డ్రోన్ల కొనుగోలు ప్రక్రియ వచ్చే నెలలోనే

ABN , First Publish Date - 2023-06-26T01:04:26+05:30 IST

అమెరికా నుంచి అత్యాధునిక ఆయుధాలతో కూడిన ఎంక్యూ-9బీ డ్రోన్ల కొనుగోలు ప్రక్రియను జూలై మొదటి వారంలోనే భారత్‌ ప్రారంభించనుంది.....

డ్రోన్ల కొనుగోలు ప్రక్రియ వచ్చే నెలలోనే

అమెరికా నుంచి 31 అత్యాధునిక హంటర్‌ కిల్లర్‌ డ్రోన్ల కోసం ఒప్పందం

న్యూఢిల్లీ, జూన్‌ 25: అమెరికా నుంచి అత్యాధునిక ఆయుధాలతో కూడిన ఎంక్యూ-9బీ డ్రోన్ల కొనుగోలు ప్రక్రియను జూలై మొదటి వారంలోనే భారత్‌ ప్రారంభించనుంది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఒప్పందం పూర్తి చేసుకొని, వచ్చే ఆరేడు సంవత్సరాలలో దశలవారీగా మొత్తం 31 డ్రోన్లు మన దేశానికి చేరడమే లక్ష్యం. వీటి అంచనా వ్యయం సుమారు రూ.29 వేల కోట్లు(3.5 బిలియన్‌ డాలర్లు). 40 వేల అడుగులకుపైగా ఎత్తులో సుమారు 40 గంటల పాటు ఎగరగలిగే ఈ ‘హంటర్‌-కిల్లర్‌’ డ్రోన్లు నిఘా విధులతోపాటు హెల్‌ఫైర్‌ క్షిపణులను, స్మార్ట్‌ బాంబులను మోసుకెళ్లి దాడులు చేయగలవు. ఇవి ప్రస్తుతం చైనా వద్ద ఉన్న సాయుధ డ్రోన్ల కంటే ఎంతో మెరుగైనవి. వీటి కొనుగోలు నిమిత్తం అభ్యర్థన లేఖను వచ్చేనెల మొదటి వారంలో అమెరికా ప్రభుత్వానికి పంపనున్నారు. రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ నేతృత్వంలోని రక్షణ కొనుగోళ్ల మండలి ఈనెల 15నే దీనికి ఆమోదం తెలిపిందని రక్షణ శాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఈ ఒప్పందం ద్వారానే హేల్‌ డ్రోన్ల అసెంబ్లింగ్‌ ప్రక్రియను భారత్‌లో చేపట్టనున్నారు. దీంతోపాటు డ్రోన్ల ఎంఆర్‌వో(నిర్వహణ, మరమ్మతుల, పర్యవేక్షణ) విభాగాన్ని కూడా జనరల్‌ అటామిక్స్‌ భారత్‌లో ఏర్పాటు చేయనుంది. కాగా, హంటర్‌ కిల్లర్‌ డ్రోన్ల కొనుగోలు ధరపై భారత్‌ ఇంకా నిర్ణయం తీసుకోలేదని రక్షణశాఖ తెలిపింది. తయారీ కంపెనీ ఇతర దేశాలకు ఏఏ ధరలకు సరఫరా చేసిందో పరిశీలించిన తర్వాతే కొనుగోలు ఒప్పందం పూర్తి చేసుకుంటామని స్పష్టం చేసింది.

Updated Date - 2023-06-26T01:04:26+05:30 IST