రామమందిరం ప్రారంభోత్సవానికి సోనియా?
ABN , Publish Date - Dec 30 , 2023 | 04:05 AM
అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ హాజరుపై ఆ పార్టీ శుక్రవారం స్పందించింది.
తగిన సమయంలో నిర్ణయం ప్రకటిస్తాం
పిట్రోడా వ్యాఖ్యలతో కాంగ్రెస్‌కు సంబంధం లేదు: జైరాం
న్యూఢిల్లీ, డిసెంబరు29(ఆంధ్రజ్యోతి): అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ హాజరుపై ఆ పార్టీ శుక్రవారం స్పందించింది. ఈ కార్యక్రమానికి సోనియాకు ఆహ్వానం అందిందని, ఆమె హాజరుపై తగిన సమయంలో నిర్ణయం తీసుకుని, ప్రకటిస్తామని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి(కమ్యూనికేషన్స్) జైరాం రమేశ్ తెలిపారు. కాగా, అయోధ్యలో రామమందిరం ప్రాముఖ్యతను ప్రశ్నిస్తూ కాంగ్రెస్ నేత సామ్ పిట్రోడా వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఆయన వ్యక్తిగతమైనవని, పార్టీ అధికారిక వైఖరిని అవి ప్రతిబింబించడం లేదని జైరాం రమేశ్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, ప్రధాని మోదీని హిందూ హృదయ సామ్రాట్‌గా చిత్రీకరిస్తూ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో హిందు త్వ ప్రణాళికతో బీజేపీ బరిలోకి దిగనుందని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ అన్నారు. ఈ మేరు శుక్రవారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు.
మతానికి రాజకీయ రంగు: ఏచూరి
రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారి సమక్షంలో ఆయోధ్యలో రామమందిరాన్ని ప్రధాని మోదీ ప్రారంభించడమంటే బీజేపీ రాజకీయ లబ్ధి కోసం ప్రజల మతపరమైన మనోభావాలను దుర్వినియోగం చేయడమేనని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. శుక్రవారం ఆయన కేరళలోని కన్నూరలో మీడియాతో మాట్లాడారు. మతానికి రాజకీయ రంగు పులమడానికి ఈ కార్యక్రమమే నిదర్శనమన్నారు. ఇది రాజ్యాంగ సూత్రాలకు, సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధమని స్పష్టంచేశారు.