Share News

Live-In Relationship: ‘సహజీవనం’పై హైకోర్టు సంచలన తీర్పు.. అది వ్యభిచార జీవితమే అవుతుంది

ABN , First Publish Date - 2023-11-14T23:07:15+05:30 IST

ఈరోజుల్లో సంబంధాలు ఎంత పెడదారి పడుతున్నాయో అందరూ చూస్తూనే ఉన్నారు. పెళ్లయి, పిల్లలు ఉన్నప్పటికీ.. వేరొకరితో సంబంధాలు పెట్టుకుంటున్నారు. కట్టుకున్న వారిని వదులుకోవడానికి కూడా సిద్ధపడుతున్నారు. ఇలాంటి వారికి హైకోర్టు గుణపాఠం చెప్పింది.

Live-In Relationship: ‘సహజీవనం’పై హైకోర్టు సంచలన తీర్పు.. అది వ్యభిచార జీవితమే అవుతుంది

Punjab Hariyana High Court: ఈరోజుల్లో సంబంధాలు ఎంత పెడదారి పడుతున్నాయో అందరూ చూస్తూనే ఉన్నారు. పెళ్లయి, పిల్లలు ఉన్నప్పటికీ.. వేరొకరితో సంబంధాలు పెట్టుకుంటున్నారు. కట్టుకున్న వారిని వదులుకోవడానికి కూడా సిద్ధపడుతున్నారు. ఇలాంటి వారికి హైకోర్టు గుణపాఠం చెప్పింది. విడాకులు తీసుకోకుండా పరాయి వ్యక్తులతో సంబంధం పెట్టుకుంటే.. అది సహజీవనం కిందకు రాదని, వ్యభిచార జీవితం గుడుపుతున్నట్టే అవుతుందంటూ కుండబద్దలు కొట్టింది. ఇది నేరం కూడా అవుతుందంటూ బాంబ్ పేల్చింది. పంజాబ్-హరియాణా హైకోర్టు ఈ సంచలన తీర్పునిచ్చింది.


అసలు విషయం ఏమిటంటే.. పంజాబ్‌కు చెందిన ఒక జంట కొంతకాలం నుంచి సహజీవనం చేసింది. యువతి అవివాహితురాలైతే.. పురుషుడికి మాత్రం పెళ్లయి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రియురాలి విషయంలో భార్యతో విభేదాలు తలెత్తడంతో, ఆమెను వదిలేసి ప్రియురాలితోనే ఉంటున్నాడు. అయితే.. అమ్మాయి (ప్రియురాలి) కుటుంబ సభ్యులు మాత్రం వీరి బంధాన్ని అంగీకరించలేదు. పెళ్లైన వ్యక్తితో సహజీవనం ఏంటని వాళ్లు నిలదీయడమే కాదు, తిరిగి ఇంటికి రమ్మని ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు. దీంతో.. ఆ జంట ఇటీవల హైకోర్టుని ఆశ్రయించింది. తామిద్దరం సహజీవనం చేస్తున్నామని, కానీ అమ్మాయి కుటుంబం తరఫు నుంచి ప్రాణహాని ఉందని తమ పిటిషన్‌లో పేర్కొన్నారు. తమకు రక్షణతో పాటు స్వేచ్ఛ కల్పించాలని వాళ్లిద్దరు కోరారు.

ఈ పిటిషన్‌ను జస్టిస్ కుల్దీప్ తివారితో కూడిన ఏకసభ్య ధర్మాసనం విచారించింది. విచారణలో భాగంగా.. పురుషుడికి ఆల్రెడీ పెళ్లై పిల్లలున్నారని, అయితే విడాకులు తీసుకోలేదని తేలింది. దీంతో వీరి బంధాన్ని సహజీవనంగా పరిగణించలేమంటూ ధర్మాసనం తేల్చి చెప్పింది. పురుషుడు విడాకులు తీసుకోకుండా అమ్మాయితో కామంతో కూడిన వ్యభిచార జీవితాన్ని గడుపుతున్నాడని పేర్కొంది. ఐసీసీ సెక్షన్ 494/495 ప్రకారం.. ఇది శిక్షార్హమైన నేరమే అవుతుందని స్పష్టం చేసింది. వ్యభిచారం కేసులో విచారణను తప్పించుకోవడం కోసమే ఈ పిటిషన్ వేసినట్లు కనిపిస్తోందని, వారికి ఉపశమనం కల్పించేందుకు నిర్దిష్ట కారణాలు కనిపించడం లేదని పేర్కొంటూ.. జస్టిస్ కుల్దీప్ తివారీ ధర్మాసనం వారి పిటిషన్‌ని కొట్టివేసింది.

Updated Date - 2023-11-14T23:07:16+05:30 IST