Share News

జాతీయ న్యాయ నియామకాల కమిషన్‌కు పనిచేసే అవకాశమే ఇవ్వలేదు!

ABN , Publish Date - Dec 30 , 2023 | 04:07 AM

జాతీయ న్యాయ నియామకాల కమిషన్‌ (ఎన్‌జేఏసీ)కు పనిచేసే అవకాశమే ఇవ్వలేదని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ సంజయ్‌కిషన్‌ కౌల్‌ వ్యాఖ్యానించారు.

జాతీయ న్యాయ నియామకాల కమిషన్‌కు పనిచేసే అవకాశమే ఇవ్వలేదు!

ఆ చట్టాన్ని రద్దు చేయకుండా ఉండాల్సింది

సుప్రీంకోర్టు విశ్రాంత జడ్జి జస్టిస్‌ ఎస్‌కే కౌల్‌ వ్యాఖ్యలు

న్యూఢిల్లీ, డిసెంబరు 29: జాతీయ న్యాయ నియామకాల కమిషన్‌ (ఎన్‌జేఏసీ)కు పనిచేసే అవకాశమే ఇవ్వలేదని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ సంజయ్‌కిషన్‌ కౌల్‌ వ్యాఖ్యానించారు. ఈనెల 25న పదవీ విరమణ చేసిన ఆయన సుప్రీంకోర్టు కొలీజియంలో ఏడాదిపాటు సభ్యుడిగా పనిచేశారు. శుక్రవారం ఆయ న ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్‌జేఏసీ, స్వలింగ సంపర్కుల వివాహాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొలీజియం వ్యవస్థలో సమస్య ఉందని, దాన్ని మనమంతా అంగీకరించాలన్నారు. మోదీ సర్కారు 2014లో అధికారంలోకి వచ్చాక న్యాయ నియామకాల కోసం ఏర్పాటు చేసిన ఎన్‌జేఏసీలో సీజేఐ, సుప్రీంకోర్టుకు చెందిన ఇద్దరు సీనియర్‌ న్యాయమూర్తులు, కేంద్ర న్యాయశాఖ మంత్రి, ప్రధాని, లోక్‌సభలో ప్రతిపక్షనేత సభ్యులుగా ఉంటారు. మోదీ ప్రభుత్వం ఎన్‌జేఏసీని చట్టం చేయగా.. రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీంకోర్టు 2015 అక్టోబరులో దాన్ని రద్దు చేసింది. ఈ క్రమంలో తాజాగా జస్టిస్‌ కౌల్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘‘ఎన్‌జేఏసీ భవిష్యత్తులో ప్రభావవంతంగా పనిచేసేదేమో. దానికి పనిచేసే అవకాశమే ఇవ్వలేదు. ఎన్‌జేఏసీ చట్టాన్ని సుప్రీంకోర్టు కొట్టివేయడంపై రాజకీయవర్గాల్లో వ్యతిరేకత వచ్చింది. చట్టాన్ని రద్దు చేశాక కొలీజియం పనితీరుపైనా తీవ్ర ప్రభావం పడింది. రాజకీయ, న్యాయ వ్యవస్థల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది’’అని జస్టిస్‌ కౌల్‌ చెప్పారు. కొలీజియం వ్యవస్థ బాగా పనిచేస్తోందని ఎవరైనా చెబితే అది పూర్తిగా అవాస్తవమేనన్నారు. కొలీజియం సిఫారసు చేసిన అనేక పేర్లు ఇప్పటికీ పెండింగ్‌లో ఉండడమే నిదర్శనమని తెలిపారు. ప్రస్తు త చట్టాల ప్రకారం స్వలింగ సంపర్కుల వివాహానికి అంగీకరించలేమంటూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పునిచ్చిన రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్‌ కౌల్‌ సభ్యుడిగా ఉన్నారు. ఈ అంశంపై స్పందిస్తూ.. ఆ కేసులో అనేక సామాజిక అంశాలు ఇమిడి ఉన్నాయన్నారు. ప్రభుత్వం స్పందించి భవిష్యత్తులో వారికిపెళ్లిళ్లు చేసుకునే హక్కు కల్పిస్తూ చట్టాన్ని చేసే అవకాశమూ ఉందని అభిప్రాయపడ్డారు.

Updated Date - Dec 30 , 2023 | 06:40 AM