PM Modi: మరో అద్భుతం సాధించిన ప్రధాని మోదీ!
ABN , Publish Date - Dec 26 , 2023 | 07:31 PM
ప్రధాని మోదీ మరో అద్భుత ఫీట్ సాధించారు. వ్యక్తిగత యూట్యూబ్ అకౌంట్‌కు రెండు కోట్ల పైచిలుకు సబ్‌స్క్రైబర్లు కలిగిన నేతగా రికార్డు సృష్టించారు.
ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియా, యూట్యూబ్ వంటి మాధ్యమాల ద్వారా దేశప్రజలతో, అభిమానులతో నిరంతరం టచ్‌లో ఉండే అతికొద్ది మంది నేతల్లో ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ఒకరు. అధికారిక, వ్యక్తిగత అకౌంట్లలో ఆయన పెట్టే పోస్టులు, వీడియోలను నిత్యం లక్షల్లో వీక్షిస్తుంటారు. ప్రధానికి పెద్ద సంఖ్యలో సబ్‌స్క్రైబర్లు, ఫాలోవర్లు ఉన్నారు. ఈ క్రమంలో ప్రధాని నేడు మరో అరుదైన ఘనత సాధించారు. వ్యక్తిగత యూట్యూబ్ ఛానల్‌కు (Personal Youtube Channel) 2 కోట్ల పైచిలుకు మంది సబ్‌స్క్రైబర్లు (2 Crore subscribers) కలిగిన తొలి దేశాధినేతగా రికార్డు సృష్టించారు. ప్రధాని తరువాతి స్థానంలో ఉన్న బ్రెజిల్ అధ్యక్షుడు జెయిర్ బోల్సొనారోకు (Jair Bolsonaro) కేవలం 64 లక్షల సబ్‌స్క్రైబర్లు ఉండటంతో మోదీ సాధించిన ఫీట్ మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.
అత్యధిక యూట్యూబ్ సబ్‌స్క్రైబర్లు కలిగిన రాజకీయనేతల్లో మోదీ, బోల్సోనారో తరువాతి స్థానాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ ఆక్రమించారు. ఆయనకు 1.1 మిలియన్ మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.
వ్యూస్ పరంగా, వీడియోల సంఖ్యాపరంగా కూడా ప్రధాని మోదీ యూట్యూబ్ ఛానల్ పలు ప్రత్యేకతలు సంతరించుకుంది. డిసెంబర్‌లో ప్రధాని వీడియోలకు 22.4 కోట్ల వ్యూస్ వచ్చాయి. అధ్యక్షుడు జెలెన్‌స్కీ వీడియోలకు వచ్చిన వ్యూస్ కంటే ఇవి 43 రెట్లు అధికం. ఈ నెల వ్యూస్ పరంగా జెలెన్‌స్కీ రెండో స్థానంలో ఉన్నారు. మొత్తం 4.5 బిలియన్ వ్యూస్ ఉన్న మోదీ ఛానల్, ఇతర రాజకీయనాయకుల ఛానల్స్ కంటే ముందే ఉంది.
కాగా, గత కొన్ని సంవత్సరాలుగా మోదీ రేటింగ్స్ ఇతర దేశాధినేతలతో పోలిస్తే అధికంగా ఉంటున్నాయి. గ్లోబల్ సంస్థల సర్వేల ప్రకారం, మోదీ ప్రపంచంలోనే అత్యంత పాప్యులర్ నేతగా ఉన్నారు. ప్రజామోదంలో ఆయన రేటింగ్స్ సగటున 75 శాతానికి పైనే ఉంటున్నాయని ఆయా సంస్థలు చెబుతున్నాయి. స్వదేశంలో కూడా వ్యూస్, సబ్‌స్క్రైబర్ల పరంగా మోదీకి దరిదాపుల్లోకి వచ్చే నేతలు ఎవరూ లేరు.