Green Card : గ్రీన్‌కార్డు అర్హతల సడలింపు

ABN , First Publish Date - 2023-06-18T00:57:21+05:30 IST

అమెరికాలో గ్రీన్‌కార్డు కోసం ఎదురుచూస్తున్న భారతీయులకు ఊరట. అర్హత నిబంధనలను బైడెన్‌ ప్రభుత్వం సడలించింది. బైడెన్‌ దంపతుల ఆహ్వానం మేరకు భారత ప్రధాని మోదీ ఈనెల 21 నుంచి 24

Green Card : గ్రీన్‌కార్డు అర్హతల సడలింపు

మోదీ పర్యటన నేపథ్యంలో అమెరికా చర్య..

వేలాదిమంది భారతీయ నిపుణులకు ఊరట

వాషింగ్టన్‌, జూన్‌ 17: అమెరికాలో గ్రీన్‌కార్డు కోసం ఎదురుచూస్తున్న భారతీయులకు ఊరట. అర్హత నిబంధనలను బైడెన్‌ ప్రభుత్వం సడలించింది. బైడెన్‌ దంపతుల ఆహ్వానం మేరకు భారత ప్రధాని మోదీ ఈనెల 21 నుంచి 24 వరకు అమెరికాలో పర్యటించనున్న నేపథ్యంలో గ్రీన్‌కార్డు అర్హత నిబంధనలను అమెరికా సడలించడం గమనార్హం. గ్రీన్‌కార్డు కోసం దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న వేలాదిమంది భారతీయ టెక్‌ నిపుణులకు అమెరికా సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌(యూఎస్‌సీఐఎస్‌) తాజా నిబంధనలు మేలు చేయనున్నట్టు భావిస్తున్నారు. తొలిసారి ఈఏడీ(ఎంప్లాయిమెంట్‌ ఆథరైజేషన్‌ డాక్యుమెంట్‌) కోసం, ఈఏడీ రెన్యువల్‌ కోసం దరఖాస్తు చేసేందుకు అర్హత నిబంధనలను యూఎస్‌సీఐఎస్‌ సడలించింది. గ్రీన్‌కార్డు ద్వారా వలసదారులకు అమెరికాలో శాశ్వత నివాసానికి అనుమతి లభిస్తుంది. వలసల చట్టం ప్రకారం ఏటా సుమారు 1.4 లక్షల గ్రీన్‌కార్డులను అమెరికా జారీ చేస్తోంది. ఏదైనా ఒక దేశానికి చెందిన వ్యక్తులకు వాటిలో 7 శాతం మాత్రమే లభిస్తున్నాయి. అమెరికాలో చట్టపరంగా నివాసం ఉంటూ పనిచేయాలనుకొనే వ్యక్తులకు తాజా చర్యలు మేలు చేకూర్చనున్నట్టు వలసదారుల హక్కుల ఉద్యమకారుడు అజయ్‌ భుటోరియా పేర్కొన్నారు. తీవ్ర అనారోగ్యం, వైకల్యం, యజమానితో విభేదాలు, ప్రతీకారం, తీవ్రమైన హాని, ఉపాధి అవాంతరాలు తదితర సవాళ్లు ఎదుర్కొంటున్న వ్యక్తులకు ఇది ఊరట చేకూర్చనున్నట్టు తెలిపారు. ఓవర్‌ సబ్‌స్క్రైబ్‌ కేటరిగీ, చార్జ్‌ ఎబిలిటీ సందర్భాలలో వ్యక్తులు విద్యాభ్యాసం, తనఖా, దీర్ఘకాలిక లీజు రికార్డులు తదితర ఆధారాలు సమర్పించేందుకు అవకాశం కలుగుతుందని చెప్పారు. గ్రీన్‌కార్డు అర్హత నిబంధనల సడలింపుపై ‘ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా అండ్‌ ఇండియన్‌ డయాస్పోరా స్టడీస్‌’ హర్షం వ్యక్తం చేసింది.

Updated Date - 2023-06-18T00:57:21+05:30 IST