ఉత్తరాది యువకులపై దాడి వదంతులు
ABN , First Publish Date - 2023-03-05T01:05:24+05:30 IST
తమిళనాడులో బిహార్, ఝార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన కూలీలపై దాడులు జరుగుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వెలువడిన వార్తలను సీఎం స్టాలిన్ శనివారం తీవ్రంగా ఖండించారు.
తీవ్రంగా ఖండించిన స్టాలిన్.. బిహార్ సీఎం నితీశ్‌కు ఫోన్
చెన్నై, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): తమిళనాడులో బిహార్, ఝార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన కూలీలపై దాడులు జరుగుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వెలువడిన వార్తలను సీఎం స్టాలిన్ శనివారం తీవ్రంగా ఖండించారు. ఇలాంటి పుకార్లు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వేరే రాష్ట్రాల్లో జరిగిన దాడులను తమిళనాడులో జరిగినట్లుగా పేర్కొంటూ కొన్ని దృశ్యాలను కొంతమంది ఉద్దేశపూర్వకంగా వైరల్ చేశారన్నారు. బిహార్ సీఎం నితీష్ కుమార్‌తో తాను ఫోన్‌లో మాట్లాడానని, జరిగిన వ్యవహారంపై వివరించానని పేర్కొన్నారు. కాగా తప్పుడు పుకార్లు పుట్టించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, కనీసం ఏడేళ్ల జైలు శిక్షణ ఉంటుందని తమిళనాడు డీజీపీ శైలేంద్రబాబు హెచ్చరించారు. మరోవైపు ఈ దాడులపై నిజానిజాలు తెలుసుకునేందుకు బిహార్, ఝార్ఖండ్ రాష్ట్రాల అధికారులు శనివారం చెన్నై వచ్చారు. ఐఏఎస్ అధికారి బాలమురుగన్ సారథ్యంలోని బృందం రాష్ట్ర కార్మిక సంక్షేమ శాఖ కమిషనర్‌తో సమావేశమై దాడులకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. బిహార్, ఝార్ఖండ్ తోపాటు ఇతర ఉత్తరాది రాష్ట్రాల కార్మికులు ప్రశాంతంగా జీవనం సాగిస్తున్నారని అధికారుల బృందానికి కమిషనర్ వివరించారు. దీంతో సంతృప్తి చెందిన అధికారుల బృందం ఉత్తరాది కార్మికులు ఉండే ప్రాంతాల్లో మరింత భద్రతను కల్పించాలని కోరింది. మరోవైపు తమిళనాడులో దాడులు పెరిగాయంటూ వస్తున్న వార్తలతో ఆందోళన చెందిన బిహార్, ఝార్ఖండ్, పశ్చిమబెంగాల్ తదితరప్రాంతాల కూలీలుభారీగా తిరుగుముఖం పడుతుండగా.. పోలీసులు ఆయా వలస కూలీలు అధికంగా ఉండే ప్రాంతాలకు వెళ్లి కౌన్సెలింగ్ ఇస్తున్నారు.