Pillai : మరో 3 రోజులు ఈడీ కస్టడీకి పిళ్లై

ABN , First Publish Date - 2023-03-14T03:28:43+05:30 IST

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన హైదరాబాద్‌ వ్యాపారి అరుణ్‌ రామచంద్ర పిళ్లై ఈడీ కస్టడీ గడువును సీబీఐ ప్రత్యేక కోర్టు మరో మూడు రోజులు పొడిగించింది.

Pillai : మరో 3 రోజులు ఈడీ కస్టడీకి పిళ్లై

పొడిగిస్తూ ఉత్తర్వులిచ్చిన కోర్టు..

రేపు బుచ్చిబాబుతో ముఖాముఖిగా విచారణ

న్యూఢిల్లీ, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన హైదరాబాద్‌ వ్యాపారి అరుణ్‌ రామచంద్ర పిళ్లై ఈడీ కస్టడీ గడువును సీబీఐ ప్రత్యేక కోర్టు మరో మూడు రోజులు పొడిగించింది. ఈ నెల 6న పిళ్లైను ఈడీ అధికారులు అరెస్టు చేయగా.. రౌజ్‌ అవెన్యూలోని సీబీఐ ప్రత్యేక కోర్టు 7 రోజుల పాటు ఈడీ కస్టడీకి అనుమతి ఇచ్చింది. ఆ గడువు ముగియడంతో సోమవారం పిళ్లైను సీబీఐ ప్రత్యేక జడ్జి వికాస్‌ ధూల్‌ ఎదుట ప్రవేశపెట్టారు. ఈడీ తరఫున ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఎన్‌కే మట్టా వాదిస్తూ.. మద్యం విధానం రూపకల్పన క్రమంలో పలు హోటళ్లలో జరిగిన సమావేశాల్లో అరుణ్‌ పాల్గొనడంపై ప్రశ్నించాల్సి ఉందని తెలిపారు. బుచ్చిబాబు, అభిషేక్‌ బోయినపల్లి, పిళ్లై మధ్య ఉన్న సంబంధాలపై కూడా విచారణ జరపాల్సి ఉందని, అందు కోసం ఆడిటర్‌ బుచ్చిబాబుకు కూడా నోటీసులు జారీ చేశామని వెల్లడించారు.

15న విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేశామని వివరించారు. ఆ రోజున ఇద్దరినీ ముఖాముఖిగా కూర్చోబెట్టి విచారిస్తామని స్పష్టం చేశారు. కాగా, పిళ్లై తరఫు న్యాయవాది వాదిస్తూ.. కస్టడీని పొడిగించవద్దని విజ్ఞప్తి చేశారు. ఒకవేళ కస్టడీకి ఇస్తే న్యాయవాది సమక్షంలో విచారణకు అనుమతించాలని అభ్యర్థించారు. ఇప్పటి వరకు 29 సార్లు ఆయనను విచారించారని, 11 సార్లు మాత్రమే వాంగ్మూలాన్ని రికార్డు చేశారని పేర్కొన్నారు. అంటే కచ్చితంగా వారికి కావాల్సింది చెప్పించుకోవడానికి పిళ్లైను ఈడీ అధికారులు వేధించే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు.

ముడుపుల డీల్‌లో పిళ్లై కీలకం

తాను కవితకు బినామీ అంటూ గతంలో ఇచ్చిన వాంగ్మూలాన్ని ఉపసంహరించుకోవడానికి అనుమతించాలంటూ అరుణ్‌ పిళ్లై దాఖలు చేసిన పిటిషన్‌పై కొద్దిసేపు వాదనలు జరిగాయి. ఈ క్రమంలో ఈడీ కీలక విషయాన్ని లేవనెత్తింది. సౌత్‌ గ్రూపు నుంచి ఆప్‌ నేతలకు ముడుపులు చెల్లించే ఒప్పందంలో ఆయన కీలకంగా వ్యవహరించారని తెలిపారు. వాంగ్మూలం రికార్డు చేయడంలో అన్ని ప్రక్రియలను అనుసరించామని, సీసీటీవీ రికార్డు కూడా ఉందని తెలిపారు. వేధించలేదని, ఒత్తిడి చేయలేదని స్పష్టం చేశారు. చాలా ప్రభావం కలిగిన వ్యక్తి (ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత) విచారణకు హాజరయ్యే ఒక రోజు ముందు వాంగ్మూలం ఉపసంహరణకు అనుమతి కోరారని వివరించారు. కోర్టు ఆదేశాల మేరకు ఈ పిటిషన్‌కు ఈడీ సమాధానం ఇచ్చింది.

Updated Date - 2023-03-14T03:28:43+05:30 IST