opposition Roadmap : విపక్షాల ఐక్యతకు రోడ్‌మ్యాప్‌

ABN , First Publish Date - 2023-05-23T03:14:07+05:30 IST

బిహార్‌ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నీతీశ్‌కుమార్‌ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ అగ్ర నేత రాహుల్‌గాంధీతో సోమవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్షాల ఐక్యతకు సంబంధించిన రోడ్‌మ్యాప్‌పై చర్చలు జరిపారు.

opposition Roadmap : విపక్షాల ఐక్యతకు రోడ్‌మ్యాప్‌

ఖర్గే, రాహుల్‌తో నీతీశ్‌ సమావేశం

పట్నాలో ప్రతిపక్ష నేతల సమావేశంపై చర్చలు

కాంగ్రెస్‌ ఆధ్వర్యంలోనూ మరో భేటీ నేడో రేపో

వేదిక, తేదీపై నిర్ణయం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్‌ వెల్లడి

దేశం ఏకం కాబోతోంది: మల్లికార్జున ఖర్గే

న్యూఢిల్లీ, మే 22 (ఆంధ్రజ్యోతి): బిహార్‌ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నీతీశ్‌కుమార్‌ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ అగ్ర నేత రాహుల్‌గాంధీతో సోమవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్షాల ఐక్యతకు సంబంధించిన రోడ్‌మ్యాప్‌పై చర్చలు జరిపారు. ముఖ్యంగా పట్నాలో విపక్ష నేతల భేటీ ఏర్పాటునూ ప్రస్తావించారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌, జేడీయూ చీఫ్‌ లలన్‌సింగ్‌ కూడా హాజరయ్యారు. బీజేపీని ఎదుర్కొనే వ్యూహంలో భాగంగా నీతీశ్‌ ఆదివారం ఢిల్లీ సీఎం, ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ను కలిసిన సంగతి తెలిసిందే. ఢిల్లీ సివిల్‌ సర్వీసులకు సంబంధించి కేంద్రంతో ఆయన పోరాటానికి మద్దతు ప్రకటించారు. ఐక్యతా యత్నాల్లో భాగంగా గత శనివారం కర్ణాటకలో సీఎం సిద్దరామయ్య ప్రమాణ స్వీకారానికి నీతీశ్‌తోపాటు ఝార్ఖండ్‌, తమిళనాడు సీఎంలు హేమంత్‌ సోరెన్‌, ఎంకే స్టాలిన్‌, ఎన్‌సీపీ, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధినేతలు శరద్‌ పవార్‌, ఫరూక్‌ అబ్దుల్లా, బిహార్‌ ఉపముఖ్యమంత్రి, ఆర్‌జేడీ నేత తేజస్వి యాదవ్‌లను కాంగ్రెస్‌ ఆహ్వానించిన సంగతి తెలిసిందే.

విపక్షాలకు చెందిన జాతీయ, ప్రాంతీయ పార్టీల నేతలను ఏకతాటిపైకి తెచ్చేందుకు నితీశ్‌ రెండు నెలలుగా తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. అవింకా నిర్మాణాత్మక రూపం సంతరించుకోలేదు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల అనంతరం పట్నాలో విపక్షాల నేతల భేటీ జరగొచ్చని నితీశ్‌ గత నెలలోనే సూచనప్రాయంగా తెలియజేశారు. ఇప్పుడు ఆ రాష్ట్రంలో కాంగ్రెస్‌ విజయం దరిమిలా పట్నా భేటీలో విపక్ష కూటమి ఏర్పాటుకు సంబంధించిన అంశాలపై విస్తృతంగా చర్చించే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. కాంగ్రెస్‌తో కలిసి వేదిక పంచుకోవడానికి ఢిల్లీ, తెలంగాణ సీఎంలు కేజ్రీవాల్‌, కేసీఆర్‌ సుముఖంగా లేని విషయం తెలిసిందే. వారిని కూడా ఐక్యతావేదికపైకి తీసుకురావాలని నితీశ్‌ ప్రయత్నిస్తున్నారు. అయితే వారిని కాంగ్రెస్‌ కర్ణాటక సీఎం ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించకపోవడం గమనార్హం. కాంగ్రెస్‌తో చేతులు కలిపేందుకు ఇష్టపడని బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, కేజ్రీవాల్‌, సమాజ్‌వాదీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌లను ఐక్యతకు ఒప్పించడంలో నితీశ్‌ ఒకింత విజయం సాధించారు. గతవారం మమతను నితీశ్‌ కోల్‌కతాలో కలిసినప్పుడు... పట్నాలో సమావేశం ఏర్పాటు చేయాలని ఆమే సూచించడం గమనార్హం. 200 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య ముఖాముఖి పోటీ ఉందని.. అక్కడ మిగతా విపక్షాలు కాంగ్రెస్‌కు మద్దతివ్వాలని ఆమె ప్రతిపాదించారు. బీజేడీ అధినేత, ఒడిసా సీఎం నవీన్‌ పట్నాయక్‌ను నితీశ్‌ కలిసినా లాభం లేకపోయింది.. ప్రతిపక్షాలతో చేతులు కలిపేందుకు ఆయన నిరాకరించారు. సోమవారం నితీశ్‌తో భేటీ తర్వాత ఖర్గే ట్వీట్‌ చేస్తూ.. దేశం ఇప్పుడు ఏకం కాబోతోందని.. ప్రజాస్వామ్య బలోపేతమే తమ సందేశమని పేర్కొన్నారు. నితీశ్‌తో తాను, రాహుల్‌ చర్చలు జరిపామని, దేశానికి కొత్త మార్గనిర్దేశం చేసే ప్రక్రియను ముందుకు తీసుకెళ్లామన్నారు. కాంగ్రెస్‌ కూడా విపక్షాల ఐక్యతకు సమావేశం ఏర్పాటు చేయాలని భావిస్తోంది. మెజారిటీ బీజేపీయేతర పార్టీల భేటీ త్వరలో జరుగుతుందని కేసీ వేణుగోపాల్‌ విలేకరులకు తెలిపారు. దీనికి వేదిక, తేదీని ఒకట్రెండు రోజుల్లో ప్రకటిస్తామన్నారు.

Updated Date - 2023-05-23T03:14:07+05:30 IST