Gaganyaan Mission: ప్రతిష్టాత్మక గగన్‌యాన్ మిషన్‌కి ఇస్రో సిద్ధం.. కీలక సీక్రెట్స్ బయటపెట్టిన ప్రముఖ శాస్త్రవేత్త

ABN , First Publish Date - 2023-10-08T20:29:54+05:30 IST

చంద్రయాన్-3, ఆదిత్య ఎల్1 ప్రాజెక్టులు విజయవంతం అయిన తరుణంలో.. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ చేపట్టేందుకు సిద్ధమవుతోంది. అదే ‘గగన్‌యాన్’ మిషన్...

Gaganyaan Mission: ప్రతిష్టాత్మక గగన్‌యాన్ మిషన్‌కి ఇస్రో సిద్ధం.. కీలక సీక్రెట్స్ బయటపెట్టిన ప్రముఖ శాస్త్రవేత్త

చంద్రయాన్-3, ఆదిత్య ఎల్1 ప్రాజెక్టులు విజయవంతం అయిన తరుణంలో.. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ చేపట్టేందుకు సిద్ధమవుతోంది. అదే ‘గగన్‌యాన్’ మిషన్. అంతరిక్షంలో మానవ అన్వేషణకు గాను ఈ మిషన్ చేపడుతోంది. ఈ ప్రాజెక్ట్ పనులు చకచకా జరుగుతున్న నేపథ్యంలో.. చంద్రయాన్-3 ప్రాజెక్ట్ డైరెక్టర్ వీ వీరముత్తువేల్ కొన్ని కీలక విషయాల్ని పంచుకున్నారు.

ఈ గగన్‌యాన్ ప్రాజెక్ట్‌కి సంబంధించిన రోడ్ మ్యాప్ రెడీ అయ్యిందని, త్వరలోనే దీనిని లాంచ్ చేయబోతున్నామని వీరముత్తువేల్ తెలిపారు. ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘సాఫ్ట్ ల్యాండింగ్ అనేది ఒక టెక్నాలజీ. దీనిని కలిగి ఉన్న నాల్గవ దేశం మన భారత్. ఇందులో మనం ప్రావీణ్యం సంపాదించాం. ఆ తర్వాతే మానవ అన్వేషణ అనేది సాధ్యమవుతుంది. ఇప్పుడు గగన్‌యాన్ ప్రోగ్రామ్ రెడీ అవుతోంది. ఇదొక మానవ అన్వేషణ మిషన్. ఇందుకు సంబంధించిన రోడ్ మ్యాప్ ఇప్పటికే సిద్ధమైంది. త్వరలోనే దీనిని మేము లాంచ్ చేసేందుకు రెడీ అవుతున్నాం’’ అని చెప్పుకొచ్చారు.


ఇదిలావుండగా.. ఈ గగన్‌యాన్ మిషన్‌లో భాగంగా ఇస్రో మానవ రహిత విమాన పరీక్షలకు సన్నాహాలు మొదలుపెట్టింది. ఫ్లైట్ టెస్ట్ వెహికల్ అబార్ట్ మిషన్-1 (టీవీ-డీ1) కోసం కసరత్తులు జరుగుతున్నాయని, ఇది క్రూ ఎస్కేప్ సిస్టమ్ పనితీరుని ప్రదర్శిస్తుందని ఇస్రో పేర్కొంది. ఈ టెస్టులు విజయవంతమైతే.. భారతీయ వ్యోమగాములతో ఇస్రో తొలి గగన్‌యాన్ మిషన్‌ని చేపడుతుంది. రాకెట్‌ను వేరే చోట నిర్మిస్తుండగా, అంతర్గత వ్యవస్థలను అహ్మదాబాద్‌లో అభివృద్ధి చేస్తున్నారు. క్లిష్టమైన వ్యవస్థలైన క్యాబిన్ సిస్టమ్, కమ్యూనికేషన్ సిస్టమ్‌ను అక్కడే నిర్మిస్తున్నారు.

క్యాబిన్‌లో లైటింగ్ సిస్టమ్‌తో పాటు వ్యోమగాముల కోసం మూడు సీట్లు ఉంటాయి. క్యాబిన్ లోపల వివిధ పారామీటర్స్‌ని పర్యవేక్షించేందుకు గాను రెండు డిస్‌ప్లే స్క్రీన్‌లు అమర్చబడతాయి. ఈ గగన్‌యాన్ మిషన్ భారతదేశపు తొలి మానవ సహిత అంతరిక్ష యాత్రకు ప్రాతినిధ్యం వహిస్తుంది. ఇందులో ముగ్గురు వ్యోమగాములను భూమి ఉపరితలం నుండి 400 కిలోమీటర్ల కక్ష్యలోకి పంపాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది.

Updated Date - 2023-10-08T20:29:54+05:30 IST