Share News

Swearing New CMs : కొత్త సీఎంల ప్రమాణ స్వీకారం

ABN , Publish Date - Dec 14 , 2023 | 05:25 AM

మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఆ రాష్ట్ర బీజేపీ లెజిస్లేచర్‌ పార్టీ నాయకుడు, సౌత్‌ ఉజ్జెయిని ఎమ్మెల్యే మోహన్‌ యాదవ్‌(58) బుధవారం భోపాల్‌లో ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్‌ మంగుభాయ్‌ పటేల్‌ భోపాల్‌లోని లాల్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ఆయనతో

Swearing New CMs : కొత్త సీఎంల ప్రమాణ స్వీకారం

మధ్యప్రదేశ్‌లో మోహన్‌ యాదవ్‌, ఛత్తీస్‌గఢ్‌లో విష్ణుదేవ్‌ సాయ్‌

రాజస్థాన్‌ ముఖ్యమంత్రిగా రేపు భజన్‌లాల్‌ శర్మ ప్రమాణస్వీకారం

భోపాల్‌, రాయ్‌పూర్‌, జైపూర్‌, డిసెంబరు 13: మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఆ రాష్ట్ర బీజేపీ లెజిస్లేచర్‌ పార్టీ నాయకుడు, సౌత్‌ ఉజ్జెయిని ఎమ్మెల్యే మోహన్‌ యాదవ్‌(58) బుధవారం భోపాల్‌లో ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్‌ మంగుభాయ్‌ పటేల్‌ భోపాల్‌లోని లాల్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. మల్హాఘర్‌ ఎమ్మెల్యే జగ్‌దీష్‌ దేవ్డా, రేవా ఎమ్మెల్యే రాజేంద్ర శుక్లా ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణం చేశారు. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, తాజామాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండే, ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌, ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్‌ సింగ్‌ ధామి, గుజరాత్‌ సీఎం భూపేంద్ర పటేల్‌, కేంద్ర మంత్రులు జ్యోతిరాదిత్య సింధియా, నితిన్‌ గడ్కరీ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మోహన్‌ యాదవ్‌ మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోదీ నాయకత్వంలో విద్య, ఆరోగ్యం, ఉద్యోగ కల్పనతోపాటు ఇతర రంగాల్లో అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రమాణస్వీకారం చేసిన వెంటనే ఆయన రాష్ట్రంలో బహిరంగ ప్రదేశాల్లో, ప్రార్థనా స్థలాల వద్ద లౌడ్‌స్పీకర్ల వినియోగంపై నిషేధం విధించడం విశేషం. మూడుసార్లు ఎమ్మెల్యేగా నెగ్గిన మోహన్‌ యాదవ్‌ మధ్యప్రదేశ్‌కు 19వ సీఎం. బీజేపీ నుంచి నాలుగో ఓబీసీ ముఖ్యమంత్రి. యాదవ్‌ నియామకంతో బీజేపీలో దిగ్గజ నాయకుడు, నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ శకం ముగిసినట్లయ్యింది.

మోహన్‌ యాదవ్‌ ప్రమాణస్వీకారం చేయడానికి ముందు తాజామాజీ ముఖ్యమంత్రి శివ్‌రాజ్‌ సింగ్‌ చౌహాన్‌ విలేకరులతో మాట్లాడుతూ...‘‘అల్‌ విదా... జస్‌ కి తస్‌ రఖ్‌ దేని చదరియా’’ (ఇక వీడ్కోలు...ఎలా జరిగేది అలా జరగనివ్వండి) అని అన్నారు. నూతన సీఎం ప్రమాణ స్వీకార ఏర్పాట్లను చౌహాన్‌ పర్యవేక్షించడం విశేషం. మరోవైపు ఛత్తీ్‌సగఢ్‌ నూతన ముఖ్యమంత్రిగా విష్ణు దేవ్‌ సాయ్‌ బుధవారం మధ్యాహ్నం రాయ్‌పూర్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. ఉప ముఖ్యమంత్రులుగా అరుణ్‌ సావ్‌, విజయ్‌ శర్మ ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌, అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ, ఛత్తీ్‌సగఢ్‌ తాజామాజీ ముఖ్యమంత్రి భూపేష్‌ భగేల్‌ హాజరయ్యారు. గణనీయంగా గిరిజన జనాభా ఉన్న రాష్ట్రంలో గిరిజనుడినే సీఎం చేయాలన్న ప్రధాన మోదీ లక్ష్యానికి అనుగుణంగా రాష్ట్రంలో సీఎం నియామకం జరిగింది. ఇక రాజస్థాన్‌ సీఎంగా, ఉప ముఖ్యమంత్రులుగా బీజేపీ నాయకత్వం ప్రకటించిన భజన్‌లాల్‌ శర్మ, దియా కుమారి, ప్రేమ్‌చంద్‌ బైర్వా ఈ నెల 15న ప్రమాణస్వీకారం చేయనున్నారు.

Updated Date - Dec 14 , 2023 | 05:25 AM