Supreme Court : ‘ఆటోమేటిక్‌ అనర్హత’ చాలా కఠినం

ABN , First Publish Date - 2023-03-31T03:48:24+05:30 IST

జైలు శిక్ష పడ్డ చట్టసభ సభ్యులపై ‘ఆటోమేటిక్‌ అనర్హత’ వేటు వేయాలన్న నిబంధన చాలా కఠినమైనదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. శిక్ష విధించే ముందు కోర్టులు చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సి

Supreme Court : ‘ఆటోమేటిక్‌ అనర్హత’ చాలా కఠినం

చట్టసభ సభ్యులపై తీర్పులు ఇచ్చేటప్పుడు

న్యాయస్థానాలు జాగ్రత్తగా ఉండాలి

14 ఏళ్ల శిక్ష, అనంతరం ఆరేళ్ల

అనర్హత అంటే పరిస్థితి ఏమిటి?: సుప్రీం

న్యూఢిల్లీ, మార్చి 30: జైలు శిక్ష పడ్డ చట్టసభ సభ్యులపై ‘ఆటోమేటిక్‌ అనర్హత’ వేటు వేయాలన్న నిబంధన చాలా కఠినమైనదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. శిక్ష విధించే ముందు కోర్టులు చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సి ఉంటుందని తెలిపింది. తనకు పడ్డ శిక్షపై హైకోర్టు స్టే విధించినా లోక్‌సభ కార్యాలయం తన పదవిని పునరుద్ధరించలేదంటూ లక్షద్వీప్‌ ఎంపీ మహమ్మద్‌ ఫైజల్‌ వేసిన కేసుపై విచారణ జరిపిన జస్టిస్‌ కె.ఎం.జోసెఫ్‌, జస్టిస్‌ బి.వి.నాగరత్నల ధర్మాసనం ఈ వ్యాఖ్య చేసింది. కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ కె.ఎం.నటరాజ్‌ వాదనలు వినిపిస్తూ ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లోని సెక్షన్‌ 8(3) ప్రకారం రెండేళ్ల శిక్ష పడ్డ ప్రజాప్రతినిధులు తక్షణమే ఆటోమేటిక్‌గా అనర్హులవుతారని తెలిపారు. ధర్మాసనం స్పందిస్తూ ‘ఒకవేళ 14 ఏళ్ల శిక్ష పడితే. ఆ శిక్షా కాలం, జైలు నుంచి విడుదలైన అనంతరం ఉండే ఆరేళ్ల అనర్హత.. పరిస్థితిని ఊహించండి’ అని వ్యాఖ్యానించింది. అందువల్ల తీర్పులు ఇచ్చే సమయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఇదే సందర్భంగా కేరళ హైకోర్టు చేసిన వ్యాఖ్యలపై కూడా ధర్మాసనం స్పందించింది. మహమ్మద్‌ ఫైజల్‌పై విధించిన శిక్షను నిలుపుదల చేస్తూ మళ్లీ ఎన్నికలు జరపడం వల్ల ఖర్చులు పెరుగుతాయని అభిప్రాయపడింది.

ఉప ఎన్నికల వ్యయం కోర్టులకు సంబంధం లేని విషయమని తెలిపింది. ప్రస్తుత సమస్య దానికి సంబంధించినది కాదని పేర్కొంది. కాగా, గురువారం ఉదయం ఫైజల్‌ తరఫున న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వి వాదనలు వినిపిస్తూ.. లోక్‌సభ సెక్రటేరియట్‌ ఫైజల్‌ సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తూ నోటిఫికేషన్‌ ఇచ్చిందని ధర్మాసనానికి తెలియజేశారు. తమ రిట్‌ పిటిషన్‌ను ప్రస్తుతానికి ముగించవచ్చని తెలిపారు. సీనియర్‌ న్యాయవాది మేనక గురుస్వామి ఈ అంశంలో జోక్యం చేసుకోవాలని ప్రయత్నించగా.. ధర్మాసనం అంగీకరించలేదు. అనంతరం ఫైజల్‌కు పదేళ్ల జైలు శిక్షను సస్పెండ్‌ చేస్తూ కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ లక్షద్వీప్‌ అధికార యంత్రాంగం దాఖలు చేసిన అప్పీలును విచారణకు స్వీకరించింది. అయితే సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాయిదా కోరారు. దీంతో ధర్మాసనం తదుపరి విచారణను ఏప్రిల్‌ 24కు వాయిదా వేసింది. కాగా, ‘ఆటోమేటిక్‌ అనర్హత’కు వీలు కలిగిస్తున్న సెక్షన్‌ 8(3) చాలా కఠినమైదని ప్రస్తుత ధర్మాసనం అభిప్రాయపడగా, గతంలో ఇచ్చిన ఒక తీర్పులో సుప్రీంకోర్టు ఈ నిబంధనను సమర్థించింది. దీంతో సుప్రీంకోర్టు తీర్పును తోసిరాజనడానికి అప్పటి మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం ఆర్డినెన్స్‌ తీసుకురాగా.. స్వయంగా రాహుల్‌ గాంధీయే దాన్ని అడ్డుకున్నారు.

Updated Date - 2023-03-31T04:00:43+05:30 IST