సభలో సంచలనం!
ABN , Publish Date - Dec 14 , 2023 | 02:40 AM
మోదీ ప్రభుత్వం అట్టహాసంగా నిర్మించిన కొత్త పార్లమెంటు భవనం భద్రతను ప్రశ్నార్థకం చేసే సంచలన ఘటన బుధవారం చోటుచేసుకుంది.
లోక్‌సభలో స్మోక్‌క్యాన్లతో ఆగంతకుల దాడి
2001లో పార్లమెంటుపై దాడి జరిగిన రోజే మళ్లీ ఘటన
సమగ్ర దర్యాప్తు చేయిస్తాం: స్పీకర్
లోక్‌సభలో దుండగులు ఉపయోగించిన స్మోక్‌క్యాన్లతో వ్యాపించిన పొగ
లోక్‌సభలో సభ్యుల బల్లలపైనుంచి
దూకుతూ వెళ్తున్న ఆగంతకుడు (వృత్తంలో)
సందర్శకుల గ్యాలరీ నుంచి సభలోకి దూకిన ఇద్దరు
‘నిరంకుశత్వం నశించాలి’ అంటూ నినాదాలు
స్మోక్‌క్యాన్లను తెరవడంతో పసుపు రంగు పొగ వ్యాప్తి
హఠాత్పరిణామంతో దిగ్ర్భాంతికి గురైన సభ్యులు
దుండగులను పట్టుకొని చితకబాదిన కొందరు
పోలీసులకు అప్పగించిన ఎంపీలు, భద్రతా సిబ్బంది
బయట స్మోక్‌క్యాన్లతో మరో ఇద్దరి ‘నిరసన’
ఇదంతా రికార్డు చేస్తున్న మరో ఇద్దరి అరెస్టు
న్యూఢిల్లీ, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): మోదీ ప్రభుత్వం అట్టహాసంగా నిర్మించిన కొత్త పార్లమెంటు భవనం భద్రతను ప్రశ్నార్థకం చేసే సంచలన ఘటన బుధవారం చోటుచేసుకుంది. లోక్‌సభలో జీరో అవర్ నడుస్తుండగా మధ్యాహ్నం ఒంటి గంటకు ఇద్దరు యువకులు సందర్శకుల గ్యాలరీ నుంచి హఠాత్తుగా సభలోకి దూకారు. నినాదాలిస్తూ.. తమ వెంట తెచ్చుకున్న స్మోక్ క్యాన్లను (పొగను వెలువరించే డబ్బాలు) తెరిచారు. వాటిలోంచి పసుపు పచ్చని పొగ సభ లోపల వ్యాపించింది. హఠాత్తుగా జరిగిన ఈ ఘటనతో ఎంపీలందరూ దిగ్ర్భాంతికి గురయ్యారు. తేరుకున్న కొందరు ఎంపీలు, భద్రతాసిబ్బంది ఆగంతకులను పట్టుకొని చితకబాది పోలీసులకు అప్పగించారు. ఇదే సమయంలో పార్లమెంటు బయట ట్రాన్స్‌పోర్ట్ భవన్ వద్ద మరో ఇద్దరు వ్యక్తులు (వారిలో ఒకరు మహిళ) ఇటువంటి పనికే పాల్పడ్డారు. ‘దేశంలో నిరంకుశత్వం నశించాలి’, ‘జైం భీం.. జై భారత్’, ‘భారత్ మాతా కీ జై’ అని నినాదాలిస్తూ తమ వద్ద ఉన్న క్యాన్‌లను తెరిచి, పసుపు రంగు పొగను విడుదల చేశారు. వారిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. లోక్‌సభలో కలకలం సృష్టించిన ఇద్దరిలో ఒక వ్యక్తి పేరు సాగర్ శర్మ అని, అతడు లక్నోకు చెందినవాడని, మరో వ్యక్తి మనోరంజన్ కర్ణాటకలోని మైసూర్ నుంచి వచ్చాడని తేలింది. ఇక.. పార్లమెంటు ఆవరణలో గందరగోళం సృష్టించిన వారిలో ఒకరిని హర్యానాలోని హిస్సార్‌కు చెందిన 42 ఏళ్ల వయసున్న మహిళ నీలమ్ దేవిగా, మరొకరిని మహారాష్ట్రలోని లాతూర్‌కు చెందిన 25 ఏళ్ల అమోల్ ధన్‌రాజ్ షిండేగా గుర్తించారు. పోలీసులు తీసుకెళ్తున్న సమయంలో నీలమ్ విలేకర్లతో మాట్లాడుతూ, ‘నా పేరు నీలమ్. కేంద్ర ప్రభుత్వం మా మీద తీవ్ర అణచివేతకు పాల్పడుతోంది. మా హక్కుల కోసం గొంతెత్తినప్పు డు మమ్మల్ని కొట్టి జైళ్లలో పడేస్తున్నారు. మాకు ఏ సంస్థతోనూ సంబంధం లేదు. మేం విద్యార్థులం, నిరుద్యోగులం. మా తల్లిదండ్రులు కూలీలు. దేశంలో నిరంకుశత్వం నశించాలి’ అని చెప్పారు. అమోల్ ధన్‌రాజ్ షిండే తల్లిదండ్రులు కూలి పని చేస్తారని, అతడు ఆర్మీ, పోలీసు ఉద్యోగాలకు ప్రయత్నించినట్లు సమాచారం. కాగా, ఈ నలుగురితోపాటు ట్రాన్స్‌పోర్ట్ భవన్ వద్ద నిందితుల చర్యలను రికార్డు చేస్తున్న లలిత్ ఝా అనే అయిదో వ్యక్తిని కూడా పోలీసులు ఆలస్యంగా అరెస్టు చేశారు. మరో వ్యక్తిని కూడా అరెస్టు చేశారని, అతడి పేరు విక్రమ్ అని తెలిసింది. వీరందరినీ భగత్‌సింగ్ ఫ్యాన్ క్లబ్ సభ్యులుగా అధికారులు గుర్తించారు. సోషల్ మీడియా ద్వారా వీరు మిత్రులయ్యారని, గురుగావ్‌లో లలిత్ ఝా నివాసంలో వీరంతా బస చేశారని చెప్పారు.
బాంబులతో వస్తే పరిస్థితి ఏమిటి?
లోక్‌సభలో కలకలం రేపిన ఇద్దరు దుండగులను తాము కదలకుండా పట్టుకున్న సమయంలో వారిలో ఒకడు.. ‘నేను దేశభక్తుడిని. ఇక్కడికి నిరసన తెలపటానికి వచ్చాను. నిరంకుశత్వం నశించాలి’ అన్నాడని కొందరు ఎంపీలు వెల్లడించారు. ఆ దుండగులు స్మోక్ క్యాన్లను బూట్లలో దాచిపెట్టుకొని లోపలికి వచ్చారని జేడీయూ ఎంపీ రామ్‌ప్రీత్ మండల్ తెలిపారు. తృణమూల్ ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ మాట్లాడుతూ, ‘దుండగుడి వద్ద బాంబో, తుపాకో ఉంటో పరిస్థితి ఏమిటి? చాలా తీవ్రమైన భద్రతా వైఫల్యం ఇది’ అని ఆందోళన వ్యక్తం చేశారు. దుండగులు విడుదల చేసిన గ్యాస్.. విషవాయువు అయితే పరిస్థితి ఘోరంగా ఉండేదని, ఇది పూర్తి భద్రతా వైఫల్యమని కాంగ్రెస్ ఎంపీ కార్తి చిదంబరం పేర్కొన్నారు. పార్లమెంటులో భద్రతా వైఫల్యం చోటు చేసుకున్న సమయంలో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా అక్కడ లేరు. రాహుల్ గాంధీ లోక్‌సభలోనే ఉన్నారు.
క్షుణ్ణంగా దర్యాప్తు
లోక్‌సభలో ఘటన నేపథ్యంలో ఢిల్లీ పోలీసు యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్, సీఆర్‌పీఎఫ్ డీజీ, ఫోరెన్సిక్, ఇంటలిజెన్స్ సిబ్బంది పార్లమెంట్‌కు చేరుకున్నారు. జరిగిన ఘటనపై క్షుణ్ణంగా దర్యాప్తు చేయాల్సిందిగా స్పీకర్ కేంద్ర హోంశాఖ కార్యదర్శికి లేఖ రాశారు. ఈ మేరకు సీఆర్‌పీఎఫ్ డైరెక్టర్ జనరల్ అనిశ్ దయాళ్ సింగ్ నేతృత్వంలో దర్యాప్తు సంఘాన్ని నియమిస్తున్నట్లుగా కేంద్ర హోంశాఖ ప్రకటించింది. 2001లో పార్లమెంటుపై లష్కర్ ఏ తోయిబా, జైషే మహమ్మద్ ఉగ్రవాదులు దాడులు జరిపిన22 ఏళ్ల తర్వాత సరిగ్గా అదే రోజు మళ్లీ పార్లమెంటులో కలకలం రేగటంపై అనేక కోణాల్లో చర్చ జరుగుతోంది. కాగా, లోక్‌సభ ఘటనతో కొత్త పార్లమెంటు భద్రతా ఏర్పాట్లలో లోపాలు వెలుగులోకి వస్తున్నాయి. మొత్తం 301 మంది భద్రతా సిబ్బంది ఉండాల్సి ఉండగా..176 మంది మాత్రమే నియమితులయ్యారని, 125 ఖాళీలున్నాయని తెలిసింది. అలాగే, సందర్శకుల గ్యాలరీలోకి అనుమతించిన వ్యక్తులను నిర్ణీత సమయం వరకే అక్కడ ఉండనిస్తారని, ఆ తర్వాత అక్కడి నుంచి పంపించివేస్తారని, కానీ, భద్రతా సిబ్బంది కొరతతో ఇది కూడా సరిగా జరగటం లేదని తెలిసింది.
ఖలిస్థానీ హెచ్చరికతో
సంబంధం లేదు
ఘటన జరిగిన సమయంలో స్పీకర్ చెయిర్‌లో ఉన్న బీజేపీ ఎంపీ రాజేంద్ర అగర్వాల్ సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. సభ ప్రారంభమైన తర్వాత స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ.. ప్రాథమిక సమాచారం ప్రకారం లోక్‌సభలో ఘటనకు, ఖలిస్థానీ తీవ్రవాది పన్నూ హెచ్చరికలకు సంబంధం లేదని తెలుస్తోందన్నారు. నిందితులు ప్రమాదకర వ్యక్తులు కారని తేలిందని చెప్పారు. ఇది ఉగ్ర దాడి కాదని ఎలా అనగలరని, అసలు వారు స్మోక్ క్యాన్లతో పార్లమెంటులోకి ఎలా ప్రవేశించగలిగారని కాంగ్రెస్ లోక్‌సభాపక్ష నేత అధీర్ రంజన్ చౌదురి ప్రశ్నించారు. కాగా, జరిగిన ఘటనపై స్పీకర్ ఓం బిర్లా అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు. పార్లమెంటులో భద్రతా వైఫల్యంపై విపక్ష సభ్యులు తీవ్ర ఆందోళన వెలిబుచ్చారు.