టార్గెట్ చైనా!
ABN , First Publish Date - 2023-01-29T03:03:25+05:30 IST
భారత్ నాలుగు కొత్త అణ్వాయుధ వ్యవస్థలను అభివృద్ధి చేస్తోందని అమెరికా శాస్త్రవేత్తల సమాఖ్య(ఎ్‌ఫఏఎస్) వెల్లడించింది. ఓ వైపు దాయాదీ దేశం పాకిస్థాన్‌తో
- భారత్‌లో 4 కొత్త అణ్వాయుధ వ్యవస్థలు
- భారతదేశ క్షిపణుల పరిధిలో డ్రాగన్
- విశాఖ సమీపంలో సూపర్ సీక్రెట్ బేస్
- మరో రియాక్టర్ నిర్మిస్తే భారీగా ప్లుటోనియం ఉత్పత్తి
- ఇప్పటికే భారత్ వద్ద 700 కిలోల ప్లూటోనియం!
- అమెరికా శాస్త్రవేత్తల సమాఖ్య నివేదికలో వెల్లడి
వాషింగ్టన్, జనవరి 28: భారత్ నాలుగు కొత్త అణ్వాయుధ వ్యవస్థలను అభివృద్ధి చేస్తోందని అమెరికా శాస్త్రవేత్తల సమాఖ్య(ఎ్‌ఫఏఎస్) వెల్లడించింది. ఓ వైపు దాయాదీ దేశం పాకిస్థాన్‌తో ముప్పు.. మరోవైపు చైనా కవ్వింపుల నేపథ్యంలో.. అణు సామర్థ్యాన్ని మెరుగుపరుచుకుంటోందని వివరించింది. ఇప్పటికే భారత్ వద్ద ఎనిమిది విభిన్న అణు సామర్థ్య వ్యవస్థలున్నాయని పేర్కొంది. ‘‘వీటిలో రెండు గగనతలం నుంచి ప్రయోగించేవి. నాలుగు భూతలం నుంచి ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణులు. మరో రెండు సముద్ర ఉపరితలం నుంచి/సముద్రగర్భం నుంచి ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణులు. వీటికి తోడుగా మరో నాలుగు అణ్వాయుధ వ్యవస్థలను అభివృద్ధిపరుస్తోంది. త్వరలో అవి అందుబాటులోకి రానున్నాయి’’ అని స్పష్టం చేసింది. ఈ మేరకు విడుదల చేసిన ఎఫ్‌ఏఎస్-2022 వార్షిక నివేదికలో పలు అంశాలను ప్రస్తావించింది. ముఖ్యంగా చైనాను ఎదుర్కొనేందుకే భారత్ అణ్వాయుధ సంపత్తిని, వార్‌హెడ్లను అభివృద్ధిపరుస్తోందని ఆ నివేదిక తెలిపింది. ప్రస్తుతం యావత్ చైనా భారత బాలిస్టిక్ క్షిపణుల పరిధిలో ఉందని విశ్లేషించింది. ‘‘మొదట్లో భారత్‌కు పాక్ నుంచి ముప్పు ఉండేది. ఆ మేరకు అణ్వాయుధాలను సమకూర్చుకుంది. ఇప్పుడు కేవలం చైనా లక్ష్యంగా తన అణు సంపత్తిని అభివృద్ధి చేస్తోంది’’ అని స్పష్టం చేసింది. భారత్ వద్ద ప్రస్తుతం సుమారు 700 కిలోల(150 కిలోలు అటూఇటుగా) వెపన్-గ్రేడ్ ప్లూటోనియం ఉందని ఎఫ్‌ఏఎస్ నివేదిక వివరించింది. ‘‘ఈ ప్లూటోనియంతో 130 నుంచి 213 అణ్వాయుధాల వార్ హెడ్లను తయారు చేయవచ్చు. అయితే.. భారత్ తన వద్ద ఉన్న ప్లూటోనియంను వార్‌హెడ్లుగా మార్చలేదు. ప్రస్తుతం భారత్ వద్ద 160 వార్‌హెడ్లు ఉన్నాయి. పాక్ వద్ద 165, చైనా దగ్గర 350, అమెరికాలో 5,428, రష్యా వద్ద 5,977 అణ్వాయుధాలున్నాయి’’ అని స్పష్టంచేసింది. ‘‘భారత్‌లోని ముంబైలో ఉన్న బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ కాంప్లెక్స్‌లో ధ్రువ రియాక్టర్ ఆయుధ-గ్రేడ్ ప్లూటోనియం ఉత్పత్తి జరుగుతోంది. కనీసం మరో రియాక్టర్‌ను నిర్మించడం ద్వారా.. తన ప్లూటోనియం ఉత్పత్తి సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుకునే యోచనలో భారత్ ఉంది’’ అని ఆ నివేదిక వెల్లడించింది.