Supreme Court: కోర్టులకు అధికారుల హాజరుపై మార్గదర్శకాలు!
ABN , First Publish Date - 2023-08-22T02:35:49+05:30 IST
కేసుల విచారణ నిమిత్తం ప్రభుత్వ అధికారులను న్యాయస్థానాలకు హాజరు పరిచే విషయంలో మార్గదర్శకాలు జారీ చేస్తామని సోమవారం సుప్రీంకోర్టు తెలిపింది.
వారు ధరించాల్సిన దుస్తులపైనా సూచనలు చేస్తామన్న సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ, ఆగస్టు 21: కేసుల విచారణ నిమిత్తం ప్రభుత్వ అధికారులను న్యాయస్థానాలకు హాజరు పరిచే విషయంలో మార్గదర్శకాలు జారీ చేస్తామని సోమవారం సుప్రీంకోర్టు తెలిపింది. కోర్టు ధిక్కరణ కేసులో ఇద్దరు అధికారులను అలహాబాద్ హైకోర్టు అరెస్టు చేయించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించింది. అధికారులపై కేసుల విచారణ విషయంలో ప్రామాణిక నిర్వహణ విధానా(స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్-ఎ్‌సఓపీ)న్ని రూపొదించాలంటూ కేంద్రం కొన్ని ప్రతిపాదనలను ధర్మాసనం ముందుంచింది. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా..ఎ్‌సఓపీలోని కొన్ని అంశాలపై వివరణ ఇచ్చారు. కోర్టు ధిక్కరణ కేసు చేపట్టడానికి ముందే కింది కోర్టు తీర్పుపై ప్రభుత్వం పైకోర్టులో అప్పీలు చేయడానికి అవకాశం కల్పించాలని ఎస్‌ఓపీలో పేర్కొన్నారు. ఒకవేళ ఆ అప్పీలును పైకోర్టు అంగీకరిస్తే కింది కోర్టులో ఇక విచారణ చేపట్టకూడదని ప్రస్తావించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తప్పకుండా హాజరు కావాలంటూ అన్ని సందర్భాల్లో నిర్దేశించకూడదని సూచించారు. కోర్టుకు హజరయ్యే అఽఽధికార్లు ఎలాంటి దుస్తులు ధరించాలనేదానిపైనా తుషార్ మెహతా అభిప్రాయాలను చెప్పారు. అధికారులు అన్ని సందర్భాల్లో సూట్లలో రాలేరని, భారత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా సూట్‌లు వేసుకోవడం కొందరికి ఇబ్బందని పేర్కొన్నారు. దీనిపై సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ స్పందిస్తూ జీన్స్, టీషర్టులతో కోర్టులకు వస్తేనే సమస్య అని అన్నారు. అఽఽధికారుల విద్యార్హతలపై జడ్జిలు వ్యాఖ్యలు చేయకుండా చూస్తామని జస్టిస్ చంద్రచూడ్ తెలిపారు.