దేశభక్త ప్రజాస్వామిక కూటమి

ABN , First Publish Date - 2023-06-26T01:21:59+05:30 IST

పదేళ్లపాటు (2004 నుంచి 2014 వరకు) దేశాన్ని ఏలిన ఐక్య ప్రగతిశీల కూటమి (యూపీఏ) అంతర్ధానం కానుంది. కొత్తగా కలిసిన 15 ప్రతిపక్షాలు తమ కూటమికి కొత్త పేరుపెట్టనున్నాయి. బీజేపీ సారథ్యంలోని

దేశభక్త ప్రజాస్వామిక కూటమి

ప్రతిపక్షాల కూటమికి కొత్త పేరు పీడీఏ.. యూపీఏకు చెల్లు!

సిమ్లా భేటీలో ఆమోదం?.. కూటమి కన్వీనర్‌గా నితీశ్‌ ఎన్నిక!

న్యూఢిల్లీ, జూన్‌ 25: పదేళ్లపాటు (2004 నుంచి 2014 వరకు) దేశాన్ని ఏలిన ఐక్య ప్రగతిశీల కూటమి (యూపీఏ) అంతర్ధానం కానుంది. కొత్తగా కలిసిన 15 ప్రతిపక్షాలు తమ కూటమికి కొత్త పేరుపెట్టనున్నాయి. బీజేపీ సారథ్యంలోని జాతీయ ప్రజాస్వామిక కూటమి (ఎన్‌డీఏ)కి దీటుగా దేశభక్త ప్రజాస్వామిక కూటమి (పేట్రియాటిక్‌ డెమోక్రాటిక్‌ అలయెన్స్‌-పీడీఏ) అని పేరు పెట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఇటీవల పట్నాలో జరిగిన విపక్షాల ఐక్యతా సమావేశంలో ఈ మేరకు అన్ని పార్టీలూ అంగీకరించాయని, వచ్చే నెలలో సిమ్లాలో జరిగే తదుపరి భేటీలో ఆమోద ముద్ర వేస్తాయని సమాచారం. అలాగే పట్నా భేటీలో తమ కూటమి కన్వీనర్‌గా బిహార్‌ సీఎం, జేడీయూ అధినేత నితీశ్‌కుమార్‌ను విపక్షాలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిసింది. యూపీఏ కన్వీనర్‌గా కాంగ్రెస్‌ అగ్రనేత సోనియాగాంధీ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. విపక్షాలను ఏకతాటిపైకి తీసుకొచ్చేందు కృషిచేస్తున్న నితీశ్‌.. ఆమె స్థానంలో కూటమికి నేతృత్వం వహిస్తారని కాంగ్రెసేతర విపక్షాలు అంటున్నాయి. పీడీఏ పేరును సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా గట్టిగా సమర్థించారు. పార్టీలన్నీ దీనికి అంగీకరించాయన్నారు. అయితే యూపీఏ రద్దును కాంగ్రెస్‌ అంగీకరిస్తుందా అనేది సందేహం. 19 ఏళ్లుగా ఆ కూటమికి సారథ్యం వహిస్తున్న ఆ పార్టీకి.. ఇప్పుడు కొత్త కూటమిలో అంతే గౌరవం దక్కుతుందా.. ఓ ప్రాంతీయ పార్టీ నేత నాయకత్వాన్ని ఆ పార్టీ సహిస్తుందా.. ఆమోదిస్తుందా అని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. యూపీఏ ఇప్పటికీ ఉనికిలోనే ఉందని, సోనియా దానికి సారథిగా కొనసాగుతున్నారని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రాజేశ్‌ రాథోడ్‌ అన్నారు. జాతీయ స్థాయి నేతలు మాత్రమే యూపీఏ కొనసాగాలా.. కొత్త కూటమి ఏర్పాటు చేయాలా అనే అంశాన్ని నిర్ణయించగలరని స్పష్టం చేశారు. అయితే కొత్త కూటమి పేరు పట్నా భేటీలో ప్రస్తావనకు వచ్చి ఉంటే కచ్చితంగా మీడియాకు చెప్పి ఉండేవారమని ఆర్‌జేడీ నేత మృత్యుంజయ్‌ తివారీ వ్యాఖ్యానించారు. పట్నా సమావేశంతో నితీశ్‌ ప్రతిష్ఠ జాతీయ స్థాయిలో ఇనుమడించిందని విశ్లేషకులు అంటున్నారు. అలాగే ఆర్‌జేడీ అధినేత లాలూప్రసాద్‌ యాదవ్‌ మళ్లీ రాజకీయంగా బలపడుతున్నారని చెబుతున్నారు. వీరిద్దరూ చేతులు కలపడం వల్లే 2015లో బిహార్‌లో బీజేపీ హవాకు బ్రేక్‌ పడిందని గుర్తుచేస్తున్నారు.

పీకల్లోతు అవినీతిలో ఢిల్లీ సీఎం: మాకెన్‌

విపక్షాల కూటమిలో ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) చేరడం సందేహంగానే ఉంది. పట్నా సమావేశానంతరం విడుదల చేసిన సంయుక్త ప్రకటనతో విభేదించడం ద్వారా ఆ పార్టీ బ్లాక్‌మెయిలింగ్‌ రాజకీయాలకు పాల్పడుతోందని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది. కేంద్ర పాలిత ప్రాంతమైన ఢిల్లీలో అధికార యంత్రాంగం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం చేతుల్లో ఉండాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా మోదీ సర్కారు ఢిల్లీ ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది. పార్లమెంటులో దీన్ని వ్యతిరేకించేందుకు మిగతా విపక్షాలు సుముఖత వ్యక్తం చేస్తుండగా కాంగ్రెస్‌ ఇప్పటివరకు ఏమీ తేల్చలేదు. రెండు పార్టీల మధ్య విభేదాల పరిష్కారానికి పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీతో గానీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో గానీ ప్రత్యేకంగా ‘టీ’ సమావేశానికి ఆప్‌ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ పట్నా సమావేశంలోనే ప్రతిపాదించారు. రాహుల్‌ ఇందుకు నిరాకరించారు. దీంతో కేజ్రీవాల్‌.. పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ సంయుక్త విలేకరుల సమావేశానికి డుమ్మా కొట్టారు. ఆర్డినెన్స్‌ను బిల్లుగా రాజ్యసభలో పెట్టినప్పుడు కాంగ్రెస్‌ దానికి వ్యతిరేకంగా తమకు మద్దతివ్వకపోతే భవిష్యత్తులో జరిగే విపక్షాల సమావేశాలకు హాజరు కాబోమని ఆప్‌ ముందే హెచ్చరించినా ఆ పార్టీ లెక్కచేయలేదు. రాహుల్‌ నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో తమతో సయోధ్య కాంగ్రె్‌సకు ఇష్టం లేదని ఆప్‌ నాయకత్వానికి అర్థమైంది. బిల్లుపై రాజ్యసభలో ఓటింగ్‌కు ఆ పార్టీ గైర్హాజరైనా తమ ఎంపీలకు విప్‌ జారీచేయకున్నా తమకు ఓటమి తప్పదని ఆందోళన చెందుతోంది. మరోవైపు కేజ్రీవాల్‌పై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అజయ్‌ మాకెన్‌ ఆదివారం విరుచుకుపడ్డారు. విపక్షాల ఐక్యతపై ఆయన స్పందన బీజేపీకి అనుకూలంగా ఉందన్నారు. ఐక్య కూటమికి ముం దస్తు షరతులు పెడుతూ ఆర్డినెన్స్‌పై కాంగ్రెస్‌ మద్ద తు కోరుతూ మరోపక్క రాజస్థాన్‌లో తమ సీఎం అశోక్‌ గహ్లోత్‌, సచిన్‌ పైలట్‌ తదితరులను కేజ్రీవాల్‌ అపహాస్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ‘అడ్డగోలు విమర్శలు చేసి ఆ తర్వాత మద్దతు కోరతారా? కేజ్రీవాల్‌ పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయారు. ఇప్పటికే ఆయన మంత్రులిద్దరు జైలుపాలయ్యారు. తాను కూడా జైలు శిక్షను తప్పించుకోవడానికి ఇలాంటి రాజకీయ కుయుక్తులు పన్నుతున్నారు. పార్లమెంటులో, ఢిల్లీ అసెంబ్లీలో ఆప్‌ గత చర్యలు.. బీజేపీతో దాని రహస్య పొత్తును బయటపెట్టాయి. బీజేపీకి సహకరించేందుకు, కాంగ్రె్‌సను దెబ్బతీయడానికి అవినీతి సొమ్మును ఇతర రాష్ట్రాల ఎన్నికల్లో ఉపయోగిస్తోంది’ అని స్పష్టం చేశారు.

Updated Date - 2023-06-26T01:21:59+05:30 IST