సిద్దూ ప్రభుత్వం ఏ క్షణమైనా కూలిపోవచ్చు!
ABN , First Publish Date - 2023-12-11T03:29:54+05:30 IST
కేసుల నుంచి బయటపడేందుకు కర్ణాటక సిద్ధరామయ్య ప్రభుత్వంలోని ఒక పవర్‌ఫుల్ మంత్రి 50-60 మంది ఎమ్మెల్యేలతో బీజేపీలో చేరిపోయేందుకు కాషాయపార్టీ నేతలతో మంతనాలు జరుపుతున్నారని జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు హెచ్‌డీ కుమారస్వామి సంచలన ఆరోపణ చేశారు.
బీజేపీలోకి 60 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు?
కాషాయ పార్టీతో పవర్‌ఫుల్ మంత్రి మంతనాలు
కేసుల నుంచి బయటపడేయాలని వేడుకుంటున్నారు
జేడీఎస్ నేత కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు
హాసన్, డిసెంబరు 10: కేసుల నుంచి బయటపడేందుకు కర్ణాటక సిద్ధరామయ్య ప్రభుత్వంలోని ఒక పవర్‌ఫుల్ మంత్రి 50-60 మంది ఎమ్మెల్యేలతో బీజేపీలో చేరిపోయేందుకు కాషాయపార్టీ నేతలతో మంతనాలు జరుపుతున్నారని జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు హెచ్‌డీ కుమారస్వామి సంచలన ఆరోపణ చేశారు. అయితే, ఆ మంత్రి పేరును వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు. ఆ మంత్రి ఎవరని విలేకరులు పదేపదే ప్రశ్నించగా, ‘చిన్న వ్యక్తులు ఎవరైనా అలా చేయగలరా? చాలా పెద్ద, శక్తిమంతమైన నాయకుడు అయితేనే అలా చేయగలరు’ అని బదులిచ్చారు. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం అంతర్గత తిరుగుబాట్లతో కొట్టుమిట్టాడుతోందని, అది ఎప్పుడు కూలిపోతుందో ఎవరికీ తెలియదని వ్యాఖ్యానించారు. ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అవుతారని నోనావినాకెరె స్వామీజీ జోస్యం చెప్పిన విషయాన్ని విలేకరులు ప్రస్తావించగా, కాంగ్రెస్ సీనియర్ నేత బీకే హరిప్రసాద్ సహా అనేకమంది నేతలు ముఖ్యమంత్రి సిద్దరామయ్యపై ఇప్పటికే తిరుగుబాటు చేస్తున్నారని కుమారస్వామి తెలిపారు.