Share News

Priyanka Chaturvedi: ధీరజ్ సాహు బీజేపీలో చేరితో క్లీన్ చిట్ ఇవ్వొద్దు.. ప్రియాంక చతుర్వేది సెటైర్లు

ABN , First Publish Date - 2023-12-10T23:33:35+05:30 IST

అవినీతి కేసులు ఎదుర్కునే రాజకీయ నేతలకు బీజేపీలోకి చేరిన తర్వాత క్లీన్ చిట్ ఇవ్వడం జరుగుతుందని రాజకీయ వర్గాల్లో ఒక బలమైన వాదన ఉంది. అందుకే.. ప్రతిపక్షాలు ఎప్పుడూ బీజేపీని టార్గెట్ చేసుకొని విమర్శలు గుప్పిస్తుంటాయి.

Priyanka Chaturvedi: ధీరజ్ సాహు బీజేపీలో చేరితో క్లీన్ చిట్ ఇవ్వొద్దు.. ప్రియాంక చతుర్వేది సెటైర్లు

Priyanka Chaturvedi On BJP: అవినీతి కేసులు ఎదుర్కునే రాజకీయ నేతలకు బీజేపీలోకి చేరిన తర్వాత క్లీన్ చిట్ ఇవ్వడం జరుగుతుందని రాజకీయ వర్గాల్లో ఒక బలమైన వాదన ఉంది. అందుకే.. ప్రతిపక్షాలు ఎప్పుడూ బీజేపీని టార్గెట్ చేసుకొని విమర్శలు గుప్పిస్తుంటాయి. ఇప్పుడు శివసేన (యూబీటీ) ఎంపీ ప్రియాంక చతుర్వేది కూడా తనదైన శైలిలో సెటైర్లు వేశారు. కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు భవిష్యత్తులో కాషాయ పార్టీలో చేరితే.. ఆయనకు క్లీన్ చిట్ ఇవ్వవద్దని బీజేపీని కోరారు. దీనిపై దేశానికి ఆ పార్టీ భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు.

మహారాష్ట్రలో రూ. 70,000 కోట్ల నీటిపారుదల కుంభకోణంలో అజిత్ పవార్‌తో సహా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) నాయకులపై వచ్చిన ఆరోపణలను చతుర్వేది ప్రస్తావిస్తూ.. అజిత్ పవార్ ఎన్‌సీపీ నుంచి విడిపోయి బిజెపిలోకి చేరారని, దీంతో ఆయనపై ఈడీ & ఐటీ చర్యలు ముగిశాయని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ని అవినీతి పార్టీగా ప్రకటించే ముందు.. ఆ పార్టీకి చెందిన అవినీతిపరులు భవిష్యత్తులో బీజేపీలోకి చేరితే, వారి పాపాలు విముక్తి పొందవని కాషాయ పార్టీ భారతదేశానికి హామీ ఇవ్వాలని ఆమె పేర్కొన్నారు. మరి.. ఇందుకు బీజేపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో? వేచి చూడాలి.


కాగా.. ఒడిశా, జార్ఖండ్‌లలో కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహుతో ముడిపడి ఉన్న డిస్టిలరీ కంపెనీపై ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహించి, ఇప్పటివరకు రూ.300 కోట్లకు పైగా నగదును స్వాధీనం చేసుకుంది. ఇంకా ఈ సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ధీరజ్ సాహు పేరు రావడంతో.. బీజేపీ నేతలు కాంగ్రెస్‌ని టార్గెట్ చేసుకొని విమర్శలు ఎక్కుపెట్టారు. దీనిపై రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది కొత్త భారతదేశమని, అవినీతికి పాల్పడిన వారిని చట్టం ఏమాత్రం వదిలిపెట్టదని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

అటు.. లోక్ జనశక్తి పార్టీ ఎంపీ చిరాగ్ పాశ్వాన్ కూడా ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని కోరారు. ఇది ప్రతిపక్ష నాయకుల పాత సంప్రదాయమని.. అవినీతికి పాల్పడిన తర్వాత పట్టుబడినప్పుడు, దాన్ని పక్కదారి పట్టించేందుకు ప్రయత్నాలు చేస్తారని ఆరోపించారు. ఇందులో ఎవరు ప్రమేయం ఉందో లేదో సరైన విచారణ జరపాలని.. దోషులుగా తేలిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Updated Date - 2023-12-10T23:33:37+05:30 IST