సెబీపై ధిక్కార చర్యలు తీసుకోండి!
ABN , First Publish Date - 2023-11-20T00:42:37+05:30 IST
నిర్ధారించిన కాలపరిమితిలోపు అదానీ-హిండెన్‌బర్గ్ విషయంలో దర్యాప్తు పూర్తి చేయనందుకు సెక్యూరిటీ్‌స-ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ)పై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టులో ..

‘అదానీ-హిండెన్‌బర్గ్’ అంశంలో గడువులోగా దర్యాప్తు పూర్తి చేయలేదు
సుప్రీంలో అశోక్ తివారీ పిటిషన్
న్యూఢిల్లీ, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): నిర్ధారించిన కాలపరిమితిలోపు అదానీ-హిండెన్‌బర్గ్ విషయంలో దర్యాప్తు పూర్తి చేయనందుకు సెక్యూరిటీ్‌స-ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ)పై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ వ్యవహారంపై దర్యాప్తు పూర్తి చేసి ఈ ఏడాది ఆగస్టు 14లోపు నివేదిక సమర్పించాలని మే 17న కోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ సెబీ ఇంతవరకు తన తుది నివేదిక సమర్పించలేదు. దీంతో ఆ సంస్థపై ధిక్కార చర్యలు చేపట్టాలంటూ న్యాయవాది అశోక్ తివారీ ఈ పిటిషన్ వేశారు. ఈ అంశంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరగాలని గతంలో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది ఈయనే కావడం గమనార్హం. స్టాక్ మార్కెట్లో అదానీ గ్రూపు అక్రమాలకు పాల్పడుతున్నట్లు ‘ఆర్గనైజ్‌డ్ క్రైమ్ అండ్ కరప్షన్ ప్రాజెక్ట్ (ఓసీసీఆర్‌పీ)’ అనే సంస్థ ప్రచురించిన నివేదికను కూడా తివారీ తన పిటిషన్‌లో ప్రస్తావించారు. సదరు నివేదికపై విచారణ జరిపించాల్సిందిగా సుప్రీంకోర్టు నియమించిన నిపుణుల కమిటీకి ఆదేశాలు జారీ చేయాలని ఆయన కోరారు. నిజానికి ఆగస్టు 29న అదానీ-హిండెన్‌బర్గ్ అంశం విచారణకు రావలసి ఉన్నప్పటికీ ఇంతవరకూ సుప్రీంకోర్టులో లిస్ట్ కాలేదు. ఈ అంశాన్ని సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఈ నెల 6వ తేదీన సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ దృష్టికి తీసుకెళ్లారు. కోర్టు రిజిస్ర్టీతో చర్చిస్తానని సీజేఐ హామీ ఇచ్చారు. అదానీ గ్రూపు స్టాక్ మార్కెట్‌లో విస్తృత అక్రమాలకు పాల్పడుతోందని.. వాటాల ధరలను కృత్రిమంగా పెరిగేలా చేస్తోందని ఈ ఏడాది జనవరి 24న అమెరికాకు చెందిన ‘హిండెన్‌బర్గ్ రీసెర్చ్’ సంస్థ సంచలనాత్మక నివేదిక విడుదల చేసినప్పటి నుంచి ఈ విషయంపై దేశంలో తీవ్ర దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే.