తూత్తుకుడి జిల్లాలో రాకెట్‌ ప్రయోగ కేంద్రం

ABN , First Publish Date - 2023-06-10T04:29:03+05:30 IST

తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా కులశేఖరపట్టినంలో రాకెట్‌ ప్రయోగ కేంద్రం తొలివిడత నిర్మాణ పనులు జూలైలో ప్రారంభం కానున్నాయి.

తూత్తుకుడి జిల్లాలో రాకెట్‌ ప్రయోగ కేంద్రం

జూలైలో తొలి విడత నిర్మాణ పనులు

చెన్నై, జూన్‌ 9(ఆంధ్రజ్యోతి): తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా కులశేఖరపట్టినంలో రాకెట్‌ ప్రయోగ కేంద్రం తొలివిడత నిర్మాణ పనులు జూలైలో ప్రారంభం కానున్నాయి. ఇది ఇస్రో ఆధ్వర్యంలో నిర్మించనున్న రెండో రాకెట్‌ ప్రయోగ కేంద్రం. భూమధ్యరేఖకు అత్యంత చేరువగా ఉన్న ప్రాంతంలో ఈ రాకెట్‌ ప్రయోగ కేంద్రం కోసం తమిళనాడు ప్రభుత్వం 2,376 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. ఈ స్థలం అర్ధచంద్రాకారంలో సముద్రతీరానికి చేరువగా ఉండటంతో రాకెట్‌ ప్రయోగాలు సులువుగా నిర్వహించడానికి వీలుంటుందని అధికారులు చెబుతున్నారు. ఇక్కడి నుంచి 90డిగ్రీల దక్షిణ దిశగా రాకెట్‌లను ప్రయోగించడానికి వీలుపడుతుంది. అదేవిధంగా జీఎ్‌సఎల్‌వీ రాకెట్‌ నుంచి విడివడే మొదటి భాగం బంగాళాఖాతంలోనూ, రెండో విడిభాగం హిందూమహాసముద్రంలోను పడతాయి. ఈ కారణంగా తక్కువ వ్యయంతో రాకెట్లను ప్రయోగించవచ్చని ఇస్రో అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రాకెట్‌ ప్రయోగ కేంద్రం తొలి విడత నిర్మాణ పనులు ప్రారంభించేందుకు టెండర్లను ఆహ్వానించారు. అవి ఖరారైన తర్వాత వచ్చే జూలై మొదటివారం నుంచి పనులు ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు.

Updated Date - 2023-06-10T04:29:03+05:30 IST