Bihar CM Nitish Kumar : ప్రతిపక్షాల భేటీపై అనిశ్చితి

ABN , First Publish Date - 2023-06-07T04:27:10+05:30 IST

బీజేపీకి వ్యతిరేకంగా వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో ఐక్యంగా కదిలేందుకు తలపెట్టిన విపక్షాల సమావేశంపై సందిగ్ధత కొనసాగుతోంది.

 Bihar CM Nitish Kumar : ప్రతిపక్షాల భేటీపై అనిశ్చితి

వేదిక ఎక్కడ, తేదీ ఎప్పుడు అనేదానిపై తొలగని సందిగ్ధత..

నీతీశ్‌ ప్రయత్నాలపై నీలినీడలు!

పట్నా, జూన్‌ 6: బీజేపీకి వ్యతిరేకంగా వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో ఐక్యంగా కదిలేందుకు తలపెట్టిన విపక్షాల సమావేశంపై సందిగ్ధత కొనసాగుతోంది. ఈ నెల 12న పట్నాలో భేటీకి బిహార్‌ సీఎం నీతీశ్‌కుమార్‌ చేపట్టిన ప్రయత్నం అనూహ్యంగా రద్దయింది. ఈ విషయాన్ని సోమవారం ప్రకటించిన ఆయన మిగతా వివరాలేమీ చెప్పలేదు. ఇతర ప్రతిపక్షాలతో కాంగ్రెస్‌ మాట్లాడిన తర్వాతే తేదీ ప్రకటిస్తామని తెలిపారు. దీంతో అసలు వేదిక ఎక్కడ? కూటమిలో కాంగ్రెస్‌ పాత్ర ఏమిటి? అనేదానిపై అనిశ్చితి నెలకొంది. మరోవైపు ఈ నెల 23న భేటీకి జేడీయూ ప్రతిపాదించగా.. హిమాచల్‌ ప్రదేశ్‌ రాజధాని షిమ్లాను వేదికగా కాంగ్రెస్‌ ప్రతిపాదిస్తోంది. బిహార్‌, ఇతర ఉత్తరాది రాష్ట్రాల్లో ఎండల తీవ్రతను కారణంగా చెబుతోంది. వాస్తవానికి జూన్‌ 12 నాటికి ఖర్గే, రాహుల్‌ అందుబాటులో ఉండరని.. తేదీ మార్చమని చెప్పినా జేడీయూ ఏకపక్షంగా ఆ తేదీని నిర్ణయించిందని బిహార్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఆరోపిస్తున్నారు.

నీతీశ్‌ పెత్తనంపై కాంగ్రెస్‌ అభ్యంతరం

భేటీకి ఆయా పార్టీల అధినేతలు మాత్రమే రావాలని.. ప్రతినిధులను పంపడం సరికాదని నీతీశ్‌ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే, అగ్ర నేత రాహుల్‌ గాంధీ హాజరుపై ఆ పార్టీ నాయకులు సందేహం వ్యక్తం చేసిన క్రమంలో ఆయన ఇలా స్పందించారు. ఈ నేపథ్యంలో రాహుల్‌ రావాలంటే వేదికను నిర్ణయిస్తామని జేడీయూ వర్గాలకు కాంగ్రెస్‌ చెప్పినట్లు సమాచారం. మరోవైపు కర్ణాటకలో విజయంతో ఊపులోకి వచ్చిన కాంగ్రెస్‌ కేంద్రంలో ప్రధాన ప్రతిపక్ష పాత్రను వదులుకునేందుకు, నీతీశ్‌ను మోదీ–బీజేపీపై పోరాడే నాయకుడిగా అంగీకరించేందుకు ఆసక్తి చూపదనేది రాజకీయ విశ్లేషకుల భావన. నీతీశ్‌, ఆయన పార్టీ జేడీయూనే హైలైట్‌ అవుతుండడం, తమ పార్టీ అసలు సీన్‌లో లేదన్నట్లుగా వ్యవహారం సాగుతుండడంతో కాంగ్రెస్‌ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. జేడీయూనేమో నీతీశ్‌ కారణంగానే మమతా బెనర్జీ, కేజ్రీవాల్‌ వంటి నాయకులు ఏకతాటిపైకి వచ్చారని.. కాంగ్రెస్‌ కనుక ఆ స్థానంలో ఉంటే ఇది జరిగేది కాదని చెబుతోంది.

బీజేపీతో బంధం లేని పార్టీ ఉందా?

బెంగళూరు, జూన్‌ 6: వచ్చే లోక్‌సభ ఎన్నికల నాటికి విపక్షాలన్నిటినీ ఏకతాటిపైకి తెచ్చేందుకు నితీశ్‌కుమార్‌, కాంగ్రెస్‌ నేతల ప్రయత్నాలపై జేడీఎస్‌ అధినేత హెచ్‌డీ దేవెగౌడ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ బంధం లేని పార్టీయే లేదని ఆయన స్పష్టం చేశారు. అలా బంధం లేని ఒక్క పార్టీనైనా తనకు చూపాలని, అప్పుడు విపక్షాల ఐక్యతాయత్నాలపై స్పందిస్తానని మంగళవారమిక్కడ విలేకరులతో అన్నారు. ‘దేశ రాజకీయ పరిస్థితిపై సవివరంగా విశ్లేషించగలను. కానీ ఉపయోగమేంటి? డీఎంకే అధినేత కరుణానిధి బీజేపీకి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆరేళ్లపాటు మద్దతిచ్చారు? మరి కాంగ్రెస్‌ నేతలు పొత్తు కోసం ఆయన వద్దకు వెళ్లలేదా’ అని ప్రశ్నించారు. ఏది మతతత్వ పార్టీయో.. ఏది కాదో తాను చెప్పలేనన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో జేడీఎస్‌.. బీజేపీతో చేతులు కలపబోతోందన్న వార్తలను ప్రస్తావించగా.. ఇలాంటివాటిని తాను పట్టించుకోనన్నారు.

Updated Date - 2023-06-07T04:27:10+05:30 IST