Share News

Sukesh Chandrasekhar: అసలు మాస్టర్‌మైండ్ సీఎం కేజ్రీవాల్.. సుకేష్ చంద్రశేఖర్ నుంచి మరో సంచలన లేఖ

ABN , First Publish Date - 2023-11-15T16:40:55+05:30 IST

రూ.200 కోట్ల దోపిడీ కేసులో అరెస్ట్ అయినప్పటి నుంచి.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఆయన పార్టీకి వ్యతిరేకంగా ‘కాన్‌మాన్’ సుకేష్ చంద్రశేఖర్ వరుస లేఖలు జారీ చేస్తున్నాడు. తాజాగా అతడు మరో సంచలన లేఖ రాశాడు. జైలు నుంచి దోచుకుంటున్న డబ్బుకు..

Sukesh Chandrasekhar: అసలు మాస్టర్‌మైండ్ సీఎం కేజ్రీవాల్.. సుకేష్ చంద్రశేఖర్ నుంచి మరో సంచలన లేఖ

రూ.200 కోట్ల దోపిడీ కేసులో అరెస్ట్ అయినప్పటి నుంచి.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఆయన పార్టీకి వ్యతిరేకంగా ‘కాన్‌మాన్’ సుకేష్ చంద్రశేఖర్ వరుస లేఖలు జారీ చేస్తున్నాడు. తాజాగా అతడు మరో సంచలన లేఖ రాశాడు. జైలు నుంచి దోచుకుంటున్న డబ్బుకు ప్రధాన సూత్రధారి అరవింద్ కేజ్రీవాల్ అని అందులో పేర్కొన్నాడు. అంతేకాదు.. సీబీఐ దర్యాప్తునకు సహకరించాలని సూచించాడు. దమ్ముంటే.. తనతో ఒక నార్కో పరీక్షలో పాల్గొనాలని కూడా సవాల్ చేశాడు.


ఇటీవల ఆప్ నాయకుడు సత్యేంద్ర జైన్, ఇతర జైలు అధికారులు రూ.10 కోట్ల మేర దోపిడీకి పాల్పడ్డారని సుకేష్ ఆరోపణలు చేయగా.. వారిపై కేసు నమోదు చేసేందుకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాను కోరింది. అప్పుడు అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా స్పందించారు. ఈ నేపథ్యంలోనే సుకేష్ తాజాగా మరో లెటర్ రాశాడు. ‘‘సీఎం కేజ్రీవాల్.. మీకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేకపోతే, దయచేసి బ్లేమ్ గేమ్స్ ఆపేసి, సీబీఐ దర్యాప్తుకు సహకరించండి. అలాగే మీకు దమ్ముంటే.. నాతో ఒక నార్కో పరీక్షలో పాల్గొండి’’ అని ఆ లేఖలో పేర్కొన్నాడు. ఈ దేశంలోనే తానో పెద్ద దోపిడీదారుడినని తనపై వ్యాఖ్యలు చేసే హక్కు సీఎం కేజ్రీవాల్‌కి లేదని చెప్పాడు.

తనపై ఆరోపణలు చేయడానికి ముందు మీరే చూసుకోండని.. మీ ముగ్గురు ముఖ్య సహచరులు ప్రజా ధనాన్ని దోచుకున్నందుకు, అవినీతికి పాల్పడినందుకు జైలులో ఉన్నారని సుకేష్ పేర్కొన్నాడు. త్వరలో మీరు కూడా తీహార్ క్లబ్‌లో భాగమవుతారని, ఈ కేసులో మీరే అసలు మాస్టర్‌మైండ్ అనే అతడు కుండబద్దలు కొట్టాడు. కేజ్రీవాల్‌తో పాటు ఆయన సహచరులు దోషులని నిరూపించడానికి తన వద్ద తగిన సాక్ష్యాలు ఉన్నాయని కూడా చెప్పాడు. తనను మౌనంగా ఉంచేందుకు కేజ్రీవాల్, ఆయన సహచరులు బెదిరింపులకు పాల్పడటంతో పాటు ఆఫర్లు పంపుతున్నారన్నాడు. అరవింద్ కేజ్రీవాల్ తనకు రాజ్యసభ సీటును కూడా ఆఫర్ చేశారని సుకేష్ ఆ లేఖలో చెప్పుకొచ్చాడు.

కాగా.. మంత్రి సత్యేంద్ర జైన్‌కు రక్షణ సొమ్ముగా రూ.10 కోట్లు, ఆ తర్వాత మరో రూ.60 కోట్లు ఆమ్ ఆద్మీ పార్టీకి చెల్లించానని తాను రాసిన మొదటి లేఖలో సుకేష్ చంద్రశేఖర్ ఆరోపించాడు. అప్పుడు ఈ ఆరోపణల్ని కేజ్రీవాల్ ఖండించారు. బీజేపీ ఆదేశాలపైనే అతడు పని చేస్తున్నాడని, అధికార పార్టీ అతనిని జాతీయ అధ్యక్షుడిగా చేయాలని మండిపడ్డారు.

Updated Date - 2023-11-15T16:41:15+05:30 IST