Shraddha Walker Muder Case: 3 వేల పేజీల ఛార్జిషీటు

ABN , First Publish Date - 2023-01-22T16:05:35+05:30 IST

శ్రద్ధావాకర్ హత్య కేసు దేశవ్యాప్తంగా ఇటీవల సంచలనం సృష్టించింది. 2022 మేలో ఈ దారుణ హత్యా ఘటన చోటుచేసుకున్నప్పటికీ..

Shraddha Walker Muder Case: 3 వేల పేజీల ఛార్జిషీటు

న్యూఢిల్లీ: శ్రద్ధావాకర్ హత్య (Shraddha Walker Murder) కేసు దేశవ్యాప్తంగా ఇటీవల సంచలనం సృష్టించింది. 2022 మేలో ఈ దారుణ హత్యా ఘటన చోటుచేసుకున్నప్పటికీ ఇప్పటికీ ఈ కేసులో కొత్త విషయాలు వెలికి వస్తున్నాయి. ఈ కేసులో నిందితుడు అఫ్తాబ్ పూనావాలా (Aaftab Poonawala)పై ఢిల్లీ పోలీసులు తాజాగా 3 వేల పేజీల ఛార్జిషీటు (Chargesheet)ను సిద్ధం చేశారు. 100 మందికి పైగా సాక్షుల స్టేట్‌మెంట్లు, ఫోరెన్సిక్ వివరాలను ఈ ఛార్జిషీటులో చేర్చినట్టు తెలుస్తోంది. నేరం చేసినట్టు అఫ్తాబ్ ఇచ్చిన వాంగ్మూలం, అతని నార్కో టెస్ట్ ఫలితాలు, లీగల్ నిపుణులు సైతం సమీక్షించిన అతని ఫోరెన్సిక్ రిపోర్టును పోలీసులు ఇందులో ప్రస్తావించినట్టు సమాచారం. అఫ్తాబ్ వాంగ్మూలం ప్రకారం అతను విసిరివేసిన ప్రాంతాల్లో పోలీసులు కనుగొన్న ఎముకలు శ్రద్ధవాకర్‌వేనని డీఎన్ఏ పరీక్షల్లో వెల్లడైన సమాచారాన్ని కూడా ఛార్జిషీటులో పోలీసులు పొందుపరిచారు.

అఫ్తాబ్‌కు, శ్రద్ధకు మధ్య జరిగిన సంభాషణల ఆడియో క్లిప్‌ను 2022 డిసెంబర్‌లో పోలీసులు కనుగొన్నారు. ఆ ఆడియోలో శ్రద్ధతో అఫ్తాబ్ గొడవపడుతున్నట్టు ఉంది. ఈ కేసులో ఇది చాలా పెద్ద సాక్షమని, హత్య వెనుక ఉద్దేశాన్ని బయటపట్టేందుకు ఈ ఆడియో బాగా ఉపకరిస్తుందని పోలీసులు చెబుతున్నారు. ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ఫోరెన్సిక్ బృందం సైతం అఫ్తాబ్ వాయిస్ శాంపుల్స్‌ను సేకరించింది. అఫ్తాబ్ వాయిస్ శాంపుల్స్, శ్రద్ధతో అతను గొడవపడినప్పటికి ఆడియో క్లిప్‌లోని వాయిస్ ఒకటేనని నిర్ధారణ అయినట్టు కూడా పోలీసులు చెబుతున్నారు.

ఇరవై ఆరేళ్ల శ్రద్ధ వాకర్‌ను అఫ్తాబ్ (28) గత ఏడాది మేలో ఢిల్లీలోని ఓ ఫ్లాట్‌లో అత్యంత దారుణంగా హత్య చేసాడు. కొద్దికాలంగా సహజీవనం సాగిస్తున్న వీరు తరచు గొడవ పడేవారు. పెళ్లి చేసుకోవాలని శ్రద్ధ ఒత్తిడి చేయడంతోనే ఆమెను హత్య చేసినట్టు చెబుతున్నారు. నేరం బయటకు పొక్కకుండా శ్రద్ధ వాకర్ మృతదేహాన్ని 35 ముక్కలు చేసి, 18 రోజుల పాటు వాటిని ఢిల్లీలోని వేర్వేరు ప్రాంతాల్లో పడేశాడు. శ్రద్ధా తండ్రి వికాస్ వాకర్ వాకబు చేయడంతో అఫ్తాబ్ నేరం బయటపడింది. అఫ్తాబ్‌ను పోలీసు అరెస్టు చేయడంతో ఈ ఘటన సంచలనమైంది. ఇద్దరి మధ్యా గొడవ జరగడంతో తాను శ్రద్ధను హత్య చేసినట్టు పాలిగ్రాఫ్, నార్కో టెస్ట్ పరీక్షలో అఫ్తాబ్ అంగీకరించాడు.

Updated Date - 2023-01-22T16:05:37+05:30 IST