Share News

Tamil actor Vijayakanth No More : ‘కెప్టెన్‌’ అస్తమయం

ABN , Publish Date - Dec 29 , 2023 | 06:28 AM

తమిళ సినీ, రాజకీయరంగాల్లో నాలుగు దశాబ్దాలకు పైగా తనదైన ముద్రవేసి.. ప్రజల హృదయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న సీనియర్‌ నటుడు విజయకాంత్‌ (71) ఇక లేరు! సుమారు పది సంవత్సరాలుగా వివిధ రకాల అనారోగ్య

 Tamil actor Vijayakanth No More : ‘కెప్టెన్‌’ అస్తమయం

తమిళ నటుడు విజయకాంత్‌ ఇక లేరు..

తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో కన్నుమూత

నేడు తమిళనాడు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు

ప్రధాని మోదీ సంతాపం

చెన్నై, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): తమిళ సినీ, రాజకీయరంగాల్లో నాలుగు దశాబ్దాలకు పైగా తనదైన ముద్రవేసి.. ప్రజల హృదయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న సీనియర్‌ నటుడు విజయకాంత్‌ (71) ఇక లేరు! సుమారు పది సంవత్సరాలుగా వివిధ రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విజయకాంత్‌.. ఆస్పత్రిలో చికిత్స పొంది కొద్దిరోజుల క్రితం కోలుకుని పార్టీ సర్వసభ్య సమావేశానికీ హాజరయ్యారు. కానీ, మంగళవారం రాత్రి మరోసారి ఆయన తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో కుటుంబసభ్యులు ఆయన్ను చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. న్యుమోనియాతో బాధపడుతుండడంతో.. ఆయన్ను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. ఆయన్ను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స చేశామని.. గురువారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారని వైద్యులు ప్రకటించారు. ‘కెప్టెన్‌’.. ‘కరుప్పు (నల్ల) ఎంజీఆర్‌’.. అని ఎంతో ఆప్యాయంగా పిలుచుకునే తమ అభిమాన నటుడు మరలిరాని లోకాలకు తరలిపోయారన్న వార్త తెలియగానే.. ఆయన అభిమానులు విషాదంలో మునిగిపోయారు. ఆయన వద్ద సాయం పొందిన లక్షలాది మంది ప్రజలు కన్నీరుమున్నీరవుతున్నారు. ఎంజీఆర్‌, కరుణానిధి, జయలలిత తర్వాత తమిళనాట రాజకీయాల్లోకి అడుగుపెట్టి ప్రజాదరణ పొందిన నటుడు విజయకాంత్‌. 2005 సెప్టెంబరు 14న.. ‘దేశీయ ముర్పోక్కు ద్రవిడ కళగం’ పార్టీని ప్రకటించిన విజయకాంత్‌ 2006 ఎన్నికల్లో అన్ని సీట్లకూ తమ అభ్యర్థుల్ని రంగంలోకి దించారు. 2011 ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుని.. 41 సీట్లలో పోటీ చేసి 29 స్థానాల్లో గెలిచారు. కలిసి పోటీచేసినప్పటికీ.. ఎన్నికలయ్యాక జయలలితతో విభేదాలు రావడంతో ఆయన పార్టీ పతనం మొదలైంది. 2011 అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన రెండో శాసనసభ సమావేశాల్లో విజయకాంత్‌ ప్రజాసమస్యలపై నిలదీస్తూ ఆవేశంతో అధికార పక్షం వైపు వేలు చూపించారు. ఆగ్రహించిన జయలలిత.. ‘ఈ క్షణమే విజయకాంత్‌ పార్టీ పతనం మొదలైంది’ అన్నారు.

అనడమే కాదు.. వెంటనే కార్యాచరణకు దిగారు. ఫలితంగా 2016 ఎన్నికల్లో విజయకాంత్‌ స్వయంగా ఓడిపోయారు. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో.. జయ లేని అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకున్నా అది కలిసి రాలేదు. రెండుసార్లు ఎమ్మెల్యే అయినా.. ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేకుండా బాధ్యతలు నిర్వర్తించారాయన. కాగా.. విజయకాంత్‌కు భార్య ప్రేమలత, కుమారులు విజయ ప్రభాకరన్‌, షణ్ముగ పాండ్యన్‌ ఉన్నారు. విజయకాంత్‌ భౌతికకాయానికి శుక్రవారం సాయంత్రం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరపనున్నట్టు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. కాగా.. విజయకాంత్‌ మృతి పట్ల ప్రధాని నరేంద్రమోదీ, కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ, తెలంగాణ గవర్నర్‌ తమిళిసై, తమిళనాడు గవర్నర్‌ రవి, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌, కేంద్రహోమంత్రి అమిత్‌షా, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌, పలువురు తెలుగు, తమిళ సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. విజయకాంత్‌ మృతికి సంతాపసూచకంగా తమిళ చిత్రపరిశ్రమ షూటింగులను రద్దు చేసుకుంది.

Updated Date - Dec 29 , 2023 | 06:28 AM