టక్కరి దొంగ.. లెక్కలేని యజమాని!
ABN , First Publish Date - 2023-10-31T03:11:58+05:30 IST
ఆటో ఎక్కితే గీచిగీచి బేరమాడి ఎక్కుతాం. మూడ్ బాగుంటే.. ఐదో పదో చిల్లర మనకు ఆటో వాలా నుంచి రావాల్సి వస్తే..
ఒకే ఇంట్లో మూడుసార్లు చోరీ.. కిలో బంగారం అపహరణ
ఆటోవాలాలకు నగదు బదులు గోల్డ్ కాయిన్స్ ఇచ్చిన నిందితుడు
అదుపులోకి తీసుకున్న అనంత పోలీసులు
పోలీసులు చెప్పేదాకా చూసుకోని ఇంటి యజమాని
రికవరీ కోసం పోలీసుల తంటాలు
అనంతపురం క్రైం, అక్టోబరు 30: ఆటో ఎక్కితే గీచిగీచి బేరమాడి ఎక్కుతాం. మూడ్ బాగుంటే.. ఐదో పదో చిల్లర మనకు ఆటో వాలా నుంచి రావాల్సి వస్తే.. నువ్వే ఉంచుకో అంటాం! అంతేగానీ పాత సినిమాలో ఇచ్చినట్లు మరీ గోల్డ్ కాయిన్స్ ఇస్తామా? ఇచ్చినా.. ఆటోవాలా అది బంగారం అని నమ్ముతాడా?.. కానీ.. అనంతపురం నగరానికి చెందిన ఓ యువకుడు ఆటోవాలకు ఇలా దర్జాగా గోల్డ్ కాయిన్స్ ఇచ్చాడట. అది తీసుకున్న ఆటోవాలాలు బిత్తరపోయారట. ఆటోవాలాలకే కాదు.. ఓ హోటల్‌లో భోజనం చేసి.. గోల్డ్‌కాయిన్ ఇచ్చి క్యాషియర్‌ను ఆశ్చర్యపరిచాడట. ఈ గోల్డ్ మ్యాన్ సంగతి ఆ నోటా ఈ నోటా పాకి.. చివరకు అనంతపురం వన్‌టౌన్ సీఐ రెడ్డప్ప చెవిన పడింది. వన్‌టౌన్ పోలీసులను పురమాయించి ఆరా తీస్తే.. ఈ టక్కరి దొంగ ఘనత బయట పడింది. ఇంకా చిత్రమేమిటంటే.. ఈ బంగారం మొత్తం ఒకే ఇంట్లో మూడు సార్లు చోరీ చేసి ఏకంగా కిలో బంగారం పట్టుకుపోయినా.. ఆ సంగతి పోలీసులు చెప్పేవరకు ఆ ఇంటి యజమానికే తెలియలేదట! నిందితుడిని విచారించి.. చోరీ విషయాన్ని యజమానికి చెప్పగా.. అప్పుడు బీరువా తెరిచి చూసుకుని ‘నిజమే సార్.. మా బంగారం పోయింది’ అని అన్నాడట. కేవలం 18 ఏళ్ల వయసున్న ఆ యువదొంగ పేరు షమీర్ అని పోలీసులు తెలిపారు. తల్లిదండ్రులది గుజరాత్‌లోని సూరత్ పట్టణం. అనంతపురం నగరంలోని ఓ అనాథాశ్రమంలో పెరిగాడని సమాచారం. ఇక్కడే పాఠశాల విద్యనభ్యసించాడు. ప్రస్తుతం నగరంలోని ఓ హోటల్‌లో పనిచేస్తున్నాడు. అప్పుడప్పుడు దొంగతనాలు చేస్తుంటాడని పోలీసుల విచారణలో తేలింది.
ఒకే ఇంట్లో మూడుసార్లు..
అనంతపురం రెండో రోడ్డులో ఉంటున్న ప్రైవేటు అకౌంటెంట్ ఆదిశేషు గుప్తా ఇంట్లో మూడుసార్లు షమీర్ చోరీ చేశాడు. దఫదఫాలుగా బంగారు కాయిన్లు, బంగారు ఆభరణాలు.. కిలో వరకు చోరీ చేశాడు. ఇంట్లో బాత్‌రూమ్ కిటికీ గ్రిల్ ద్వారా ఇంట్లోకి ప్రవేశించి బంగారాన్ని ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. ఆటోవాలాలకు గోల్డ్ కాయిన్స్ ఇస్తున్న విషయం తెలిసి, వన్‌టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకుంటేగానే విషయం వెలుగులోకి రాలేదు. వన్‌టౌన్ పోలీసులు ఇచ్చిన సమాచారం ఆధారంగా, త్రీటౌన్ స్టేషన్ పరిధిలోని ఆదిశేషు గుప్తా ఇంట్లో ఆరాతీశాక.. దొంగతనం నిజమే అని తేలింది. పోలీసుల ఇంటికి వచ్చి.. ‘మీ ఇంట్లో దొంగతనం జరిగింది’ అని చెబితేగానీ వారు బీరు తీయలేదట. బంధువొకరు మృతి చెందడంతో కొంతకాలంగా బీరువా తెరవక, చోరీని గుర్తించలేదని పోలీసులు అంటున్నారు.
దొంగ దొరికాడు.. రికవరీ ఎలా?
పోలీసులు పెద్దగా కష్టపడకుండానే దొంగ పట్టుబడ్డాడు. దొంగతనం జరిగిన ఇల్లు తెలిసింది. కానీ నిందితుడి నుంచి బంగారు ఆభరణాల రికవరీ పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారింది. చోరీ చేసిన తరువాత హైదరాబాద్, సూరత్ సహా పలు ప్రాంతాలకు వెళ్లి.. బంగారు ఆభరణాలు ఇచ్చి వచ్చినట్లు సమాచారం. అనంతపురం నగరంలోనూ కొన్ని ప్రాంతాల్లో గోల్డ్ కాయిన్స్ ఇచ్చాడు. వీటన్నింటినీ ఎవరెవరికి ఇచ్చాడో గుర్తించి.. రికవరీ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి అనంతపురంలో 300 గ్రాముల బంగారం రికవరీ చేశారు. హైదరాబాద్‌లోనూ కొంత రికవరీ చేసినట్లు సమాచారం.