Priyanka Gandhi : అతిరథులకు అగ్నిపరీక్ష

ABN , First Publish Date - 2023-05-05T02:01:30+05:30 IST

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పది స్థానాలపై సర్వత్రా ఆసక్తి నెలకింది. అతిరథ మహారథులు బరిలో ఉన్న ఈ సీట్లలో హోరాహోరీ పోరు నడుస్తోంది. వరుణ, కనకపుర, చెన్నపట్న, షిగ్గావ్‌, శికారీపుర, రామనగర,

Priyanka Gandhi : అతిరథులకు అగ్నిపరీక్ష
ఎన్నికల ప్రచారంలో ప్రియాంక గాంధీ

  • కర్ణాటకలో ఆ పది సీట్లే కీలకం.. బరిలో సిద్దూ, డీకే, బొమ్మై, రవి, విజయేంద్ర

  • కుమారస్వామి, నిఖిల్‌ కూడా..

  • బీజేపీ, కాంగ్రెస్‌, జేడీఎస్‌ హోరాహోరీ

బెంగళూరు, మే 4: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పది స్థానాలపై సర్వత్రా ఆసక్తి నెలకింది. అతిరథ మహారథులు బరిలో ఉన్న ఈ సీట్లలో హోరాహోరీ పోరు నడుస్తోంది. వరుణ, కనకపుర, చెన్నపట్న, షిగ్గావ్‌, శికారీపుర, రామనగర, చిత్తాపూర్‌, చిక్‌బళ్లాపుర తదితర స్థానాలు వీటిలో ఉన్నాయి. వీరంతా గట్టి పోటీ ఎదుర్కోవడం ఈ సారి విశేషం.

వరుణ: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ సీఎం సిద్దరామయ్యపై బీజేపీ నేత, రాష్ట్ర మంత్రి వి.సోమన్నను పోటీకి దించడంతో ఇక్కడ పోరు రసవత్తరంగా మారింది. సంప్రదాయంగా ఇది సిద్దూ సీటే. గత ఎన్నికల్లో కుమారుడు యతీంద్ర కోసం త్యాగం చేశారు. ఈ దఫా కొడుకు తండ్రి కోసం త్యాగం చేశారు. సోమన్న సీనియర్‌ లింగాయత్‌ నేత. వొక్కళిగల్లోనూ ఆయనకు గట్టి పట్టుంది. సిద్దూ విజయం ఖాయమే అయినా.. కష్టపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని కాంగ్రెస్‌ వర్గాలు అంటున్నాయి.

కనకపుర: పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ 1989 నుంచి ఏడు దఫాలుగా ఇక్కడ వరుసగా గెలుస్తూ వస్తున్నారు. సిద్దరామయ్యతో పాటు సీఎం పదవికి పోటీదారుల్లో ఈయనా ఉన్నారు. డీకే వొక్కళిగ నేత. ఆ సామాజిక వర్గం ఓటర్లు ఇక్కడ పెద్దసంఖ్యలో ఉన్నారు. ఆయనపై మరో వొక్కళిగ నేత, మంత్రి ఆర్‌.అశోకను బీజేపీ బరిలోకి దించింది.

చెన్నపట్న: మాజీ సీఎం, జేడీఎస్‌ నేత హెచ్‌డీ కుమారస్వామికి ఇది పెట్టని కోట. 2004 నుంచీ ఇక్కడ ఆయన పరాజయం ఎరుగరు. వొక్కళిగ నేత అయిన కుమారస్వామి ఈ సారి అదే వర్గానికి చెందిన బీజేపీ నేత, మంత్రి సీపీ యోగేశ్వర నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్‌ నుంచి ఎస్‌.గంగాధర్‌ ఇక్కడ పోటీచేస్తున్నారు.

షిగ్గావ్‌: బీజేపీకి, సీఎం బసవరాజ్‌ బొమ్మైకి కంచుకోట. ఇక్కడ లింగాయత్‌ ఓటర్లు ఎక్కువ. బొమ్మై ముఖ్యమంత్రి అయ్యాక ఆయనకున్న క్లీన్‌ ఇమేజ్‌ దెబ్బతింది. గత రెండేళ్లలో పలు అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఇక్కడ ముస్లిం ఓటర్లు కూడా చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉండడంతో కాంగ్రెస్‌ యాసిర్‌ అహ్మద్‌ ఖాన్‌ పఠాన్‌ను బరిలోకి దించింది.

శికారీపుర: మాజీ సీఎం, లింగాయత్‌ల అగ్ర నేత యడియూరప్ప సీటిది. ఎన్నికల రాజకీయాలకు గుడ్‌బై చెప్పిన ఆయన.. ఇక్కడ తన కుమారుడు బీవై విజయేంద్ర ను రంగంలోకి దింపా రు. గత ఎన్నికల్లో యడ్డీపై పోటీచేసి ఓడిన గోనీ మాలతేశ్‌ ను కాంగ్రెస్‌ మళ్లీ అ భ్యర్థిగా నిలిపింది. కాంగ్రెస్‌ తిరుగుబాటు అభ్యర్థి ఎస్పీ నగరాజ గౌడ స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్నారు.

చిక్‌మగుళూర్‌: ఇది సంప్రదాయంగా బీజేపీ స్థానంగా ఉంటోంది. ఇక్కడ గౌడ ఓటర్లు అత్యధికంగా ఉన్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఫైర్‌బ్రాండ్‌ నేత సీటీ రవి ఇక్కడ బరిలో ఉన్నారు. నాలుగు దఫాలుగా ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచారు. రవికి ఒకప్పటి అనుచరుడైన హెచ్‌డీ తిమ్మయ్య ఇక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో ఉన్నారు.

రామనగర: సిల్క్‌ సిటీగా పేరుగాంచిన ఈ స్థానం జేడీఎస్‌కు కంచుకోట. 70% మంది వొక్కళిగ ఓటర్లే. ఈ స్థానం ఇద్దరు సీఎంలను.. కుమారస్వామి, దేవెగౌడలను అందించింది. ఈ సారి నటుడు–రాజకీ య నేత, కుమారస్వామి కొడుకు నిఖిల్‌కుమారస్వామి బరిలో ఉన్నారు. ఇక్బాల్‌ హుస్సేన్‌ (కాంగ్రెస్‌), గౌతమ్‌ గౌడ (బీజేపీ) పోటీలో ఉన్నారు.

శివమొగ్గ: ఇది కూడా లింగాయత్‌లకు, బీజేపీకి గట్టి పట్టున్న స్థానం. మాజీ ఉపముఖ్యమంత్రి కేఎస్‌ ఈశ్వరప్ప ఎన్నికల రాజకీయాల నుంచి విరమించుకోవడంతో ఈ స్థానంలో ఈ సారి చెన్నబసప్పను బీజేపీ బరిలోకి దించింది. కాంగ్రెస్‌ హెచ్‌సీ యోగేశ్‌ను బరిలోకి దించింది. బీజేపీ ఎమ్మెల్సీగా రాజీనామా చేసి వచ్చిన ఆయనూర్‌ మంజునాథ్‌ జేడీఎస్‌ అభ్యర్థిగా పోటీచేస్తున్నారు.

హసన్‌: 2018 వరకు ఇది జేడీఎస్‌కు కంచుకోట. గత ఎన్నికల్లో తొలిసారి బీజేపీ అభ్యర్థి పీత్రమ్‌ గౌడ దానిని బద్దలు కొట్టారు. జేడీఎస్‌ అభ్యర్థి హెచ్‌ఎస్‌ ప్రకాశ్‌ను ఓడించారు. ఈసారి కూడా హెచ్‌ఎస్‌ ప్రకాశ్‌నే బరిలోకి దించారు. కాంగ్రెస్‌ అభ్యర్థిగా బనవాసి రంగస్వామి పోటీచేస్తున్నారు.

చిత్తాపూర్‌: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రాతినిధ్యం వహించిన ఈ స్థానంలో ఆయన కుమారుడు ప్రియాంక్‌ ఖర్గే పదేళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్నారు. మళ్లీ పోటీచేస్తున్నారు. ఇక్కడ బీజేపీ తరఫున మణికంఠ రాథోడ్‌ (29) బరిలో నిలిచారు.

బళ్లారి: ఇది కాంగ్రెస్‌కు కంచుకోట. మైనింగ్‌ బూమ్‌ కారణంగా ఇక్కడి రాజకీయ పరిస్థితులు మారాయి. మైనింగ్‌ బ్యారన్‌, మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డి 2004 నుంచి ఇక్కడ గట్టి నాయకుడిగా ఉన్నారు. ఈ స్థానంలో గెలుపోటములను ఆయన, ఆయన ఒకప్పటి సన్నిహితుడు బి.శ్రీరాములు ప్రభావితం చేస్తుంటారు. కల్యాణ రాజ్య ప్రగతి పక్ష (కేఆర్‌పీపీ) తరఫున జనార్దన్‌రెడ్డి భార్య అరుణాలక్ష్మి ఇక్కడ పోటీచేస్తున్నారు. జేఏపీ తరఫున ఆయన సోదరుడు గాలి సోమశేఖరరెడ్డి బరిలోకి దిగారు. కాంగ్రెస్‌ అభ్యర్థిగా నా.రా.భరత్‌రెడ్డి పోటీచేస్తున్నారు. బీజేపీ ఓటుబ్యాంకు గాలి సోదరుల మధ్య చీలిపోయి కాంగ్రెస్‌కు లాభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అబ్బాయిలూ.. ఓటెయ్యండి పెళ్లిళ్లు చేస్తాం!

  • ఇద్దరు ఇండిపెండెంట్ల వినూత్న హామీ

‘యువతులు దొరకక పెళ్లిళ్లు కావడం లేదని బాధపడకండి. మమ్మల్ని గెలిపిస్తే రెండు నియోజకవర్గాల పరిధిలోని పెళ్లికాని యువకులందరికీ వివాహాలు జరిపించే పూచీ మాది’ – ఇదీ కర్ణాటకలో ఇద్దరు ఇండిపెండెంట్‌ అభ్యర్థుల ఎన్నికల హామీ. బెళగావి జిల్లా అరబావి స్వతంత్ర అభ్యర్థి గురుపుత్ర కెంపణ్ణ కుళ్లూర, గోకాక్‌ స్వతంత్ర అభ్యర్థి పుండలీక కుళ్లూర అన్నదమ్ములు. వీరు 100% యువకులకు పెళ్లిళ్లు చేయిస్తామని హామీ ఇచ్చి, ఎన్నికల కరపత్రాల్లోనూ ముద్రించి పంచుతున్నారు. ఇవి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

– బెంగళూరు, ఆంధ్రజ్యోతి

Updated Date - 2023-05-05T02:01:40+05:30 IST