PM Modi : నూతన ఆర్థిక కారిడార్.. ప్రపంచ విపణికి ఆధారం!
ABN , First Publish Date - 2023-09-25T03:21:22+05:30 IST
భారత్ ప్రతిపాదించిన, జీ20 కూటమి ఆమోదించిన ఇండియా-పశ్చిమాసియా-ఐరోపా ఆర్థిక కారిడార్ ప్రపంచ వాణిజ్యానికి శతాబ్దాలపాటు ఆధారమవుతుందని ప్రధాని మోదీ అన్నారు.
‘మన్‌కీ బాత్’లో ప్రధాని మోదీ
న్యూఢిల్లీ, సెప్టెంబరు 24: భారత్ ప్రతిపాదించిన, జీ20 కూటమి ఆమోదించిన ఇండియా-పశ్చిమాసియా-ఐరోపా ఆర్థిక కారిడార్ ప్రపంచ వాణిజ్యానికి శతాబ్దాలపాటు ఆధారమవుతుందని ప్రధాని మోదీ అన్నారు. ఇది మన గడ్డపై ప్రారంభంకావడం చరిత్రలో నిలిచిపోతుందని చెప్పారు. ఆదివారం ఆకాశవాణిలో ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. శతాబ్దాల క్రితం భారత్ అగ్రగామి దేశంగా, గొప్ప వాణిజ్య శక్తిగా ఉన్న కాలంలో ‘సిల్క్ రూట్’ ఉండేదని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో భారత్-పశ్చిమాసియా-ఐరోపా ఆర్థిక కారిడార్ ఏర్పాటును భారత్ సూచించిందన్నారు. మన దేశం సాధించిన 2 అంశాలపై ఇటీవలికాలంలో తనకు లెక్కలేనన్ని లేఖలు అందాయని..అందులో ఒకటి చంద్రయాన్-3పై కాగా.. రెండోది ఢిల్లీలో నిర్వహించిన జి-20 శిఖరాగ్ర సదస్సు విజయమని చెప్పారు. ‘చంద్రయాన్-3 మహాక్విజ్’ నిర్వహిస్తున్నారని, ‘మైగవ్’ పోర్టల్‌లో నిర్వహిస్తున్న ఈ క్విజ్‌లో ఇప్పటికే 16 లక్షల మంది పాలుపంచుకున్నారని తెలిపారు.
జీ20లో ఆఫ్రికా యూనియన్‌ను సభ్యదేశంగా చేర్పించడంలో మనం విజయం సాధించామని.. ఇందుకు భారత నాయకత్వాన్ని ప్రపంచం అభినందిస్తోందని చెప్పారు. సదస్సు సమయంలో లక్ష మందికి పైగా విదేశీయులు వచ్చారని చెప్పారు. దీని వేదిక ‘భారత్ మండపం’.. ఓ సెలబ్రిటీగా మా రిందన్నారు. ‘జీ20 కూటమికి భారత్ సారథ్యం వహించిన ఏడాది పొడవునా దేశవ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాల్లో అనేక కార్యక్రమాలు జరిగాయి. ఈ కోవలో ఇప్పుడు ఢిల్లీలో ‘జీ20 యూనివర్సిటీ కనెక్ట్ ప్రోగ్రాం’ జరగనుంది. 26న జరిగే ఈ కార్యక్రమాన్ని అందరూ వీక్షించండి’అని వెల్లడించారు. గాంధీ జయంతి సందర్భంగా వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖలు ‘స్వచ్ఛతా హీ సేవా’ కార్యక్రమం చేపట్టడంపై సంతృప్తి వ్యక్తంచేశారు. కాగా పండుగ సీజన్ వచ్చేస్తోందని.. ‘వోకల్ ఫర్ లోకల్’ నినాదాన్ని ప్రజలు గుర్తుపెట్టుకోవాలని మోదీ కోరారు. ‘మేకిన్ ఇండియా ఉత్పత్తులనే కొనండి. మేడిన్ ఇండియా వస్తువులనే బహుమతులుగా ఇవ్వండి. దీనివల్ల మన కార్మికులు, కూలీలు, కళాకారులు, చేతివృత్తులవారు నేరుగా ప్రయోజనం పొందుతారు’ అని తెలిపారు.