‘ట్యాంపరింగ్‌’ తేల్చాల్సిందే!

ABN , First Publish Date - 2023-06-06T01:25:09+05:30 IST

ఒడిశా రైలు ప్రమాదంపై సీబీఐ దర్యాప్తు చేయడాన్ని రాజకీయ పక్షాలు ప్రశ్నిస్తుండగా.. ప్రమాదం వెనుక కుట్రకోణాన్ని తేల్చడానికి అత్యున్నత దర్యాప్తు సంస్థ విచారించడమే మేలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు....

‘ట్యాంపరింగ్‌’ తేల్చాల్సిందే!

అది సీబీఐతోనే సాధ్యం: నిపుణులు

న్యూఢిల్లీ, జూన్‌ 5: ఒడిశా రైలు ప్రమాదంపై సీబీఐ దర్యాప్తు చేయడాన్ని రాజకీయ పక్షాలు ప్రశ్నిస్తుండగా.. ప్రమాదం వెనుక కుట్రకోణాన్ని తేల్చడానికి అత్యున్నత దర్యాప్తు సంస్థ విచారించడమే మేలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆగ్నేయ రైల్వే భద్రతా కమిషనర్‌ ఇప్పటికే విచారణ ప్రారంభించారు. రెండు వారాల్లో తన నివేదిక అందించనున్నారు. దీనికి సమాంతరంగా సీబీఐ కూడా దర్యాప్తు జరిపి తీరాల్సిందేనని నిపుణులు అంటున్నారు. నేరపూరిత కుట్రలో భాగంగా ఎలక్ర్టానిక్‌ ఇంటర్‌లాకింగ్‌ సిస్టమ్‌ను గానీ, పాయింట్‌ మెషీన్‌ను గానీ ఎవరైనా ట్యాంపరింగ్‌ చేశారా.. తద్వారా రైలు ట్రాక్‌ను మార్చారా.. సిగ్నలింగ్‌ లోపం ఏదైనా ఉందా.. అనేవి సమగ్ర దర్యాప్తుతోనే తేలతాయని చెబుతున్నారు. ట్రాక్‌ను మార్చిన కారణంగానే ఈ ఘోర ప్రమాదం జరిగి ఉంటుందని ప్రాథమికంగా కనుగొన్నామని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ఆదివారమే తెలిపారు. బాధ్యులను వదిలిపెట్టేది లేదని కూడా స్పష్టం చేశారు. అలాంటివారిపై కఠిన చర్యలుంటాయని ప్రధాని మోదీ కూడా హెచ్చరించారు. ఎలకా్ట్రనిక్‌ ఇంటర్‌లాకింగ్‌ ద్వారా స్టేషన్‌ ఇన్‌చార్జి రైలు వెళ్లాల్సిన ట్రాక్‌కు క్లియరెన్స్‌ ఇస్తారని రైల్వే భద్రత నిపుణుడు, ‘ఎల్‌2ఎం రైల్‌’ స్టార్టప్‌ వ్యవస్థాపకుడు, బెంగళూరు ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఐఐఎ్‌ససీ)కి చెందిన ఎస్‌కే సిన్హా గుర్తుచేశారు. ఒకసారి రూట్‌ క్లియరెన్స్‌ ఇచ్చాక పచ్చ లైటు వెలుగుతుందని.. ఈ మార్గాన్ని తన కోసం రిజర్వుచేశారని డ్రైవర్‌ నిర్ధారించుకుని ముందుకు వెళ్తారని తెలిపారు. ఒకసారి క్లియరెన్స్‌ ఇచ్చాక లాకింగ్‌ సిస్టమ్‌ను మార్చడానికి అవకాశం ఉండదన్నారు. పరోక్షంగా ట్యాంపరింగ్‌ జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తంచేశారు. ఎలకా్ట్రనిక్‌, మెకానిక్‌ సిస్టమ్‌ల సమకాలీకరణ విఫలం కావడం వల్ల కూడా ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని ఐఐటీ-కాన్పూర్‌ మెకానికల్‌ ఇంజనీరింగ్‌ విభాగం ప్రొఫెసర్‌ , టెక్నాలజీ మిషన్‌ ఫర్‌ ఇండియన్‌ రైల్వేస్‌ (టీఎంఐఆర్‌) మాజీ అధిపతి నళిన్‌ ఆకాశ్‌ ఎస్‌.వ్యాస్‌ పేర్కొన్నారు. సిగ్నలింగ్‌ వ్యవస్థను ట్యాపరింగ్‌ చేసినట్లు అనుమానిస్తున్నామని రైల్వే బోర్డు సభ్యురాలు జయావర్మ సిన్హా వెల్లడించారు. రైల్వే ట్రాక్‌లను సెన్సరైజేషన్‌ చేయాలని వ్యాస్‌ సూచించారు.

Updated Date - 2023-06-06T01:25:09+05:30 IST