Women Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లుపై వివాదాస్పద వ్యాఖ్యలు.. లిప్‌స్టిక్, బాబ్-కట్ ఉన్నవారికే అంటూ..
ABN , First Publish Date - 2023-09-30T18:12:54+05:30 IST
అప్పుడప్పుడు కొందరు రాజకీయ నేతలు తమ ప్రత్యర్థులపై మాటల తూటాలు పేల్చే సమయంలో నోరుజారుతుంటారు. ఉత్సాహంలో సంచలన వ్యాఖ్యలు చేసి, కొత్త వివాదానికి తెరలేపుతుంటారు. ఏదో చెప్పబోయి ఇంకేదే చెప్పేసి..
అప్పుడప్పుడు కొందరు రాజకీయ నేతలు తమ ప్రత్యర్థులపై మాటల తూటాలు పేల్చే సమయంలో నోరుజారుతుంటారు. ఉత్సాహంలో సంచలన వ్యాఖ్యలు చేసి, కొత్త వివాదానికి తెరలేపుతుంటారు. ఏదో చెప్పబోయి ఇంకేదే చెప్పేసి.. చిక్కుల్లో పడుతుంటారు. ఇప్పుడు రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) సీనియర్ నేత అబ్దుల్ బారి సిద్ధిఖీ సైతం అలాగే ఇరకాటంలో పడ్డారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి.. తీవ్ర విమర్శలు ఎదుర్కుంటున్నారు. అయితే.. ఆ తర్వాత ఆయన తన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చారు కానీ, ఆలోపు జరగాల్సిన నష్టమైతే జరిగిపోయింది.
అసలేం జరిగిందంటే.. ఈ మహిళా రిజర్వేషన్ చట్టం పేరుతో లిప్‌స్టిక్, బాబ్-కట్ జుట్టుతో ఉన్న మహిళలు ముందుకు వస్తారని అబ్దుల్ బారి పేర్కొన్నారు. వెనుకబడిన, అత్యంత వెనుకబడిన తరగతులకు చెందిన మహిళలకు కూడా కేంద్ర ప్రభుత్వం కోటాను నిర్ణయించాలని డిమాండ్ చేశారు. లేకపోతే.. లిప్‌స్టిక్ వేసుకున్న, బాబ్-కట్ జుట్టుతో ఉన్న వాళ్లు వెనుకబడిన మహిళల హక్కులను కాలరాస్తారని చెప్పారు. బిహార్‌లోని ముజప్ఫనగర్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపాయి. ఆయన వ్యాఖ్యల్లో ఆంతర్యం గురించి పట్టించుకోకుండా.. కేవలం లిప్‌స్టిక్, బాబ్-కట్ పదాల్ని పట్టుకొని బీజేపీ నేతలు విమర్శలు ఎక్కుపెట్టారు.
అబ్దుల్ బారి చేసిన వ్యాఖ్యలను మొత్తం ‘ఇండియా’ కూటమికి ఆపాదిస్తూ.. ఆయన వ్యాఖ్యలు ప్రతిపక్ష పార్టీల ఆలోచనా విధానాన్ని చూపుతోందని దాడికి దిగారు. కాంగ్రెస్ లేదా ఏ ఇతర పార్టీలు ఈ వ్యాఖ్యల్ని ఎందుకు ఖండించడం లేదని, దీన్ని బట్టి చూస్తుంటే మహిళా వ్యతిరేక పార్టీలతో కాంగ్రెస్ చేతులు కలిపిందని అర్థం చేసుకోవచ్చని ఆరోపణలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో ఉన్న మహిళలే సురక్షితంగా లేరని షెహజాద్ పూనావాలా వ్యాఖ్యానించారు. బీజేపీ ఎంపీ సునీతా దుగ్గల్ సైతం మండిపడ్డారు. అబ్దుల్ బారి ‘నారో మైండెడ్’ వ్యక్తి అని, ఈరోజు అన్ని రంగాల్లోనూ మహిళలు తమ ప్రతిభ చాటి, తమదైన ముద్ర వేస్తున్నారని చెప్పుకొచ్చారు.
ఇలా తనపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో.. తన వ్యాఖ్యలకు అబ్దుల్ బారి సిద్దిఖీ వివరణ ఇచ్చారు. తాను ప్రసంగించిన ర్యాలీలో వందలాది మంది గ్రామీణ మహిళలు ఉన్నారని.. వారి భాషలో అర్థమయ్యేలా చెప్పేందుకు తాను ‘లిప్‌స్టిక్, బాబ్-కట్’ వంటి పదాలు వాడానని స్పష్టం చేశారు. అంతే తప్ప ఎవరినీ నొప్పించడం తన ఉద్దేశం కాదన్నారు. తన మాటలు ఎవరికైనా బాధ కలిగించి ఉంటే చింతిస్తున్నానని పేర్కొన్నారు. మొదటి నుంచి ఆర్జేడీ మహిళా రిజర్వేషన్‌కు మద్దతు ఇస్తోందని, తాను కేవలం వెనుకబడిన మహిళలకు అర్థమవ్వాలన్న ఉద్దేశంతోనే అలా మాట్లాడానని మరోసారి క్లారిటీ ఇచ్చారు.