Shraddha Walkar Muder Case: అఫ్తాబ్‌పై చార్జిషీటును విచారణకు స్వీకరించిన కోర్టు

ABN , First Publish Date - 2023-02-07T14:56:33+05:30 IST

దేశవ్యాప్తంగా సంచలం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య కేసులో నిందితుడు అఫ్తాబ్ అమీన్ పూనావాలాపై దాఖలైన..

Shraddha Walkar Muder Case: అఫ్తాబ్‌పై చార్జిషీటును విచారణకు స్వీకరించిన కోర్టు

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య కేసు (Shraddha Walkar Murder Case)లో నిందితుడు అఫ్తాబ్ అమీన్ పూనావాలా (Aaftab Amin Poonawalla)పై దాఖలైన చార్జిషీట్‌ను సాకేత్ కోర్టు మంగళవారంనాడు విచారణకు స్వీకరించింది. ఛార్జిషీటు ప్రతిని నిందితుడికి అందజేశారు. డాక్యుమెంట్ల పరిశీలన కోసం తదుపరి విచారణను ఫిబ్రవరి 21వ తేదీకి మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ అవిరల్ శుక్లా వాయిదా వేశారు. కోర్టు హాలులోకి అఫ్తాబ్‌ను పోలీసులు హాజరుపరచి, రహస్యంగా విచారణ జరిపారు. మీడియాను లోపలకు అనుమతించ లేదు. అఫ్తాబ్‌ను కోర్టు ముందు హాజరుపరచే ముందు కోర్టు ప్రాంతాన్ని డాగ్ స్క్వాడ్‌తో తనిఖీ చేశారు.

అఫ్తాబ్‌పై ఢిల్లీ పోలీసులు 6629 పేజీల ఛార్జిషీటును ఢిల్లీ పోలీసులు జనవరి 24న నమోదు చేశారు. అనంతరం అఫ్తాబ్‌ను జ్యుడిషియల్ కస్టడీ గడువు ముగుస్తుండటంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు హాజరుపరిచారు. దీనికి ముందు, తన లాయర్‌ ఎంఎస్ ఖాన్‌ను మార్చాలని కోర్టును అఫ్తాబ్ కోరాడు.

అఫ్తాబ్‌పై ఐపీసీలోని 302, 201 సెక్షన్ల కింద, ఇతర సెక్షన్ల కింద పోలీసులు ఛార్జిషీటు నమోదు చేశారు. దర్యాప్తు పూర్తయిన 90 రోజుల్లోపే ఛార్జిషీటు నమోదు చేయాల్సి ఉండటంతో కోర్టుకు ఇటీవల చార్జిషీటు సమర్పించారు. అఫ్తాబ్‌పై జరిపిన నార్కో అనలిస్ట్ పరీక్ష, పాలీగ్రామ్ పరీక్ష, డీఎన్ఏ సాక్షాలను కూడా ఛార్జిషీటులో చేర్చింది. పలువురు సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాన్ని, తాము సేకరించిన వీడియో, ఆడియోలను కూడా కోర్టుకు అందించారు. అఫ్తాబ్ తనతో సహజీవనం సాగిస్తున్న శ్రద్ధావాకర్‌ను 2022 మేలో దారుణంగా హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని 35 ముక్కలు చేసి, వాటిని ఎవరూ చూడకుండా ఢిల్లీ శివారు ప్రాంతాల్లో విసిరేశాడు. శ్రద్ధావాకర్ తండ్రి తన కుమార్తె గురించి వాకబు చేయడంతో ఈ హత్య విషయం బయటకు వచ్చింది. హత్యానేరాన్ని అఫ్తాబ్ అంగీకరించినట్టు ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు. ఈ కేసులో బెయిల్ కోసం చేసుకున్న దరఖాస్తును అఫ్తాబ్ వెనక్కి తీసుకోవడంతో అతని బెయిల్ అభ్యర్థనను సాకేత్ కోర్టు గతంలో కొట్టివేసింది.

Updated Date - 2023-02-07T14:56:35+05:30 IST