Share News

గేటెడ్‌ కమ్యూనిటీ భావనే సరికాదు

ABN , First Publish Date - 2023-12-02T03:33:02+05:30 IST

లేఅవుట్‌పై నియంత్రణను నగర పాలక సంస్థలకు అప్పగించిన తర్వాత దాని యజమానులకు, డెవలపర్లకు అందులోని రహదారులు, ఇతర సదుపాయాలపై ఎలాంటి హక్కు ఉండదని కర్ణాటక హైకోర్టు స్పష్టం చేసింది.

గేటెడ్‌ కమ్యూనిటీ భావనే సరికాదు

అందులోని రహదారులు నివాసితులకే పరిమితం కాదు

వాటిని అందరూ వాడుకోవచ్చు: కర్ణాటక హైకోర్టు

బెంగళూరు, డిసెంబరు 1: లేఅవుట్‌పై నియంత్రణను నగర పాలక సంస్థలకు అప్పగించిన తర్వాత దాని యజమానులకు, డెవలపర్లకు అందులోని రహదారులు, ఇతర సదుపాయాలపై ఎలాంటి హక్కు ఉండదని కర్ణాటక హైకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును సమర్థించింది. బెళ్లందూరు ఔటర్‌ రింగ్‌రోడ్డులోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర టవర్స్‌కు చెందిన పబ్బారెడ్డి కోదండరామిరెడ్డిపై ఉపకార్‌ రెసిడెన్సీస్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. వారి లేఅవుట్‌ లోపలి నుంచి ప్రజలు రాకపోకలు కొనసాగించే హక్కు కల్పించాలని కోరింది. ఇది గేటెడ్‌ కమ్యూనిటీ అని, అక్కడి రోడ్లు నివాసితుల ప్రత్యేక ఉపయోగం కోసం ఉద్దేశించినవని రెడ్డి వాదించారు. అయితే గేటెడ్‌ కమ్యూనిటీ అనే భావనే లేదని, అందులోని రహదారులను ప్రజలు ఉపయోగించకుండా అడ్డుకోలేరని 2022 నవంబరు 29న సింగిల్‌ జడ్జి బెంచ్‌ తీర్పు చెప్పింది. దీన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై ప్రదాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రసన్న బి. వరాళె, జస్టిస్‌ కృష్ణ ఎస్‌. దీక్షిత్‌తో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ అప్పీలును తోసిపుచ్చిన ధర్మాసనం... లేఅవుట్‌లోని రహదారులను అందులో నివసించేవారితో పాటు ఇతరులు కూడా ఉపయోగించుకోవచ్చన్న సింగిల్‌ జడ్జి తీర్పుతో ఏకీభవించింది. లేఅవుట్‌ ప్లాన్‌ను మంజూరు చేసేటప్పుడు కాంపిటెంట్‌ అథారిటీ పొందుపరిచిన 11వ నిబంధనకు అనుగుణంగానే ఈ తీర్పు ఉందని అభిప్రాయపడింది. 11వ నిబంధన ప్రకారం నగర పాలక సంస్థ అధికారులు నిర్వహించే రహదారులు, ఇతర సౌకర్యాలను ప్రజలందరూ ఉపయోగించుకోవడానికి అనుమతించాలి. ఒకసారి రోడ్లను నగరపాలక సంస్థకు అప్పగించిన తర్వాత వాటిపై అసలు యజమానులకు ఎలాంటి హక్కు లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

Updated Date - 2023-12-02T03:33:14+05:30 IST