గాజాలో ఆకలిరాజ్యం!
ABN , First Publish Date - 2023-11-06T03:39:59+05:30 IST
యుద్ధ కల్లోలిత గాజా క్రమంగా ఆకలిరాజ్యంగా మారుతోంది.
తినేది రోజుకు రెండు రొట్టె ముక్కలే
ఎక్కడ చూసినా ఆకలి కేకలు.. తిండి దోపిడీలు!!
గాజాపై అణుబాంబు వేస్తామన్న ఇజ్రాయెల్ మంత్రి
వెంటనే తొలగించిన ప్రధాని నెతన్యాహు
యుద్ధ కల్లోలిత గాజా క్రమంగా ఆకలిరాజ్యంగా మారుతోంది. సలాహ్ అల్-దీన్ వద్ద ఇజ్రాయెల్ సేనలు మోహరించడంతో.. ఉత్తర-దక్షిణ గాజాల మధ్య సంబంధాలు తెగిపోయాయి. ఫలితంగా ఈజిప్ట్ నుంచి రఫా సరిహద్దు మీదుగా వస్తున్న మానవతాసాయం గాజాకు చేరడం లేదు. దీంతో.. గాజా ఉత్తరాది వారికి పూటకు ఒక రొట్టె దొరకడం కూడా గగనంగా మారుతోంది. ‘‘గాజా మొత్తమ్మీద ఒక సగటు పౌరుడు రోజుకు రెండు రొట్టెముక్కలు తిని జీవిస్తున్నాడు. తాగడానికి మంచినీళ్లు కూడా లేవు’’ అని ఐరాస సెక్రటరీ జనరల్ గుటెర్రస్ ఆందోళన వ్యక్తం చేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. పరిస్థితులు మరో వారంపదిరోజులు ఇలాగే కొనసాగితే.. ఆకలిచావులు తప్పవని గాజాలోని ఎన్జీవోలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఉత్తర గాజాతోపాటు.. దక్షిణాదిన కూడా దారుణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. నుసిరాత్ శిబిరంలో ఉన్న ఓ రైతు.. తన పిల్లలు పాలు తాగి మూడు వారాలవుతోందని కన్నీటి పర్యంతం చెప్పారు. యూఎన్‌ఆర్‌డబ్ల్యూఎ్‌స గోదాములు లూటీ అయ్యాయని, దాంతో పప్పులు, పిండి లభించడం లేదన్నారు. ఐరాస శిబిరాల వద్ద కూడా ఆరు గంటల పాటు క్యూలైన్‌లో నిలబడితే తప్ప రొట్టెముక్క దొరికే పరిస్థితి లేదని ఫెరోజ్ అనే యువకుడు చెప్పారు. అల్-హుర్రా వార్తా సంస్థ తరఫున ఫొటో జర్నలిస్టుగా పనిచేస్తున్న సయీద్ అల్-సబా గాజాలో పరిస్థితిని వివరిస్తూ.. ‘‘బాంబు దాడులతో సర్వం కోల్పోయిన పౌరులకు.. వంట చేసుకునేందుకు గ్యాస్ లేదు. సామగ్రి లేదు. దాంతో దొరికిన చెత్త, కలపతో మంట వెలిగించి, డబ్బాల ఇనప రేకులను పెనాలుగా మార్చి రొట్టెలు చేసుకోవడం కనిపించింది. చాలా చోట్ల చిన్నారుల పరిస్థితి దారుణంగా ఉంది’’ అని చెప్పారు. తన ముగ్గురు పిల్లలు కూడా రోజూ పస్తులుండే పరిస్థితి నెలకొందన్నారు.
అణ్వాయుధాలు ఉన్నట్లు ఒప్పుకొన్నట్లేనా?
ఇజ్రాయెల్ మంత్రి అమిచాయ్ ఎలియాహు ఆదివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ రేడియో ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ గాజాలో ప్రస్తుతం తమకు వ్యతిరేకంగా యుద్ధం చేయని వారే లేరని వ్యాఖ్యానించారు. అయితే.. గాజాపై అణుబాంబు వేస్తారా? అని అడిగిన ప్రశ్నకు ఆయన అది సాధ్యమేనని సమాధానమిచ్చారు. ఈ వ్యాఖ్య తీవ్ర దుమారం రేపడంతో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అత్యవసర క్యాబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేసి, ఎలియాహును మంత్రివర్గం నుంచి తొలగించారు. అయితే.. ఇంతకాలం ఇజ్రాయెల్ తమ వద్ద అణ్వాయుధాలున్నాయా? లేవా? అనే విషయాన్ని బయటపెట్టలేదు. తాజా ఉదంతంతో ఇజ్రాయెల్ వద్ద అణ్వస్త్రాలున్నట్లు తెలుస్తోంది.
యూదుల రాజ్యం వద్దంటూ వైట్ హౌస్ గేట్లపై రాతలు
పాలస్తీనా అనుకూల ఆందోళనకారులు అమెరికా అధ్యక్షుడి అధికార నివాసం వైట్‌హౌస్ గేట్లపై ఎరుపురంగు పెయింట్‌తో ‘‘యూదుల రాజ్యం వద్దు’’ అంటూ పెద్దపెద్ద అక్షరాలను రాశారు. కాగా.. బందీలను వెంటనే విడిపించాలని డిమాండ్ చేస్తూ టెల్ అవీవ్‌లో ఇజ్రాయెల్ పౌరులు భారీ ఆందోళనను నిర్వహించారు. ఇంకోవైపు గాజాలో మానవతాసాయానికి ఇజ్రాయెల్ ఆటంకాలను కలిగించడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు అంతర్జాతీయ నేర న్యాయస్థానం(ఐసీసీ) ప్రాసిక్యూటర్ కరీంఖాన్ వ్యాఖ్యానించారు.
(సెంట్రల్ డెస్క్)
శరణార్థి శిబిరంపై దాడి.. 40 మంది మృతి
ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సె్‌స ఆదివారం జబాలియాలోని శరణార్థి శిబిరంపై బాంబు దాడులు చేసింది. గత నెల 31న కూడా ఓ శరణార్థి శిబిరంపై దాడి జరిగి 135 మంది చనిపోయిన ఘటనను ఖండించిన అమెరికా.. ఇజ్రాయెల్‌ను వివరణ కోరిన 24 గంటల్లోనే.. మరో శరణార్థి శిబిరంపై దాడి జరిగింది. ఈ ఘటనలో 40 మంది చనిపోయారు.