్లు

12 వేల గ్రామాలకు చేరిన ‘వికసిత్‌ భారత్‌ సంకల్ప్‌ యాత్ర’

లబ్ధిదారులతో వర్చువల్‌గా ప్రధాని సంభాషణ

న్యూఢిల్లీ, నవంబరు 30: గత పదేళ్లుగా చేపట్టిన కార్యక్రమాలతో ప్రజల్లో తన ప్రభుత్వంపై అపార విశ్వాసం ఏర్పడిందని ప్రధాని మోదీ తెలిపారు. తనకు సంబంధించినంతవరకు దేశంలో నాలుగే నాలుగు పెద్ద కులాలు.. పేదలు, యువత, మహిళలు, రైతులు.. ఉన్నట్లు చెప్పారు. వారు పురోగమిస్తేనే భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా రూపాంతరం చెందుతుందన్నారు. ప్రజలంటే తనకు దేవుళ్లని, గత ప్రభుత్వాలు మాత్రం తమను తాము యజమానులుగా భావించేవని చెప్పారు. ఓటుబ్యాంకు రాజకీయాలే కేంద్రంగా వాటి అభివృద్ధి కార్యకలాపాలు ఉండేవని విమర్శించారు. కేంద్రం ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు సంతృప్తికర స్థాయిలో అమలయ్యేందుకు చేపట్టిన ‘వికసిత్‌ భారత్‌ సంకల్ప్‌ యాత్ర’ లబ్ధిదారులతో ప్రధాని గురువారం ఢిల్లీ నుంచి వర్చువల్‌గా సంభాషించారు. సంకల్ప్‌ యాత్రతో ప్రభుత్వ రథాలు దేశం నలుమూలలకూ వెళ్తున్నాయని.. ప్రజల్లో ఉత్సాహాన్ని నింపాయని తెలిపారు. కొందరు వీటిని ‘మోదీ గ్యారెంటీ బండ్లు’ అని అంటున్నారని చెప్పారు.

మోదీ హామీ ఇస్తే కచ్చితంగా అమలు చేస్తారని ప్రజలకు తెలిసిందన్నారు. ఇందుకోసం వారి ఆశీర్వాదం తనకు కావాలని పేర్కొన్నారు. ‘సంక్షేమ పథకాలు అందని ప్రతి ఒక్కరినీ ఈ యాత్ర గుర్తిస్తుంది. రాబోయే రోజుల్లో గరిష్ఠ స్థాయిలో అమలు చేసి తీరతాం. అవతలి పక్షంపై ప్రజల ఆశలు సన్నగిల్లినప్పుడు.. మోదీ గ్యారెంటీ మొదలవుతుందన్న అభిప్రాయం జనంలో క్రమంగా ఏర్పడుతోంది’ అని పేర్కొన్నారు. దేశాన్ని అభివృద్ధి చేయాలని ప్రజలు సంకల్పించుకున్నారని.. భారత్‌ ఇక ఆగదని.. అలిసిపోదని వ్యాఖ్యానించారు. ‘సంకల్ప్‌ యాత్రపై జనంలో ఉత్సాహం పెల్లుబకడానికి కారణం ఉంది.. గత పదేళ్లలో మోదీ పనితీరును వారు చూశారు. ప్రజలకు యజమానులమని భావించే గత ప్రభుత్వాలను కూడా వారు చూశారు. ఆ ప్రభుత్వాల వల్లే.. స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలైనా జనాభాలో అత్యధికులకు మౌలిక వసతులు లేవు. నా సర్కారు మాత్రం వారికి చేరువవుతోంది. సంకల్ప్‌ యాత్ర మొదలైన 15 రోజులకే ప్రజలు దాని వెంట నడుస్తున్నారు. మోదీ హామీల బండి ఇప్పటివరకు 12 వేల పంచాయతీలకు చేరింది. ఇప్పటివరకు పథకాలు అందని 30 లక్షల మందికిపైగా ప్రయోజనం పొందారు. తల్లులు, సోదరీమణులు ఈ రథానికి చేరువవుతున్నారు. ఈ యాత్ర ప్రజాఉద్యమంగా తయారవుతోంది’ అని మోదీ వ్యాఖ్యానించారు. దేవ్‌గఢ్‌లోని ఎయిమ్స్‌లో 10 వేల జన ఔషధి కేంద్రాన్ని వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని.. వాటిని 25 వేలకు పెంచే కార్యక్రమానికి ఈ సందర్భంగా శ్రీకారం చుట్టారు. ‘డ్రోన్‌ దీదీ యోజన’ను కూడా ప్రారంభించారు.

నాకు సైకిల్‌ కూడా లేదు!

లబ్ధిదారులతో వర్చువల్‌ సంభాషణ సందర్భంగా జమ్ములోని రంగపూర్‌ సర్పంచ్‌ బల్వీర్‌ కౌర్‌తో ప్రధాని మాట్లాడారు. సమావేశంలో కుర్చీ లో కూర్చోవడానికి ఆమెను ఎవరో పక్కకు నెట్టేందుకు యత్నించారు. ఈ హడావుడి చూసిన మోదీ.. ‘కుర్చీ జాగ్రత్తగా చూసుకోండి. లేదంటే పక్కనున్న ఆమె సర్పంచ్‌ సీట్లో కూర్చుంటారు’ అని నవ్వుతూ వ్యాఖ్యానించారు. కిసాన్‌ క్రెడిట్‌ కార్డు ద్వారా తాను ట్రాక్టర్‌ కొనుక్కున్నానని కౌర్‌ ఈ సందర్భంగా తెలిపారు. మోదీ స్పందిస్తూ.. ‘మీకు ట్రాక్టర్‌ ఉంది.. నాకైతే తొక్కడానికి సైకిల్‌ కూడా లేదు’ అని వ్యాఖ్యానించారు.

Updated Date - 2023-12-01T04:16:31+05:30 IST