South Cinema: దక్షిణాది సినిమా వెలిగిపోతోంది!
ABN , First Publish Date - 2023-04-27T01:59:17+05:30 IST
ఏ క్షణంలో రాజమౌళి బాహుబలి సినిమాను పాన్ ఇండియా సినిమాగా విడుదల చేశాడోగానీ.. అప్పట్నుంచీ దక్షిణాది సినిమా ప్రభ వెలిగిపోతోంది
అందులో 52% తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ పరిశ్రమలదే
2022లో దక్షిణాది చిత్రాల వృద్ధి ఏకంగా 96 శాతంగా నమోదు
సౌత్ సినిమాలకు ఉత్తరాది నీరాజనం ‘బాహుబలి’తో మొదలు
టాలీవుడ్ ఆదాయం రూ.2500కోట్లు
కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ.. తాజా నివేదికలో వెల్లడి
న్యూఢిల్లీ, ఏప్రిల్ 26: ఏ క్షణంలో రాజమౌళి బాహుబలి సినిమాను పాన్ ఇండియా సినిమాగా విడుదల చేశాడోగానీ.. అప్పట్నుంచీ దక్షిణాది సినిమా ప్రభ వెలిగిపోతోంది! బాహుబలి 2 సినిమా కోసం ఇటు దక్షిణాది ప్రేక్షకులే కాదు.. ఉత్తరాదివారు సైతం రెండేళ్లపాటు ఎంతో ఆత్రంగా ఎదురుచూశారు! అంతేనా.. కేజీఎఫ్, పుష్ప, ఆర్‌ఆర్‌ఆర్, కేజీఎఫ్ 2, పొన్నియిన్ సెల్వన్, కార్తికేయ, విక్రమ్, కాంతార.. ఇలా దక్షిణాది చిత్రాలు సూపర్‌డూపర్ హిట్లయి బాక్సాఫీసుల్ని కొల్లగొడుతుంటే బాలీవుడ్ దిగ్దర్శకులు, సూపర్‌స్టార్ల సినిమాలు బాక్సాఫీసు వద్ద వెలవెలపోవడం సర్వసాధారణంగా మారింది. ఈ విషయాలు చెప్పడానికి పెద్ద గణాంకాలు అక్కర్లేదు. కానీ, రుజువుగా గణాంకాలూ అందుబాటులోకి వచ్చాయి. ‘సౌత్ ఇండియా: సెట్టింగ్ బెంచ్‌మార్క్స్ ఫర్ ద నేషన్ ఇన్ మీడియా అచీండ్ ఎంటర్‌టైన్‌మెంట్’ అనే పేరుతో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) తాజాగా ఒక నివేదిక విడుదల చేసింది. అందులో.. దక్షిణాది చిత్ర పరిశ్రమ ప్రభను అంకెల రూపంలో వెల్లడించింది. ఆ నివేదిక ప్రకారం..
భారతదేశ చిత్ర పరిశ్రమ మొత్తం వార్షిక ఆదాయం దాదాపు రూ.15 వేలకోట్లు అనుకుంటే అందులో 52 శాతం దక్షిణాది చిత్రాల ద్వారానే వస్తోంది.
2022లో దక్షిణాది చిత్ర పరిశ్రమ ఏకంగా 96 శాతం వృద్ధిని నమోదు చేసింది.
ఆదాయపరంగా చూస్తే.. తమిళ చిత్ర పరిశ్రమ (కోలీవుడ్) రూ.2950 కోట్లతో అగ్రస్థానంలో నిలవగా.. రూ.2500 కోట్లతో మన టాలీవుడ్ రెండో స్థానంలో, రూ.1570 కోట్ల ఆదాయంతో శాండల్‌వుడ్ (కన్నడ పరిశ్రమ) మూడోస్థానంలో, రూ.816 కోట్ల ఆదాయంతో మలయాళ చిత్రపరిశ్రమ నాలుగో స్థానంలో నిలిచాయి.
2022లో దేశంలో మొత్తం 1691 చిత్రాలు విడుదలయ్యాయి. వాటిలో 916 సినిమాలు.. అంటే సగం కన్నా ఎక్కువ (54ు) దక్షిణాది భాషా చిత్రాలే.
..అయితే, ఆర్‌ఆర్‌ఆర్, కేజీఎఫ్ 2, కాంతార సంచలన హిట్లు ఏటా రావు కాబట్టి.. 2022తో పోలిస్తే 2023లో వసూళ్ల విషయంలో కొంత కరెక్షన్ ఉంటుందని, 2024లో విడుదలయ్యే గణాంకాల్లో ఆ తేడా కనపడుతుందని సీఐఐ అంచనా వేసింది. 2022, 2023లో మాత్రం దక్షిణాది చిత్రాల హవా కొనసాగుతుందని స్పష్టం చేసింది.