Reservation fight : మణిపూర్‌ మంటల వెనుక.. మీటీ, కుకీ తెగల మధ్య రిజర్వేషన్‌ పోరు

ABN , First Publish Date - 2023-06-16T05:22:49+05:30 IST

దాదాపు నెలన్నర రోజులుగా మణిపూర్‌ రాష్ట్రం ఆరని రావణ కాష్ఠంలా రగులుతోంది. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా పర్యట

Reservation fight : మణిపూర్‌ మంటల వెనుక.. మీటీ, కుకీ తెగల మధ్య రిజర్వేషన్‌ పోరు

  • తమను ఎస్టీల్లో చేర్చాలంటున్న మీటీలు

  • వారికి అనుకూలంగా హైకోర్టు తీర్పు.. కుకీల ఆగ్రహం

  • ట్రైబల్‌ సాలిడారిటీ మార్చ్‌ పేరిట నిరసన

  • నెలన్నరగా ఆరని రావణకాష్ఠంలా రాష్ట్రం

దాదాపు నెలన్నర రోజులుగా మణిపూర్‌ రాష్ట్రం ఆరని రావణ కాష్ఠంలా రగులుతోంది. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా పర్యటన నేపథ్యంలో మధ్యలో కొన్నాళ్లపాటు పరిస్థితి చల్లబడినట్టు కనిపించిందిగానీ.. ఆ ప్రశాంతత నివురు గప్పిన నిప్పు మాత్రమే. ఆ నిప్పు సెగ చల్లారలేదు. లోపల్లోపల రగులుతూనే ఉంది. ఉండుండి ఒక్కసారి భగ్గుమంటోంది. ఈ ఘర్షణల్లో ఎంతోమంది అభంశుభం తెలియని అమాయకులు బలైపోతున్నారు. యువత భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతోంది. అసలింతకీ అక్కడేం జరగుతోంది? ప్రస్తుత దుస్థితికి కారణాలేంటి?

మణిపూర్‌ భూభాగంలో లోయప్రాంతం కేవలం 10 శాతమే. కానీ అత్యధికులు అక్కడే నివసిస్తారు. 90 శాతం భూభాగం అడవులు, కొండలే. ఆ రాష్ట్రంలో.. మీటీ, కుకీ, నాగా అనే మూడు ప్రధాన తెగలున్నాయి. మీటీల్లో ఎక్కువ మంది హిందువులు కాగా.. కొంతమంది ముస్లింలు కూడా ఉన్నారు. ముస్లిం మీటీలను ‘మీటీ పంగల్‌’గా వ్యవహరిస్తారు. హిందూ మీటీలతోపాటు వీరు కూడా తమకు ఎస్టీ హోదా కావాలని 2012 నుంచి డిమాండ్‌ చేస్తున్నారు. రాష్ట్ర జనాభాలో మీటీ తెగదే ఆధిపత్యం. సాక్షాత్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్‌ సింగ్‌ కూడా మీటీయే. మొత్తం జనాభాలో 53ు వారే ఉంటారు. 2000 సంవత్సరాలుగా వారు వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతున్నారు. రాజకీయాల్లో వారిదే ఆధిపత్యం. 60 మంది ఎమ్మెల్యేల్లో 40 మంది వారే. ఇక.. కుకీలు, నాగాల్లో అత్యధికులు క్రైస్తవులు. కుకీల జనాభా 40ు ఉంటుంది. అసెంబ్లీలో కుకీ ఎమ్మెల్యేల సంఖ్య కేవలం 10. నాగాలతోపాటు.. గుర్తింపు పొందిన మరో 32 తెగల ఆదివాసీలు రాష్ట్రంలో 10ు దాకా ఉంటారని అంచనా. వీరంతా పోడు వ్యవసాయం చేసుకుని జీవిస్తుంటారు. కుకీలు, నాగాలు ఎస్టీ జాబితాలో ఉండగా.. మీటీల్లో అత్యధికులు ఓబీసీ జాబితాలో, కొందరు ఎస్సీలుగా ఉన్నారు. మీటీలు ఇంఫాల్‌ లోయప్రాంతంలో.. కుకీలు, నాగాలు కొండప్రాంతాల్లో నివసిస్తుంటారు. రాజకీయాల్లో ఆధిపత్యం మీటీలదే కావడంతో.. ప్రభుత్వాన్ని కుకీలు అనుమానంగా చూస్తుంటారు. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని, చర్యనూ భూతద్దంలో పెట్టి పరిశీలిస్తుంటారు. ఇలా మొదట్నుంచీ ఈ తెగల మధ్య ఉన్న అగాధం.. తమనూ ఎస్టీల జాబితాలో చేర్చాలంటూ మీటీలు 2012 చేస్తున్న ఉద్యమంతో పెరుగుతూ వచ్చింది. వారి డిమాండ్‌పై కేంద్రానికి సిఫారసు చేయాల్సిందిగా మణిపూర్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఆ అగాధం మరింత పెద్దదైంది. హైకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ.. ‘ఆల్‌ ట్రైబల్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ మణిపూర్‌ (ఏటీఎ్‌సయూఎం)’ సంస్థ ‘ట్రైబల్‌ సాలిడారిటీ మార్చ్‌’ పేరుతో మే 3న రాష్ట్రవ్యాప్తంగా ప్రదర్శనలు నిర్వహించింది. ఆ మార్చ్‌ నేపథ్యంలో.. చురాచంద్‌పూర్‌ జిల్లా టోర్బంగ్‌ ప్రాంతం లో ఆయుధాలతో వచ్చిన మూక ఒకటి మీటీ తెగ ప్రజలపై దాడికి పాల్పడింది. దీనికి ప్రతిగా మీటీలు దాడులకు దిగారు. ఇలా చైన్‌ రియాక్షన్‌లా దాడులు, ప్రతిదాడులతో.. అప్పటిదాకా ఉన్న ఒకరకమైన ఒత్తిడి వాతావరణం బద్దలైంది. పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం అదుపు చేయలేకపోవడంతో కేంద్రం మే 4న మణిపూర్‌లో ఆర్టికల్‌ 355 విధించింది. అంతర్గత అశాంతి, బాహ్యదురాక్రమణల నుంచి రాష్ట్రాన్ని రక్షించడానికి అవసరమైన చర్యలను తీసుకునే అధికారాన్ని కేంద్రానికి ఇచ్చే అధికరణం ఇది. ఫలితంగా ఆర్మీ ట్రక్కులు, అసోం రైఫిల్స్‌, ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ దళాలు, స్థానిక పోలీసు సిబ్బంది పదఘట్టనలతో మణిపూర్‌ ప్రతిధ్వనిస్తోంది. ఆందోళనకారుల దుశ్చర్యలతో అట్టుడుకుతోంది. కాగా.. మీటీలకు ఎస్టీ హోదాపై మణిపూర్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం తప్పుబట్టడం గమనార్హం.

లోలోపల సెగ..

మణిపూర్‌ ప్రాంతం భారత యూనియన్‌లో 1949 అక్టోబరులో కలిసింది. అంతకుముందు దాకా మీటీలకు ఎస్టీ హోదా ఉండేది. భారత్‌లో కలవగానే వారు ఆ హోదా కోల్పోయారు. మండల్‌ కమిషన్‌ నివేదిక నేపథ్యంలో వారిని ఓబీసీల్లో చేర్చారు. తమను తిరిగి ఎస్టీలుగా గుర్తించాలంటూ వారు పోరాటం చేయడం.. హైకోర్టు తీర్పు వారికి అనుకూలంగా రావడం.. కుకీలు, నాగాలకు ఆందోళన కలిగించింది. కుకీల ఆగ్రహం వెనుక ఇదొక్కటే కాదు.. మరిన్ని కారణాలున్నాయి. కొండ ప్రాంతాల్లో ఉండే కుకీలు అడవులనే ఆధారంగా చేసుకుని జీవనం సాగిస్తుంటారు. రిజర్వ్‌ ఫారెస్ట్‌ పేరుతో ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం తమ జీవనోపాధికి భంగం కలిగిస్తోందన్న అసహనం.. తమను అణచివేతకు గురిచేస్తోందన్న ఆగ్రహం.. వారిలో బాగా ఉంది. దీనికితోడు.. ఈ కుకీలకు, మయన్మార్‌లో ఉండే చిన్‌ తెగవారికి, బంగ్లాదేశ్‌లో ఉండే కుకీలకు.. మూలాలు ఒక్కటే. ఈ మూడు తెగలవారినీ కలిపి ‘జో ప్రజలు’గా వ్యవహరించడం కద్దు. ఆ రెండు దేశాల నుంచి చాలా మంది చిన్‌, కుకీలు.. మణిపూర్‌లోకి అక్రమంగా ప్రవేశిస్తున్నారు. అంతటితో ఆగక.. వారు మాదకద్రవ్యాల తయారీలో వాడే పాపీ (గసగసాలు) సాగు చేస్తున్నారు. దీన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వం వారి విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరిస్తోంది. అక్రమంగా చొరబడ్డవారిని గుర్తించి, వెంటాడి వారిని దేశం నుంచి వెళ్లగొడుతోంది. ఈ క్రమంలో.. ప్రభుత్వం తమ తెగవారందరినీ మాదకద్రవ్యాలు సాగు చేసే, వాడే ‘డ్రగ్‌ లార్డ్స్‌’గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తోందని.. స్థానికులను సైతం అడవుల నుంచి వెళ్లగొడుతోందని.. వారికి కనీసం పునరావాసం కూడా చూపించట్లేదని కుకీలు మండిపడుతున్నారు.

చాలని భూమి..

మణిపూర్‌లోని పలు గిరిజన గ్రామాల్లో జనసంఖ్య భారీగా పెరుగుతోంది. దీంతో చోటు చాలక వారు సమీపంలో ఉన్న అరణ్య ప్రాంతాలకు విస్తరిస్తున్నారు. అనాది నుంచి ఆదివాసీలుగా ఉన్న తమకు ఆ హక్కు ఉందన్నది వారి వాదన. కానీ, దాన్ని ప్రభుత్వం అడ్డుకుంటోంది. అటవీ ప్రాంతాల్లో గిరిజనులు కట్టుకుంటున్న నివాసాలను కూల్చేస్తోంది. ఆయా గ్రామాలను ఖాళీ చేసే కార్యక్రమం చేపట్టింది. ప్రభుత్వం తమను మాత్రమే లక్ష్యంగా చేసుకుని ఈ దాడులకు పాల్పడుతోందని కుకీలు మార్చిలోనే నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.

కేంద్రం ఎందుకు ఏమీ చేయలేకపోతోంది?

కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రం చేయలేని పనులు రెండున్నాయి. అవేంటంటే.. ఆయా రాష్ట్రాల్లో బలమైన పట్టున్న స్థానిక నాయకులను కాదని ఏ పనీ చేయలేరు. దేశంలోని మిగతా ప్రాంతాల్లో వారు పాటించే ‘విభజించి పాలించు’ సూత్రం అక్కడ పనిచేయదు. ఒకవేళ ప్రభుత్వం అక్కడ చర్చల ద్వారా పరిస్థితిని మెరుగుపరచకుండా బలప్రయోగం చేయాలని భావిస్తే.. ఇతర రాష్ట్రాల్లోని స్థానిక తెగల నాయకులు అప్రమత్తమవుతారు. కేంద్రం తమపైన కూడా బలప్రయోగం చేసే ప్రమాదం ఉందని భావించి ఎదురుతిరిగే ప్రమాదం ఉంది. అందుకే.. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా మణిపూర్‌లో 4 రోజులు మకాం వేసి అక్కడ పరిస్థితులను సంయమనంతో చక్కదిద్దడానికి కృషి చేశారు. ముళ్ల మీద పడ్డ వస్త్రాన్ని తీసినంత జాగ్రత్తగా ఈ సంక్షోభాన్ని సరిదిద్దే ప్రయత్నం చేసినా అల్లర్లు ఆగడంలేదు. కాగా, మణిపూర్‌లో హింస రగులూతేనే ఉంది. ఇంఫాల్‌ వ్యాలీలో గురువారం భద్రత బలగాలపై అల్లర మూకలు దాడి చేశాయి. పలు ఇళ్లను దహనం చేశాయి. శాంతి భద్రతల్లో భాగంగా ఆర్మీ, అస్సాం రైఫిల్స్‌..ఇంఫాల్‌లోని న్యూచెక్‌కాన్‌ ప్రాంతంలో ‘ఏరియా డామినేషన్‌ ఆపరేషన్‌’ చర్యలు చేపడుతుండగా దుండగులు దాడి చేశారు.

ఇదీ కుకీల వాదన

ఇప్పటికే ఓబీసీ హోదాలో 17ు రిజర్వేషన్లు అనుభవిస్తున్న మీటీలకు ఎస్టీ హోదా కల్పిస్తే.. వారు మా ఉద్యోగావకాశాలను కాలదన్నుకుపోతారు. నిజానికి మీటీలు ఇప్పటికే అభివృద్ధి చెందిన తెగ. వారికి రిజర్వేషన్‌ ప్రయోజనాలు అవసరం లేదు. రాష్ట్రంలోని 60 మంది ఎమ్మెల్యేల్లో 40 మంది మీటీలే. మీటీల్లో చాలామంది ధనవంతులున్నారు. రాజకీయ, పాలనా యంత్రాంగాల్లో వారి సంఖ్యే అధికం. రాష్ట్రంలోని ప్రధాన వ్యాపారాలు, వ్యవస్థలను వారే నియంత్రిస్తున్నారు. సామాజికంగా, ఆర్థికంగా, విద్యపరంగా.. ఇలా అన్నిరకాలుగా ట్రైబల్స్‌ కన్నా వారు మంచి స్థాయిలో ఉన్నారు. అలాంటివారికి ఎస్టీ హోదా కల్పిస్తే.. రిజర్వ్‌డ్‌ ఉద్యోగాల్లో ఒక్కటి కూడా మాకు వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి వారికి ఎస్టీ జాబితాలో చోటు కల్పించకూడదు.

ఇదీ మీటీల వాదన

రిజర్వ్‌డ్‌ ఉద్యోగాల కోసమే మేం ఎస్టీ హోదా కోరుతున్నామన్న కుకీల వాదన తప్పు. ఆ హోదా లేకపోతే.. మా సంస్కృతిని, మా భూములను, మా గుర్తింపును కాపాడుకోలేం. మయన్మార్‌ నుంచి రాష్ట్రంలోకి అక్రమంగా చొరబడుతున్న వలసదారుల వల్ల మా సంస్కృతికి, గుర్తింపునకు పెనుప్రమాదం పొంచి ఉంది. చొరబాటుదారులకు స్థానిక కుకీలు సహకరిస్తున్నారు. దీన్ని గుర్తించి ప్రభుత్వం వారిపై ఉక్కుపాదం మోపడమే కుకీల ఆగ్రహానికి కారణం. మాకు ఎస్టీ జాబితాలో చోటు కల్పించడం వల్లనే ఈ హింసాకాండ అనేది వారు పైకి చూపుతున్న కారణం మాత్రమే. వారి అసలు సమస్య.. ప్రభుత్వం అక్రమచొరబాటుదారులను అడ్డుకోవడమే. అలాగే.. హిందూ ధర్మాన్ని అనుసరించినంతమాత్రాన.. మా గిరిజన/ఆదివాసీ స్వభావాన్ని కోల్పోయామన్న వాదన తప్పు. భారతదేశ సగటుతో పోలిస్తే ఆర్థికంగా వెనుకబడి ఉన్నాం.

(సెంట్రల్‌ డెస్క్‌)

Updated Date - 2023-06-16T05:23:02+05:30 IST