Sitting MLAs: త్రిశంకు స్వర్గంలో 20 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు
ABN , First Publish Date - 2023-01-31T11:25:46+05:30 IST
శాసనసభ ఎన్నికల్లో టికెట్లు ఖచ్చితంగా నిరాకరించే జాబితాలో 20 మందికి పైగా బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నట్టు ఆ
- కాంగ్రెస్, జేడీఎస్ వైపు చూపు
బెంగళూరు, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): శాసనసభ ఎన్నికల్లో టికెట్లు ఖచ్చితంగా నిరాకరించే జాబితాలో 20 మందికి పైగా బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నట్టు ఆ పార్టీ వర్గాల ద్వారా అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. అధిష్టానం పెద్దల పర్యవేక్షణలోనే ఈసారి బీజేపీ టికెట్ల కేటాయింపు ప్రక్రియ ఉంటుందని, ఇందులో మాజీ సీఎం యడియూరప్ప(Former CM Yeddyurappa)ను కూడా విశ్వాసంలోకి తీసుకోబోతున్నారని సమాచారం. పలువురు సీనియర్ బీజేపీ ఎమ్మెల్యేలకు ఈసారి టికెట్లు నిరాకరించి వారిని పార్టీ సేవలకు వినియోగించుకోవాలని అధిష్టానం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. వీరి స్థానంలో కొత్తముఖాలకు చోటు కల్పించనున్నారని సమాచారం. ఉత్తరప్రదేశ్, గుజరాత్ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో అనుసరించిన ఫార్ములా ప్రకారమే ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న 20 మంది ఎమ్మెల్యేలను పక్కనపెట్టడం ఖాయమని తేలినట్టు ఆ వర్గాలు తెలిపాయి. ఈ పరిణామాలతో బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ఆందోళన నెలకొంది. టికెట్లు నిరాకరించేవారి జాబితాపై ఇంకా స్పష్టత లేనప్పటికీ నేరుగా అధిష్టానం పెద్దలు ఫోన్ చేసి టికెట్లు నిరాకరిస్తున్న సంగతిని చెప్పే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి. రాష్ట్ర బీజేపీలో ఇప్పటికే 80మందికి పైగా ఎమ్మెల్యేలకు తమ తమ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రక్రియ ప్రారంభించుకోవాలని అధిష్టానం పెద్దల నుంచి రహస్య సంకేతాలు వెళ్లినట్టు తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయం బయటపెట్టరాదని వారికి తాఖీదులు అందినట్టు తెలుస్తోంది. అందుకే ఎవరూ నోరు మెదపడం లేదు. పార్టీ నేతల ప్రైవేట్ సంభాషణల్లో టికెట్ రాదనే సంకేతాలు ఉన్నవారు మాత్రమే తమ రాజకీయ భవిష్యత్తును పదిలం చేసుకునే ప్రయత్నాల్లో భాగంగా కాంగ్రెస్, జేడీఎస్ వైపు దృష్టి సారించినట్టు తెలుస్తోంది. కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్(DK Sivakumar), మాజీ సీఎం సిద్దరామయ్యతోనూ కొందరు బీజేపీ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నట్టు చెబుతున్నారు. ఇంత వరకు బీజేపీ నిర్వహించిన రెండు అంతర్గత రహస్య సమీక్షల్లో శాసనసభ ఎన్నికల్లో పార్టీకి పూర్తి మెజారిటీ వచ్చే అవకాశం లేదని తేలడంతో ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో సాధ్యమైన మేరకు ఎన్నికలకు ముందే విస్తృత పర్యటనలు జరిగేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం ఇం దులో భాగమేనని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
వారూ రావచ్చు: నళిన్‌కుమార్ కటీల్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నళిన్‌కుమార్ కటీల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు రోజులుగా ఇదే వల్లె వేస్తుండడం గమనార్హం. హాసన్ జిల్లాకు చెందిన కాంగ్రెస్, జేడీఎ్‌సకు చెం దిన పలువురు నేతలు మల్లేశ్వరంలోని కార్యాలయంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరిలో కాంగ్రెస్ యువనేత కవీశ్‌గౌడ వాసు, జేడీఎస్ నేత సోమశేఖర్, వెంకటేశ్, రైతు నేత దివాకర్‌గౌడ, కేపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి సీవీ రాజప్ప, జేడీఎస్ నేత గిరీశ్ నాసి ఉన్నారు. మంత్రి గోపాలయ్య తదితరులు పాల్గొన్నా రు. అనంతరం కటీల్ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ బస్సు యాత్ర ఫెయిలయిందని, జేడీఎస్ చేపట్టిన పంచరత్న యాత్ర దిక్కు తప్పిందని ఎద్దేవా చేశారు. ప్రజాతీర్పును అపహాస్యం చేసి అపవిత్ర పొత్తుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కారణంగా గతంలో 17 మంది కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు లేవనెత్తారని పేర్కొన్నారు. రాజకీయాల్లో ఇలాంటివి సర్వసాధరణమని తెలిపారు. ఆపరేషన్ కమల, ఎమ్మెల్యేల కొనుగోళ్లు వంటి ఆరోపణలు నిరాధారమని తెలిపారు. రాజీనామా చేసిన 17 మంది ఎమ్మెల్యేలు దర్జాగా ఎన్నికల్లో మళ్లీ పోటీ చేసి ప్రజాశీస్సులు పొందారని ఆయన గుర్తు చేశారు. ప్రజాతీర్పును ప్రశ్నించే స్థాయికి కాంగ్రెస్, జేడీఎ్‌సలు దిగజారాయని చురకలంటించారు. చిక్కబళ్ళాపుర జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్, జేడీఎస్ నేతలు కూడా సీఎం బొమ్మై సమక్షంలో సోమవారం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి సుధాకర్ కూడా హాజరయ్యారు. కోలారు, చిక్కబళ్లాపుర జిల్లాల్లో వీరి చేరికతో బీజేపీ మరింతగా బలపడుతుందని సీఎం అన్నారు.