Share News

CM of Rajasthan Bhajan Lal Sharma : తొలిసారి ఎమ్మెల్యేనే.. సీఎం

ABN , First Publish Date - 2023-12-13T06:40:41+05:30 IST

సస్పెన్స్‌ వీడింది.. రాజస్థాన్‌ రాజు ఎవరో తేలింది.. రాణి వసుంధరా రాజేకు చెక్‌ పడింది.. తొలిసారి ఎమ్మెల్యే అయినప్పటికీ భజన్‌లాల్‌శర్మకు ముఖ్యమంత్రి పదవి దక్కింది. ఛత్తీ్‌సగఢ్‌లో ఆదివాసీ నాయకుడు విష్ణుదేవ్‌ సాయ్‌ను, మధ్యప్రదేశ్‌లో

CM of Rajasthan Bhajan Lal Sharma : తొలిసారి ఎమ్మెల్యేనే.. సీఎం

రాజస్థాన్‌ ముఖ్యమంత్రి పీఠంపై భజన్‌లాల్‌ శర్మ..

వసుంధరకు మొండిచేయి.. బీజేపీ హ్యాట్రిక్‌ సర్‌ప్రైజ్‌

సంగనేర్‌ నుంచి భజన్‌లాల్‌ గెలుపు

ఉప ముఖ్యమంత్రులుగా దియాకుమారి, ప్రేమ్‌చంద్‌

జైపూర్‌, న్యూఢిల్లీ, డిసెంబరు 12(ఆంధ్రజ్యోతి): సస్పెన్స్‌ వీడింది.. రాజస్థాన్‌ రాజు ఎవరో తేలింది.. రాణి వసుంధరా రాజేకు చెక్‌ పడింది.. తొలిసారి ఎమ్మెల్యే అయినప్పటికీ భజన్‌లాల్‌శర్మకు ముఖ్యమంత్రి పదవి దక్కింది. ఛత్తీ్‌సగఢ్‌లో ఆదివాసీ నాయకుడు విష్ణుదేవ్‌ సాయ్‌ను, మధ్యప్రదేశ్‌లో ఓబీసీ వర్గానికి చెందిన మోహన్‌యాదవ్‌ను సీఎంలుగా ప్రకటించిన బీజేపీ అధిష్ఠానం.. రాజస్థాన్‌లో బ్రాహ్మణ నేతకు పట్టం కట్టింది. తద్వారా మూడు రాష్ట్రాలకు ముగ్గురు కొత్త సారథులను ఎంపిక చేసినట్లైంది. 56 ఏళ్ల భజన్‌లాల్‌ సంగనేర్‌ నుంచి ఇటీవలి ఎన్నికల్లో 48,081 ఓట్ల ఆధిక్యంతో కాంగ్రెస్‌ అభ్యర్థిపై గెలిచారు. ప్రస్తుతం ఆయన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. కాగా, జైపూర్‌ రాజ కుటుంబానికి చెందిన దియాకుమారి(51), దళితుడైన డాక్టర్‌ ప్రేమ్‌చంద్‌ భైరవ(54)లను ఉప ముఖ్యమంత్రులుగా ప్రకటించారు. సింథీ అయిన వాసుదేవ్‌ దేవ్నానీని స్పీకర్‌ అభ్యర్థిగా ఎంపిక చేశారు. 200 సీట్లున్న రాజస్థాన్‌లో 199 స్థానాలకు ఎన్నికలు జరగ్గా బీజేపీ 115 చోట్ల విజయం సాధించింది. కాంగ్రెస్‌ అభ్యర్థి మృతితో కరణ్‌పూర్‌లో వాయిదా పడిన పోలింగ్‌ జనవరి 5న జరగనుంది. మాజీ సీఎం వసుంధర ఎంతకూ తగ్గకపోవడంతో.. ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు నుంచి రాజస్థాన్‌ సీఎం ఎవరనే ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో మంగళవారం రాజధాని జైపూర్‌లో ఎమ్మెల్యేల సమావేశం నిర్వహించారు. దీనికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ ఆధ్వర్యంలో వినోద్‌ తావ్డే, సరోజ్‌ పాండే పార్టీ పరిశీలకులుగా హాజరయ్యారు. సమావేశం అనంతరం భజన్‌లాల్‌ను శాసనసభా పక్ష నాయకుడిగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు. కాగా, వసుంధర చేతనే భజన్‌లాల్‌ పేరును సీఎంగా ప్రతిపాదించారు. శాసనసభా పక్ష భేటీకి ముందు ఎమ్మెల్యేలంతా రాజ్‌నాథ్‌తో గ్రూప్‌ ఫొటో దిగారు. ఇందులో భజన్‌లాల్‌ మూడో వరుసలో కూర్చున్నారు. సమావేశం పూర్తయ్యేప్పటికి ఆయన్నే సీఎంగా ప్రకటించారు.

ప్రజా రాజకుమారికి డిప్యూటీ

రాజస్థాన్‌ డిప్యూటీ సీఎంగా ఎంపిక చేసిన దియాకుమారి జైపూర్‌ రాజ వంశానికి చెందినవారు. 1971 భారత్‌-పాక్‌ యుద్ధంలో 10వ ప్యారాచూట్‌ రెజిమెంట్‌కు కమాండింగ్‌ అధికారిగా వ్యవహరించిన లెఫ్టినెంట్‌ కల్నల్‌ సవాయ్‌ భవానీసింగ్‌ కుమార్తె. విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపట్టే ఈమెకు ప్రజా రాజకుమారిగా పేరుంది. రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. ప్రస్తుతం రాజ్‌సమంద్‌ ఎంపీగా ఉన్నారు. కాగా, మరో డిప్యూటీ సీఎం డాక్టర్‌ ప్రేమ్‌చంద్‌ భైరవ సామాన్య దళిత కుటుంబంలో పుట్టారు. ఏబీవీపీ నుంచి ఎదిగారు. సంఘ్‌ పరివార్‌లో కొనసాగారు. ఈయన రాజస్థాన్‌ వర్సిటీ నుంచి పీహెచ్‌డీ చేశారు.

గ్రామ సర్పంచ్‌.. రామమందిర ఉద్యమకారుడు

భజన్‌లాల్‌ ఆరెస్సెస్‌ మనిషి. ఏబీవీపీ, బీజేవైఎంలో పనిచేశారు. భరత్‌పూర్‌ జిల్లా అటారీకి చెందిన ఈయన రెండుసార్లు సర్పంచ్‌గా పనిచేశారు. నాలుగుసార్లు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. 1992లో అయోధ్య రామమందిర ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్లారు. కాగా, ఈ ఎన్నికల్లో సొంత ప్రాంతం వదిలి.. దాదాపు 200 కిలోమీటర్ల దూరంలోని సంగనేర్‌ నుంచి పోటీ చేశారు. శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన తర్వాత భజన్‌లాల్‌ రాష్ట్ర గవర్నర్‌ కల్‌రాజ్‌ మిశ్రాను కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు.

Updated Date - 2023-12-13T06:41:39+05:30 IST