Justice Nariman : సీఈసీ చట్టాన్ని కొట్టేయాల్సిందే
ABN , Publish Date - Dec 17 , 2023 | 05:45 AM
ఎన్నికల కమిషనర్ల ఎంపికకు కేంద్రం కొత్తగా తీసుకువచ్చిన బిల్లు చట్టమైతే దాన్ని కొట్టేయాల్సిందేనని సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ రోహింగ్టన్ నారిమన్ వ్యాఖ్యానించారు. అది ఈసీ స్వతంత్రతకు తీవ్ర విఘాతం కలిగిస్తుందని, దాన్ని కొట్టివేయకపోతే
ఈసీ స్వతంత్రతకు తీవ్ర విఘాతం.. ‘370’ తీర్పుతో సమాఖ్యపై ప్రభావం
సుప్రీం మాజీ జడ్జి జస్టిస్ నారిమన్
ముంబై, డిసెంబరు 16: ఎన్నికల కమిషనర్ల ఎంపికకు కేంద్రం కొత్తగా తీసుకువచ్చిన బిల్లు చట్టమైతే దాన్ని కొట్టేయాల్సిందేనని సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ రోహింగ్టన్ నారిమన్ వ్యాఖ్యానించారు. అది ఈసీ స్వతంత్రతకు తీవ్ర విఘాతం కలిగిస్తుందని, దాన్ని కొట్టివేయకపోతే ప్రజాస్వామ్యానికి పెనుముప్పు తప్పదని స్పష్టం చేశారు. ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు తీర్పు, కొలీజియం వ్యవస్థ, బీబీసీ కార్యాలయంపై ఐటీ దాడుల నేపథ్యంలో మీడియాను కాపాడుకోవాల్సిన ఆవశ్యకత, గవర్నర్ల వ్యవస్థ తదితర అంశాలపై దక్షిణ ముంబైలోని ఏసియాటిక్ సొసైటీలో ‘‘భారత రాజ్యాంగం: చెక్స్ అండ్ బ్యాలెన్సెస్’’ అనే అంశంపై ఆయన ప్రసంగించారు. సీఈసీ కమిషనర్ల నియామకానికి సంబంధించిన బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందడం తనకు తీవ్ర ఆవేదన కలిగించిందని జస్టిస్ నారిమన్ అన్నారు. సీఈసీని ప్రధాని, ప్రతిపక్ష నేత, సీజేఐతో కూడిన ప్యానెల్ నియమించాలని సుప్రీంకోర్టు నిర్ణయించడం చాలా కీలకమైనదని తెలిపారు. ఎన్నికల కమిషనర్లు పక్షపాతంగా వ్యవహరిస్తే దేశంలో స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికలు జరగవని, ప్రజాస్వామ్యం మనుగడే సాధ్యం కాదని పేర్కొన్నారు. దురదృష్టవశాత్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులను తారుమారు చేసే బిల్లును రాజ్యసభలో ఆమోదించారన్నారు. సీఈసీ స్వతంత్రంగా వ్యవహరించాలంటే.. వారికి ఐదేళ్ల కాలపరిమితి ఇవ్వాలన్నారు.
సుప్రీం తీర్పుతో కలవరం
ఆర్టికల్ 370 రద్దును సమర్థిస్తూ ఇటీవల సుప్రీం ఇచ్చిన తీర్పు తనను కలవరపాటుకు గురిచేసిందని జస్టిస్ నారిమన్ తెలిపారు. ఈ తీర్పు సమాఖ్య విధానంపై తీవ్ర ప్రభావం చూపిందని, ఇప్పటికే ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఉండగా, కేంద్రం దాన్ని అమలు చేస్తున్నప్పుడు... ఎందుకు రద్దు చేయాల్సి వచ్చిందన్న ప్రశ్న ఉత్పన్నమవుతోందని చెప్పారు. త్వరలో రాష్ట్ర హోదా కల్పిస్తామని, వచ్చే ఏడాది ఎన్నికలు నిర్వహిస్తామని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా హామీ ఇచ్చారని గుర్తుచేశారు. అయితే తన హామీతో ఆ రాష్ట్రంలో ఏర్పాటయ్యే ప్రభుత్వాలను, శాసనసభను ఎస్‌జీ కట్టడి చేయలేరన్నారు.
ప్రజాప్రతినిధుల అనర్హతలపై ట్రైబ్యునల్
అధికార పార్టీకి చెందిన సభ్యుడిపై అనర్హత వేటు వేయాల్సి వస్తే స్పీకర్లు ఏమాత్రం పట్టించుకోరని, అదే ప్రత్యర్థి పార్టీల వారైతే వెంటనే అనర్హత వేటు వేస్తారని జస్టిస్ నారిమన్ పేర్కొన్నారు. పార్లమెంటు, అసెంబ్లీ సభ్యుల అనర్హతలకు సంబంధించిన వివాదాలను సు ప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలోని శాశ్వత ట్రైబ్యునల్ పరిష్కరించాలని ఆయన సూచించారు. కాగా, కొలీజియం వ్యవస్థ దారుణంగా ఉందని, కానీ అంతకంటే మెరుగైనది ప్రస్తుతానికి ఏదీ లేదన్నారు.
మీడియాపై దాడులను కోర్టులే ఆపాలి
ఈ ఏడాది ప్రారంభంలో గుజరాత్ అల్లర్లపై డాక్యుమెంటరీని ప్రసారం చేసిన బీబీసీ కార్యాలయంపై పన్ను దాడులను ప్రస్తావిస్తూ... మీడియాపై దాడులు జరిగిన మరుక్షణం కోర్టులే స్పందించి దాన్ని కాపాడుకోవాలని జస్టిస్ నారిమన్ సూచించారు. స్వతంత్ర రిపోర్టింగ్ పన్ను దాడులకు దారి తీసిందని కోర్టు భావిస్తే.. ఇలాంటి దాడులను చట్ట విరుద్ధం, రాజ్యాంగ విరుద్ధంగా పరిగణించాలన్నారు.