Parliament Politics : రాజదండం చుట్టూరాజకీయం!
ABN , First Publish Date - 2023-05-27T03:01:04+05:30 IST
పార్లమెంట్ కొత్త భవనం ప్రారంభోత్సవం వేళ ‘రాజదండం’ చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి.

అధికార మార్పిడి చిహ్నం అంటున్న బీజేపీ
అంతా కట్టుకథేనని కొట్టిపారేస్తున్న కాంగ్రెస్
ఇరు పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం
ఆధారాలు లేవంటున్న జైరాం రమేశ్
మండిపడ్డ కేంద్ర హోంమంత్రి అమిత్‌షా
భారతీయ సంస్కృతిపై విద్వేషం ఎందుకని ప్రశ్న
నెహ్రూకు ‘సెంగొల్’ ఇచ్చినట్లుగా
1947లోనే ‘టైమ్స్’ మ్యాగజీన్ కథనం!
అన్ని ఆధారాలున్నాయంటున్న తిరువావదుతురై
న్యూఢిల్లీ, మే 26: పార్లమెంట్ కొత్త భవనం ప్రారంభోత్సవం వేళ ‘రాజదండం’ చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. అధికార, విపక్షాల మధ్య రాజదండం(సెంగొల్) చరిత్ర అంశం దుమారం రేపుతోంది. పరస్పర మాటల యుద్ధానికి దారి తీస్తోంది. బ్రిటిషర్ల నుంచి అధికార బదిలీ సమయంలో అప్పటి గవర్నర్ జనరల్ మౌంట్‌బాటెన్ నుంచి దేశ మొదటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ రాజదండాన్ని అందుకున్నారని బీజేపీ చెబుతుండగా.. అదంతా కట్టుకథేనని కాంగ్రెస్
రాజదండం చుట్టూ రాజకీయం!
నెహ్రూ రాజదండం పట్టుకున్నట్లుగా కేంద్ర హోంశాఖ విడుదల చేసిన ఫొటో
పార్లమెంటు కొత్త భవనం ప్రతి భారతీయుడిని గర్వపడేలా చేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ భవనం వీడియోను ట్విటర్‌లో పోస్టు చేసిన ప్రధాని... ప్రజలు దాన్ని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయాలని కోరారు. ‘మై పార్లమెంట్ మై ప్రైడ్’ (నా పార్లమెంట్ నాకు గర్వకారణం) హ్యాష్‌ట్యాగ్‌ను వాడడం మర్చిపోవద్దని సూచించారు. అలాగే ప్రజలు తమ సొంత గొంతు (వాయిస్ ఓవర్)తో షేర్ చేయాలని, వాటిలో కొన్నింటిని తాను రీట్వీట్ చేస్తానని తెలిపారు. ప్రధాని మోదీ ఆదివారం ఉదయం పార్లమెంటు కొత్త భవనాన్ని ప్రారంభించనున్నారు. దానికి ముందు భవనం బయట హోమం, తర్వాత సర్వమత ప్రార్థనలు నిర్వహిస్తారు.
జైరాం రమేశ్ ఆరోపణలు
రాజదండంపై ప్రధాని నరేంద్ర మోదీ, ఆయన భజన బృందం కట్టుకథలు చెబుతున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాంరమేశ్ శుక్రవారం విమర్శించారు. ‘‘తమిళనాడులో రాజకీయ ప్రయోజనాల కోసమే రాజదండం కథను ఉపయోగించుకుంటున్నారు. బీజేపీ, మోదీ భజన గ్యాంగ్ వారి లక్ష్యాలకు అనుగుణంగా వాస్తవాలను వక్రీకరిస్తాయి. ఈ రాజదండాన్ని నెహ్రూకు మౌంట్‌బాటెన్ ఇచ్చినట్లు ఎక్కడా లిఖిత ఆధారాల్లేవు’’ అని ఆయన వెల్లడించారు. రాజాజీ(చక్రవర్తుల రాజగోపాలాచారి) అనుచరులు కూడా అనుచరులు కూడా బీజేపీ కథనంపై ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసినట్లు తెలిపారు.
అమిత్‌షా సీరియస్
రాజదండం అధికార బదిలీకి చిహ్నమనడానికి ఎలాంటి ఆధారాల్లేవంటూ జైరాం రమేశ్ వ్యాఖ్యానించడంపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సీరియస్ అయ్యారు. ‘‘భారతీయ సంప్రదాయాలు, సంస్కృతులను కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇంతలా ద్వేషిస్తుంది?’’ అని నిలదీశారు. తమిళనాడుకు చెందిన మఠంలోని స్వామీజీల నుంచి నెహ్రూ ఈ రాజదండాన్ని స్వీకరించారని పునరుద్ఘాటించారు. ఆ తర్వాత వాకింగ్ స్టిక్‌గా పేర్కొంటూ మ్యూజియంలో పెట్టేశారని విమర్శించారు. ‘‘ఇప్పుడు కాంగ్రెస్ మరోసారి ఆ రాజదండాన్ని అవమానిస్తోంది. భారత్‌కు స్వాతంత్య్రం వచ్చినప్పుడు ఆ రాజదండం ప్రాముఖ్యతను తమిళనాడు మఠం వెల్లడించింది. ఇప్పుడు కాంగ్రెస్ మాత్రం అదంతా బోగస్ అంటోంది. కాంగ్రెస్ తన ప్రవర్తన గురించి ఆలోచించుకోవాలి’’ అని వ్యాఖ్యానించారు. అటు తిరువావదుతురై కూడా కాంగ్రెస్ ఆరోపణలను ఖండించింది. రాజదండం అధికారమార్పిడికి చిహ్నమనే లిఖిత ఆధారాలు తమ వద్ద ఉన్నాయని పేర్కొంది. మఠం రికార్డుల్లోనూ ఆ విషయం ఉంటుందని తెలిపింది. రాజాజీ ఆహ్వానం మేరకే తమ మఠం నుంచి ప్రముఖులు ఢిల్లీకి వెళ్లారని, రాజదండాన్ని మౌంట్‌బాటెన్ నెహ్రూకు ఇచ్చారని పేర్కొంది.
టైమ్స్ మ్యాగజీన్ ఏం రాసింది?
రాజదండంపై రగడ జరుగుతున్న నేపథ్యంలో.. కేంద్ర మంత్రి హర్దీప్‌సింగ్ పురి స్పందించారు. 1947లో రాజదండంపై టైమ్ మ్యాగజీన్ ఓ కథనాన్ని ప్రచురించిందని వివరిస్తూ.. ఆ లింక్‌ను ట్విటర్‌లో షేర్ చేశారు. అయితే.. 1947లో టైమ్ మ్యాగజీన్ ప్రచురించిన కథనంలో.. రాజదండం అధికార బదిలీకి చిహ్నం అని పేర్కొనకపోవడం గమనార్హం. ‘‘1947 ఆగస్టు 14 రోజున తమిళనాడులోని తంజావూర్ నుంచి ఇద్దరు(తిరువావదుతురై) వచ్చారు. ఢిల్లీ వీధుల్లో నాదస్వరం ఊదుకుంటూ.. నెహ్రూ ఇంటికి చేరుకున్నారు. కాసేపు ఇంటి బయట నాదస్వరం ఊదాక.. లోపల నుంచి వారికి పిలుపొచ్చింది. ఇద్దరు వ్యక్తులు వారిద్దరినీ చామరాలు ఊపుతూ లోనికి తీసుకెళ్లారు. వారు నెహ్రూ నుదుటన భస్మం పూశారు. ఆ తర్వాత పీతాంబరాలను కప్పి సన్మానించారు. ఆ తర్వాత తమ వెంట తెచ్చిన బంగారు పూత ఉన్న రాజదండాన్ని నెహ్రూకు బహూకరించారు’’ అని ఆ కథనం స్పష్టం చేస్తోంది.
పార్లమెంట్ భవనానికి రాజదండం
నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం సందర్భంగా అలహాబాద్ మ్యూజియంలో ఉన్న రాజదండం ఢిల్లీకి చేరింది. ఈ సందర్భంగా అలహాబాద్ మ్యూజియం క్యూరేటర్ వామన్ వాంఖడే మాట్లాడుతూ మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ అప్పట్లో 1,200 వస్తువులను అలహాబాద్ మ్యూజియానికి ఇచ్చినట్లు వెల్లడించారు. వాటిలో రాజదండం కూడా ఉందని తెలిపారు. బంగారు పూత పూసిన 162 సెం.మీ పొడవైన ఈ రాజదండాన్ని 2022 నవంబరు 4న నేషనల్ మ్యూజియానికి తరలించినట్లు ఆయన చెప్పారు. ఈ దండాన్ని లోకసభలో స్పీకర్ పోడియం దగ్గర ప్రతిష్ఠిస్తారు.