పార్లమెంటు ప్రారంభోత్సవంపై ‘పిల్‌’ విచారణకు సుప్రీం నిరాకరణ

ABN , First Publish Date - 2023-05-27T04:00:42+05:30 IST

పార్లమెంటు కొత్త భవనాన్ని ప్రధాని మోదీకి బదులుగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రారంభింపజేసేలా లోక్‌సభ సెక్రటేరియట్‌కు ఆదేశాలివ్వాలని కోరుతూ దాఖలైన పిల్‌పై విచారణ చేపట్టేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది.

పార్లమెంటు ప్రారంభోత్సవంపై ‘పిల్‌’ విచారణకు సుప్రీం నిరాకరణ

న్యూఢిల్లీ, మే 26: పార్లమెంటు కొత్త భవనాన్ని ప్రధాని మోదీకి బదులుగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రారంభింపజేసేలా లోక్‌సభ సెక్రటేరియట్‌కు ఆదేశాలివ్వాలని కోరుతూ దాఖలైన పిల్‌పై విచారణ చేపట్టేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. సుప్రీం కోర్టు న్యాయవాది జయా సుకిన్‌ దాఖలు చేసిన ఈ వ్యాజాన్ని జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ పీఎస్‌ నరసింహతో కూడిన ధర్మాసనం శుక్రవారం పరిశీలించింది. ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేయడం వెనుక ఉద్దేశం కోర్టుకు తెలుసని, రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 32 కింద దీన్ని విచారించేందుకు నిరాకరిస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. కోర్టు ఖర్చులు వసూలు చేయనందుకు పిటిషనర్‌ సంతోషించాలని వ్యాఖ్యానించింది. ఈ క్రమంలోనే తాను వ్యాజ్యాన్ని ఉపసంహరించుకుంటానని పిటిషనర్‌ కోరగా ధర్మాసనం అంగీకరించింది. కాగా, పార్లమెంటు ప్రారంభోత్సవాన్ని బహిష్కరిస్తున్నట్టు కాంగ్రెస్‌ సహా 19 ప్రతిపక్ష పార్టీలు బుధవారమే ఒక సంయుక్త ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే.

Updated Date - 2023-05-27T04:00:42+05:30 IST