Sanjay Kumar Mishra : ఆయన కోసం.. కొత్త కొలువు!
ABN , First Publish Date - 2023-08-30T04:21:20+05:30 IST
‘‘ఆయనొక్కరు లేకుంటే నడవదా?’’ అంటూ సాక్షాత్తు సుప్రీంకోర్టు నుంచి ప్రశ్న లు ఎదుర్కొన్న అధికారి కోసం కేంద్ర ప్రభుత్వం ఏకంగా మరింత ఉన్నత పదవినే సృష్టిస్తోంది. రెండుసార్లు పొడిగింపునిచ్చి సర్వోన్నత న్యాయస్థానంలో విమర్శల పాలైనప్పటికీ
చీఫ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా సంజయ్‌కుమార్ మిశ్రా
ఈడీ చీఫ్ కోసం సీఐవో పోస్టును
సృష్టించనున్న కేంద్ర ప్రభుత్వం
సీబీఐ, ఈడీపై ఇకపై ఆయనదే పర్యవేక్షణ
రెండు సంస్థల మధ్య సమన్వయమే ఉద్దేశం
నేరుగా పీఎం కార్యాలయానికి రిపోర్టు
మిశ్రా పదవీకాలంపై ఇప్పటికే సుప్రీం ప్రశ్నలు
న్యూఢిల్లీ, ఆగస్టు 29: ‘‘ఆయనొక్కరు లేకుంటే నడవదా?’’ అంటూ సాక్షాత్తు సుప్రీంకోర్టు నుంచి ప్రశ్న లు ఎదుర్కొన్న అధికారి కోసం కేంద్ర ప్రభుత్వం ఏకంగా మరింత ఉన్నత పదవినే సృష్టిస్తోంది. రెండుసార్లు పొడిగింపునిచ్చి సర్వోన్నత న్యాయస్థానంలో విమర్శల పాలైనప్పటికీ వెనక్కుతగ్గడం లేదు. కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి హోదాతో.. చీఫ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ (సీఐవో) పోస్టును ఏర్పాటు చేసి.. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చీఫ్‌గా ఉన్న సంజయ్ కుమార్ మిశ్రాను దానికి అధిపతిగా నియమించనుంది. ఈ మేరకు కేంద్రం ప్రయత్నాలు సాగిస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి. వాటి ప్రకారం.. ఈడీతో పాటు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) పనితీరును ఇకపై సీఐవోనే పర్యవేక్షిస్తారు. రెండింటినీ సమన్వయం చేస్తారు. ఈడీ, సీబీఐ అధిపతులు సీఐవోకే రిపోర్టు చేయాల్సి ఉంటుంది. కాగా, ఈడీ చీఫ్‌గా సంజయ్ కుమార్ మిశ్రా పదవీకాలం సెప్టెంబరు 15తో పూర్తికానుంది. ఈయన 1984 బ్యాచ్ ఐఆర్‌ఎస్ అధికారి. ఆదాయ పన్ను అధికారిగా అనేక హై ప్రొఫైల్ కేసులను పర్యవేక్షించారు. 2018 అక్టోబరు నుంచి (మధ్యంతర డైరెక్టర్‌గా నియమితులైన మూడు నెలలు సహా) ఈయనే ఈడీ అధిపతిగా కొనసాగుతున్నారు. సాధారణంగా ఈడీ, సీబీఐ చీఫ్‌ల పదవీ కాలం రెండేళ్లు ఉంటుంది. కానీ, మిశ్రా కు కేంద్రం రెండుసార్లు పొడిగింపునిచ్చింది. దీంతో దాదాపు ఐదేళ్లుగా పదవిలో కొనసాగుతున్నారు.]
ఎన్‌ఎస్‌ఏ, సీడీఎస్ తరహాలో..
కేంద్రంలో మోదీ ప్రభుత్వం వచ్చాక రెండు నిఘా సంస్థలు (ఐబీ, రా) రిపో ర్టు చేసేందుకు జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) పదవి, త్రివిధ దళాల అధిపతులు రిపోర్టు చేసేందుకు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎ్‌స)లను ఏర్పాటు చేసింది. వాటి తరహాలోనే సీఐవోనూ నియమిస్తోంది. కాగా, ఈడీ ఎప్పటిలానే కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ రెవెన్యూ కింద, సీబీఐ.. కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు-పింఛన్ల శాఖ ఆధీనంలోనే పనిచేస్తాయి. అయితే, వీటి కార్యకలాపాల పర్యవేక్షణను మాత్రం సీఐవో చూస్తుంది. సీఐవో.. నేరుగా పీఎంవోకు రిపోర్టు చేస్తుంది.
మళ్లీ పొడిగింపు యత్నం వివాదాస్పదం
వరుస దాడులు, సోదాల నేపథ్యంలో.. దేశంలో నాలుగేళ్లుగా ఈడీ పనితీరు తీవ్ర చర్చనీయాంశమవుతున్న సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా ఈడీని మోదీ ప్రభు త్వం తమను వేఽధించేందుకు రాజకీయ సాధనంగా వాడుకుంటోందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మిశ్రా పనితీరుపై అటు ప్రశంసలు ఇటు ఆరోపణలు వచ్చాయి. కాగా, విరమణ పొందినప్పటికీ.. ఏడాది చొప్పున రెండుసార్లు ఆయన పదవీ కాలాన్ని కేంద్రం పొడిగించింది. మూడోసారీ అందుకు ప్రయత్నించింది. దీనిపై కొందరు సుప్రీం కోర్టుకు వెళ్లారు. ఆ కేసు విచారణ సందర్భంగా.. ఈడీ చీఫ్‌కు మరోసారి పొడిగింపు చట్ట విరుద్ధమంటూ జూలై 11న సుప్రీం అభ్యంతరం వ్యక్తం చేసింది. మిశ్రాను కొనసాగించడం అత్యవసరమంటూ కేంద్రం వాదించడంతో, విస్తృత ప్రజా ప్ర యోజనాల రీత్యా సెప్టెంబరు 15 వరకు పదవిలో ఉండేందుకు అనుమతించింది. ఆ గడువు 17 రోజుల్లో ముగుస్తుందనగా కేంద్రం ఏకంగా ఆయన కోసం సీఐ వో పోస్టును సృష్టించనుంది. ఇప్పటిదాక ఈడీనే సంజయ్ కుమార్ చేతుల్లో ఉండగా, ఇకమీదట సీబీఐ కూడా ఆయన పర్యవేక్షణలోకి రానున్నట్లైంది.