పిండమార్పిడి పద్ధతిలో తొలి సాహివాల్ దూడ
ABN , First Publish Date - 2023-06-26T01:42:18+05:30 IST
పిండమార్పిడి పద్ధతిలో ఏపీలో తొలిసారిగా ఒంగోలు ఆవుకు, సాహివాల్ పెయ్యదూడ పురుడు పోసుకుందని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. మేలు రకమైన దేశవాళీ గోజాతిని అభివృద్ధి
టీటీడీ గోశాలలో జననం.. పద్మావతిగా నామకరణం
తిరుపతి(విద్య), జూన్ 25: పిండమార్పిడి పద్ధతిలో ఏపీలో తొలిసారిగా ఒంగోలు ఆవుకు, సాహివాల్ పెయ్యదూడ పురుడు పోసుకుందని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. మేలు రకమైన దేశవాళీ గోజాతిని అభివృద్ధి చేసే క్రమంలో ఎస్వీ గోసంరక్షణశాలలోని మేలుజాతి ఆవులనుంచి అండాలు సేకరించి.. ఎస్వీ వెటర్నరీవర్సిటీలోని ఐవీఎఫ్ ప్రయోగశాలలో కృత్రిమంగా పిండాలుగా అభివృద్ధి చేశారని తెలిపారు. ఈ పిండాలను టీటీడీ గోశాలలోని ఆవులలో ప్రవేశపెట్టి రాష్ట్రంలోనే తొలిసారిగా సరోగసి ద్వారా సాహివాల్ ఆవుదూడను పుట్టించి విజయం సాధించినట్లు వివరించారు. ఆ దూడకు పద్మావతి అని నామకరణం చేశామని చెప్పారు. ఎస్వీ వెటర్నరీ వర్సిటీ వీసీ డాక్టర్ వి.పద్మనాభరెడ్డి మాట్లాడుతూ, ‘‘పిండమార్పిడి చేసిన ఆవులలో ఇప్పటివరకు 11 ఆవులు గర్భం దాల్చాయి. ఒక ఆవు శనివారం రాత్రి సాహివాల్ పెయ్య దూడకు జన్మనిచ్చింది. రానున్న రోజుల్లో మరో 10 సాహివాల్ దూడలు పురుడుపోసుకోనున్నాయి. ఈ పద్ధతిలో రానున్న ఐదేళ్లలో 324 మేలు రకమైన సాహివాల్ గోజాతి దూడలను ఉత్పత్తి చేస్తాం’’ అని వివరించారు.