Share News

Gahlot-Pilot : కడుపులో కత్తులు..పైకి నవ్వులు!

ABN , First Publish Date - 2023-11-21T04:01:28+05:30 IST

అసెంబ్లీ ఎన్నికల వేళ రాజస్థాన్‌ కాంగ్రెస్‌ కుమ్ములాటలతో సతమతమవుతోంది. సీఎం గహ్లోత్‌, మాజీ ఉపముఖ్యమంత్రి సచిన్‌ పైలట్‌ నడుమ సయోధ్య కుదిర్చేందుకు అధిష్ఠానం చేసిన యత్నాలు ఏ మాత్రం ఫలించలేదు.

Gahlot-Pilot : కడుపులో కత్తులు..పైకి నవ్వులు!

గహ్లోత్‌-పైలట్‌ సయోధ్య వట్టిదే!..

ఉమ్మడి ప్రచారానికి ససేమిరా..

తమ వర్గీయుల ఇలాకాల్లోనే సభలు

సెంబ్లీ ఎన్నికల వేళ రాజస్థాన్‌ కాంగ్రెస్‌ కుమ్ములాటలతో సతమతమవుతోంది. సీఎం గహ్లోత్‌, మాజీ ఉపముఖ్యమంత్రి సచిన్‌ పైలట్‌ నడుమ సయోధ్య కుదిర్చేందుకు అధిష్ఠానం చేసిన యత్నాలు ఏ మాత్రం ఫలించలేదు. గహ్లోత్‌, పైలట్‌ మధ్య విభేదాలు అలాగే ఉన్నాయని కొందరు కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు కూడా అంగీకరిస్తున్నారు. ఇద్దరూ ఐక్యంగా ఉన్నారని చాటేందుకు ఉమ్మడిగా విలేకరుల సమావేశాలు పెట్టించినా అది పైకి మాత్రమేనని.. లోలోన ఒకరి నాశనాన్ని మరొకరు కోరుకుంటున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. ప్రధాని మోదీ కూడా ఎన్నికల ప్రచారంలో ఇవే విమర్శలు చేస్తున్నారు. గత ఎన్నికల్లో కష్టమంతా పైలట్‌ పడితే.. గహ్లోత్‌ వచ్చి సీఎం సీటు తన్నుకుపోయారు. 2014 జనవరి 13న పైలట్‌ పీసీసీ అధ్యక్షుడయ్యారు. వసుంధరరాజే సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వంపై నాలుగేళ్లు పెద్దఎత్తున ఉద్యమించి.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రె్‌సను విజయపథంలో నడిపించారు. అయితే అప్పటి పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తనకు అత్యంత సన్నిహితుడైన గహ్లోత్‌కు కట్టబెట్టారు. పైలట్‌ పాలనానుభవం సంపాదించాక ఆయన్ను సీఎం చేస్తామని హామీ ఇచ్చారు.

మరోవైపు, రాజే హయాంలో జరిగిన అవినీతిపై దర్యాప్తు జరిపిస్తామని ఎన్నికల సమయంలో పైలట్‌ ఇచ్చిన హామీని గహ్లోత్‌ అటకెక్కించారు. రాజేతో సీఎం రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారని పైలట్‌ బహిరంగంగానే వ్యాఖ్యానించడం మొదలుపెట్టారు. ఇదే సమయంలో మధ్యప్రదేశ్‌లో సింధియా తిరుగుబాటుతో కాంగ్రెస్‌ ప్రభుత్వం కుప్పకూలింది. మనం కూడా అదే బాట పడదామని తన వర్గం ఒత్తిడి తెచ్చినా పైలట్‌ సంయమనం పాటించారు. అధిష్ఠానం తన పట్ల సానుకూలంగా లేకపోవడం.. సోనియా కూడా అపాయింట్‌మెంట్‌ ఇవ్వకపోవడంతో చివరకు కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో టచ్‌లోకి వెళ్లారు. గహ్లోత్‌పై తిరుగుబాటు చేశారు. అయితే రాహుల్‌, ప్రియాంక జోక్యం చేసుకుని రాజీచేశారు. గహ్లోత్‌ ఊపిరి పీల్చుకున్నారు. కానీ పైలట్‌ను రెండు పదవుల నుంచి తప్పించారు. ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్‌ గహ్లోత్‌ సారథ్యంలో ఎన్నికలకు వెళ్తోంది. ఇది పైలట్‌కు మనస్తాపం కలిగించింది. సీఎం పదవిపై ఎన్నికల తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఖర్గే, రాహుల్‌ హామీ ఇచ్చినా ఇది జరిగే పనికాదని ఆయనకు కూడా తెలుసు. కర్ణాటకలో డీకే శివకుమార్‌కు ఎదురైన పరిస్థితే తనకూ వస్తుందని అనుమానిస్తున్నారు.

పైలట్‌ ప్రచారానికి డిమాండ్‌

గహ్లోత్‌, పైలట్‌ ఉమ్మడిగా ప్రచారానికి వెళ్లాలని అధిష్ఠానం గత వారం గట్టిగా నొక్కిచెప్పింది. ఇప్పటివరకు అది సాధ్యపడలేదు. ఇంకోవైపు.. గహ్లోత్‌పై బీజేపీ పెద్దఎత్తున దాడి చేస్తోంది. ఆయన అవినీతి స్కాంలపై విస్తృతంగా ప్రచారం చేస్తోంది. ముఖ్యంగా పేపర్‌ లీకేజీ స్కాంలు ఆయన మెడకు చుట్టుకున్నాయి. గత ఏడాది పైలట్‌ స్వయంగా దీనిపై విమర్శలు గుప్పించారు. దీనిని గహ్లోత్‌ తిప్పికొట్టలేకపోతున్నారు. అయితే పైలట్‌ జోలికి బీజేపీ వెళ్లడం లేదు. దీంతో ఆయన్ను రాష్ట్రమంతా ప్రచారానికి ఉపయోగించుకోవాలని, అప్పుడు కమలనాథులు దాడి తగ్గిస్తారని సీఎం వర్గీయులు కూడా అంటున్నారు. కానీ గహ్లోత్‌ ఇందుకు సుముఖంగా లేరు. రేపు ఎన్నికల్లో గెలిచాక ఎక్కువ మంది ఎమ్మెల్యేలు పైలట్‌ను సీఎంగా కోరుకుంటారేమోనన్న భయమే దీనికి కారణం.

- సెంట్రల్‌ డెస్క్‌

Updated Date - 2023-11-21T06:33:11+05:30 IST