Prime Minister: ఫిబ్రవరి 6న మళ్లీ రాష్ట్రానికి ప్రధాని

ABN , First Publish Date - 2023-01-22T10:53:36+05:30 IST

ప్రధాని నరేంద్రమోదీ(Narendra Modi) ఫిబ్రవరి 6న మరోసారి రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు.

Prime Minister: ఫిబ్రవరి 6న మళ్లీ రాష్ట్రానికి ప్రధాని

- పలు అభివృద్ధి పనులు ప్రారంభం

- బీజేపీ సభల్లోనూ ప్రసంగాలు

- పదేపదే మోదీ రాకతో వేడెక్కిన రాజకీయం

బెంగళూరు, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): ప్రధాని నరేంద్రమోదీ(Narendra Modi) ఫిబ్రవరి 6న మరోసారి రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై(Chief Minister Basavaraj Bommai) ఇందుకు సంబంధించిన సమాచారాన్ని శనివారం మీడియాకు తెలిపారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా మోదీ ధార్వాడలో ఐఐటీ కేంద్రాన్ని, తుమకూరు జిల్లాలో హెచ్‌ఏఎల్‌ విభాగాన్ని ప్రారంభిస్తారు. ఎన్డీయే ప్రభుత్వం 2014-15 బడ్జెట్‌లో ధార్వాడకు ఐఐటీ కేంద్రాన్ని ప్రకటించింది. ఇన్నాళ్టికి ఐఐటీ కేంద్రానికి మోక్షం లభించింది. చిక్కమాళిగవాడ గ్రామంలోని 500 ఎకరాల్లో ఐఐటీ నూతన క్యాంపస్‌ సన్నద్ధమైంది. అలాగే కేంద్ర ప్రభుత్వ రక్షణా రంగ సంస్థ హిందూస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌) తుమకూరు జిల్లా గుబ్బి తాలూకా నిట్టూరు శివారులోని బిదరెహళ్లి కావల్‌లో హెలీకాప్టర్‌ తయారీ విభాగాన్ని ఏర్పాటు చేసింది. 2016లో నరేంద్రమోదీ చేతులమీదుగానే ఈ విభాగానికి శంకుస్థాపన జరగడం తిరిగి ఆయనే దీన్ని ప్రారంభించబోతుండడం విశేషం. ఈ కేంద్రం ఏర్పాటు వల్ల ఏటా రూ. 2వేల కోట్ల టర్నోవర్‌తోపాటు ఉపాధి అవకాశాలు కల్పించాలని హెచ్‌ఏఎల్‌ తలపెట్టింది. 610 ఎకరాల్లో ఈ విభాగాన్ని రూ.4వేలకోట్ల పెట్టుబడితో నిర్మించారు. 300 కిలోల బరువు కల్గిన లైట్‌ యుటిలిటీ హెలీకాప్టర్లను ఈ కేంద్రంలో తయారు చేయనున్నారు. ఈ హెలీకాప్టర్లలో ఐదారుగురు ప్రయాణించే అవకాశం ఉంది. ల్యాండ్‌ ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్‌ల డిమాండ్ల మేరకే ఈ హెలీకాప్టర్ల తయారీకి హెచ్‌ఏఎల్‌ శ్రీకారం చుట్టింది. ప్రధాని తన పర్యటనలో భాగంగా బీజేపీ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. బీజేపీ అగ్రనేతలు నడ్డాతోపాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా పదేపదే రాకతో రాష్ట్ర రాజకీయం వేడెక్కింది. ఇదే అంశంపై ప్రతిపక్షనేత సిద్దరామయ్య మైసూరులో ఘాటుగానే స్పందించారు. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షా, నడ్డా ఇలా ఎంతమంది నేతలు ఎన్నిసార్లు పర్యటించినా రాష్ట్ర బీజేపీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను చెరిపివేయలేరన్నారు. కాంగ్రె్‌సకు అనుకూలంగా రాష్ట్రవ్యాప్తంగా గాలులు వీస్తున్నాయన్నారు.

Updated Date - 2023-01-22T10:53:38+05:30 IST