'Dahi': దహీ.. నహీ!

ABN , First Publish Date - 2023-03-31T04:18:30+05:30 IST

మాతృభాషపై ఎనలేని మమకారం చూపే తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలను మరోమారు హిందీ వర్సెస్‌ దక్షిణాది భాషల వివాదం కుదిపేసింది!

'Dahi': దహీ.. నహీ!

పెరుగు ప్యాకెట్లపై ‘దహీ’ అనే పదం

ఉండాలంటూ 10న కేంద్రం ఆదేశాలు

దక్షిణాది రాష్ట్రాలపై హిందీని రుద్దడమే

మండిపడ్డ తమిళులు, కన్నడిగులు

కేంద్రంపై సీఎం స్టాలిన్‌ తీవ్ర ఆగ్రహం

కర్ణాటకలో కుమారస్వామి ట్వీట్ల వర్షం

ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల వేళ రేగిన

ప్రకంపనలతో అప్రమ్తతమైన కేంద్రం?

‘దహీ’ అని రాయడం తప్పనిసరి కాదు

గత ఆదేశాలను సవరించిన కేంద్రం

చెన్నై, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): మాతృభాషపై ఎనలేని మమకారం చూపే తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలను మరోమారు హిందీ వర్సెస్‌ దక్షిణాది భాషల వివాదం కుదిపేసింది! ఈ వివాదానికి కేంద్ర బిందువు.. పెరుగు కావడం విశేషం. ఆ రెండు రాష్ట్రాల్లో డెయిరీ ఉత్పత్తులు విక్రయించే ఆహార విక్రయ సంస్థలు పెరుగు ప్యాకెట్లపై కర్డ్‌ అనే పదంతోపాటు తైర్‌ (తమిళం), మొసరు (కన్నడం) అనే పదాలను ముద్రించడం కద్దు. అయితే, పెరుగు ప్యాకెట్లపై కర్డ్‌కు బదులు ‘దహీ’ అనే పదాన్ని ప్రముఖంగా ప్రచురించాలని.. కర్డ్‌ అనిగానీ, ఇతర ప్రాంతీయ భాషల్లోని పేర్లను గానీ ‘దహీ’ పక్కన బ్రాకెట్‌లో ముద్రించాలని భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్ఏఐ ) మార్చి 10వ తేదీన ఆదేశించింది. ‘కర్ణాటక కో-ఆపరేటివ్‌ మిల్క్‌ ప్రొడ్యూసర్స్‌ ఫెడరేషన్‌ (కేఎంఎఫ్‌), బెంగళూరు రూరల్‌ అండ్‌ రామనగర డిస్ట్రిక్ట్‌ కో-ఆపరేటివ్‌ మిల్క్‌ ప్రొడ్యూసర్స్‌ సొసైటీస్‌ యూనియన్‌ లిమిటెడ్‌, తమిళనాడు కో-ఆపరేటివ్‌ మిల్క్‌ ప్రొడ్యూసర్స్‌ ఫెడరేషన్‌, హట్సన్‌ అగ్రో ప్రోడక్ట్స్‌ లిమిటెడ్‌ సంస్థలకు ఎఫ్‌ఎ్‌సఎ్‌సఏఐ ఈ ఆదేశాలు జారీ చేసింది. అయితే.. తమిళనాట ఆవిన్‌ అనే బ్రాండ్‌ పేరుతో పెరుగును, ఇతర పాల ఉత్పత్తులను విక్రయించే ‘తమిళనాడు కో-ఆపరేటివ్‌ మిల్క్‌ ప్రొడ్యూసర్స్‌ ఫెడరేషన్‌’ ఈ ఆదేశాలను పాటించే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. తాము విక్రయించే పెరుగుప్యాకెట్లపై హిందీ పదమైన ‘దహీ’ని వాడబోమని.. తమిళ పదమైన ‘తైర్‌’నే ముద్రిస్తామని తేల్చిచెప్పింది.

68.jpg

దీనిపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ కూడా స్పందించారు. హిందీని బలవంతంగా రుద్దడంలో భాగంగానే ‘దహీ’ పదాన్ని పెరుగు ప్యాకెట్లపై తప్పనిసరిగా ముద్రించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసిందని మండిపడ్డారు. అటు కన్నడనాట కూడా ఎఫ్‌ఎస్‌ఎస్ఏఐ ఆదేశాలపై ప్రజాగ్రహం పెల్లుబికింది. కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి కూడా కేంద్రంపై వరుస ట్వీట్లతో ధ్వజమెత్తారు. కర్ణాటక కో-ఆపరేటివ్‌ మిల్క్‌ ప్రొడ్యూసర్స్‌ ఫెడరేషన్‌ విక్రయించే నందిని బ్రాండ్‌ పాల ఉత్పత్తుల గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ‘‘నందినీ బ్రాండ్‌ కన్నడిగుల ఆస్తి. అది కన్నడిగుల గుర్తింపు. కన్నడిగుల జీవరేఖ.. హిందీని బలవంతంగా రుద్దడాన్ని కన్నడిగులు తీవ్రంగా వ్యతిరేకిస్తారని తెలిసి కూడా నందిని బ్రాండ్‌ పెరుగు ప్యాకెట్లపై హిందీ పదమైన దహీని వాడాలంటూ ఎఫ్‌ఎస్‌ఎస్ఏఐ కేఎంఎ్‌ఫకు ఆదేశాలివ్వడం తప్పు’’ అని కుమారస్వామి మండిపడ్డారు. ‘దహీ’ అనేది హిందీ పదం కాదని, సంస్కృతం నుంచి వచ్చిన పదమని, దాని అర్థం పాల ఉత్పత్తి అని కేంద్రప్రభుత్వం వివరణ ఇచ్చినా నిరసనలు చల్లారలేదు. దీంతో, ఎఫ్‌ఎ్‌సఎ్‌సఏఐ తన పాత నిబంధనలను సడలించింది. ప్రభుత్వ లేదా ప్రైవేటు సంస్థలు విక్రయించే పెరుగు ప్యాకెట్లపై ‘కర్డ్‌’ అని ఆంగ్లంలో ముద్రించి, దాని పక్కన ప్రాంతీయ భాషా పదం (పెరుగు/తైర్‌/మొసరు/దహీ వంటివి) కూడా చేర్చుకోవచ్చని స్పష్టం చేసింది. వినియోగదారులు గందరగోళానికి గురవ్వకూడదన్న ఉద్దేశంతోనే ‘దహీ’ పదాన్ని పెట్టాలని నిబంధన విధించామని.. అంతకు మించి మరేమీ లేదని.. అయితే, దీనిపై కొంతమంది నుంచి వెలువడుతున్న అభ్యంతరాలను దృష్టిలో పెట్టుకుని సవరణ చేశామని ఎఫ్‌ఎ్‌సఎ్‌సఏఐ సీఈవో జి.కమల్‌వర్ధన్‌ రావు ‘ఆంధ్రజ్యోతి’కి వివరించారు.

ఎఫ్‌ఎస్‌ఎస్ఏఐ వాదన ఏంటంటే..

దక్షిణభారత దేశంలో పెరుగు ప్యాకెట్లపై ‘కర్డ్‌’ అని ముద్రించి విక్రయిస్తున్నారు. అయితే.. పులియబెట్టిన పాల ఉత్పత్తులనే కాక, మరికొన్ని నాన్‌ డెయిరీ ఉత్పత్తులను కూడా ‘కర్డ్‌’గానే వ్యవహరిస్తున్నారని, దీంతో ఆ పెరుగు దేనితో తయారైందో తెలియక విక్రయదారులు గందరగోళానికి గురయ్యే అవకాశం ఉందని ఎఫ్‌ఎస్‌ఎస్ఏఐ సైంటిస్టులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే.. పులియబెట్టడం ద్వారా తయారైన పెరుగు ప్యాకెట్లపై ‘దహీ’ అనే పదాన్ని ముద్రించాలని జారీ చేశాం తప్ప, తమ ఆదేశాల వెనుక మరో ఉద్దేశం ఏమీ లేదని ఎఫ్‌ఎస్‌ఎస్ఏఐ వర్గాలు వివరణ ఇస్తున్నాయి. కాగా.. కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో.. ఇది రాజకీయంగా తమకు నష్టం చేస్తుందన్న ఉద్దేశంతో తప్పనిసరి పరిస్థితుల్లోనే కేంద్రం వెనక్కి తగ్గిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Updated Date - 2023-03-31T04:18:38+05:30 IST